Telugu Global
Telangana

దూకుడు పెంచిన హరీష్‌-కేటీఆర్ జోడి.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా సెటైర్లు

తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో మంత్రి హరీష్‌ రావు పర్యటించగా.. కేటీఆర్ వనపర్తి జిల్లాను చుట్టేశారు. కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు జిల్లాలో మైగ్రేషన్‌-బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్‌ అంటూ హస్తం పార్టీపై సెటైర్లు వేశారు కేటీఆర్‌.

దూకుడు పెంచిన హరీష్‌-కేటీఆర్ జోడి.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా సెటైర్లు
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి జోరు మీదున్న బీఆర్ఎస్‌.. ప్రచారంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావుల జోడీ ఇప్పటికే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన ప్రగతిని వివరిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇదే టైంలో కాంగ్రెస్‌పై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

శుక్రవారం తుంగతుర్తి, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో మంత్రి హరీష్‌ రావు పర్యటించగా.. కేటీఆర్ వనపర్తి జిల్లాను చుట్టేశారు. కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు జిల్లాలో మైగ్రేషన్‌-బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్‌ అంటూ హస్తం పార్టీపై సెటైర్లు వేశారు కేటీఆర్‌. కాంగ్రెస్ పాలనలో వలపోతలు-బీఆర్ఎస్‌ పాలనలో ఎత్తిపోతలు, కాంగ్రెస్ పాలన అంటే స్కాంలు- బీఆర్ఎస్ పాలన స్కీంలు, వారంటీ అయిపోయిన కాంగ్రెస్ గ్యారెంటీ లేని హామీలు ఇస్తోందంటూ అంటూ ఆ పార్టీని టార్గెట్ చేశారు.

ఇక మంత్రి హరీష్‌ రావు సైతం చేతి గుర్తు పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. శుక్రవారం నకిరేకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌ రావు..కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. గతంలో నల్గొండ జిల్లా నుంచి గెలిచిన కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దంపతులు.. నిమ్మ రైతులకు కనీసం మార్కెట్ కూడా నిర్మించలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీరు, తాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్‌ సాధ్యమైందన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇవాళ టికెట్లు అమ్ముకుంటున్నారు.. దురదృష్టవశాత్తు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారంటూ విమర్శించారు హరీష్‌ రావు. ఇంటి ముందు జరిగిన అభివృద్ధిని-కండ్ల ముందున్న అభ్యర్థిని చూసి ఓటేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

First Published:  30 Sep 2023 5:24 AM GMT
Next Story