Telugu Global
Telangana

బీఆర్ఎస్ గెలుపుకోసం ఎన్నారైలు

కీలక సందర్భంలో ఎన్నారైలు మరింత చురుగ్గా పనిచేయాలని కోరారు కేటీఆర్. కేసిఆర్ నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని తమ తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

బీఆర్ఎస్ గెలుపుకోసం ఎన్నారైలు
X

బీఆర్ఎస్ గెలుపుకోసం ఎన్నారైలంతా కలసి రావాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉండాలని కోరారు, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలన్నారు. గత తెలంగాణ కష్టాలను, ప్రస్తుతం తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అవసరాన్ని, ఆవశ్యకతను సోషల్ మీడియా ద్వారా వివరించే ప్రయత్నం చేయాలని చెప్పారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారై శాఖలతో కేటీఆర్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

ఎన్నారైలకు గ్రామాల్లో గౌరవం ఉంది..

ఉన్నత చదువులు చదివి, వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులంటే గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, అలాంటి ఎన్నారైలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఇక్కడి ఓటర్లు వింటారని కేటీఆర్ అన్నారు. రాబోయే 30 రోజులు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమని చెప్పారు. కాంగ్రెస్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలసి ఉన్న తెలంగాణ 60 సంవత్సరాలు అనేక బాధలకు గురైందని.. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధి వెనక్కి పోతుందని అన్నారు కేటీఆర్.


మీ సహకారం మరువలేం..

ఉద్యమ కాలం నుంచి ఎన్నారైల సహకారం కేసీఆర్ కి ఉందని.. ఆయనతో కలిసి కదం తొక్కి అందరం కలసి తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ నిర్మాణంలోనూ అనేక పర్యాయాలు, అనేక సందర్భాలు ఎన్నారైలు కలసి నడిచారని గుర్తు చేశారు. ఈ కీలక సందర్భంలోనూ వారు మరింత చురుగ్గా పనిచేయాలని కోరారు. కేసిఆర్ నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని తమ తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఎన్నారైలను కోరారు కేటీఆర్.

First Published:  28 Oct 2023 2:11 PM GMT
Next Story