Telugu Global
Telangana

బడే మియా.. చోటే మియా

తెలంగాణకు బడే మియా(మోదీ) చేసిన అన్యాయంపై చోటే మియా(రేవంత్) ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు కవిత.

బడే మియా.. చోటే మియా
X

ప్రధాని మోదీ పెద్దన్న తరహాలో రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు పేల్చారు. మోదీ పెద్దన్నయ్య అయితే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎందుకు అన్యాయం చేసినట్లు..? అని ప్రశ్నించారామె. బడే మియా(మోదీ) చేసిన అన్యాయంపై చోటే మియా(రేవంత్) ఎందుకు నోరు విప్పలేదన్నారు. వీరిద్దరూ ఒక్కటే అని తాము చెబుతున్న మాటలు ఈరోజు నిజమయ్యాయి కదా అని అన్నారు కవిత. ఏసీబీ కేసులో ప్రజా ప్రతినిధులను సైతం విచారించవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ.. రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసు విచారణ త్వరితగతిన జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.


కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళిచ్చే ఆస్కారం ఉన్నా ఎందుకు పంటలు ఎండబెడుతున్నారని ప్రశ్నించారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని సాకుగా చూపి పంటలు ఎండబెడుతున్న కాంగ్రెస్ కు రైతుల ఉసురు తప్పక తగులుతుందని చెప్పారు. కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఆలోచనతోనే రైతులకు కాంగ్రెస్ నీళ్లివ్వడంలేదని మండిపడ్డారు కవిత.


ఉద్యోగ రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేస్తోందని అన్నారు కవిత. గురుకుల నియామకాల్లో ఆడబిడ్డలకు న్యాయం జరగలేదన్నారామె. 626 ఉద్యోగాల్లో 77 మాత్రమే మహిళలకు వచ్చాయని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయంపై నిరసన కార్యక్రమం చేపడతామని తేల్చి చెప్పారు. ధర్నా చౌక్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు కవిత. జీవో నెం-3 వల్ల 33 శాతం రిజర్వేషన్‌ రావాల్సి ఉన్నా.. 12 శాతమే దక్కుతోందని చెప్పారు కవిత. వెంటనే ఆ జీవోని సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేయాలన్నారు. ఇప్పుడు నియామకాలు జరుగుతున్న ఉద్యోగాలన్నిటికీ బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యాయని గుర్తు చేశారు కవిత.

First Published:  4 March 2024 11:32 AM GMT
Next Story