Telugu Global
Telangana

పాతబస్తీ మెట్రోకోసం శంకుస్థాపన.. ఎంఐఎంతో కలసి పనిచేస్తామన్న రేవంత్

హైదరాబాద్‌ అభివృద్ధికి 2050 వైబ్రంట్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. పాతబస్తీలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగు పరుస్తామన్నారు.

పాతబస్తీ మెట్రోకోసం శంకుస్థాపన.. ఎంఐఎంతో కలసి పనిచేస్తామన్న రేవంత్
X

ఎట్టకేలకు పాతబస్తీలో మెట్రో రైల్ విస్తరణకు శంకుస్థాపన జరిగింది. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమ వరకు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన ఆయన.. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని, మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.


వైబ్రంట్ మాస్టర్ ప్లాన్..

హైదరాబాద్‌ అభివృద్ధికి 2050 వైబ్రంట్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నట్టు తెలిపారు రేవంత్ రెడ్డి. పాతబస్తీలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగు పరుస్తామన్నారు. మెట్రోతో పాటు రోడ్ల విస్తరణ కూడా చేపడతామని చెప్పారాయన. రోడ్ల విస్తరణ కోసం రూ.200 కోట్లు కేటాయించామన్నారు. మూసీ నదిని 55 కిలోమీటర్ల మేర సుందరీకరిస్తున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి చూపిస్తామని అన్నారు.

మెట్రో రైలు సంపన్నులకోసమే కాదని, పేద, మధ్యతరగతి ప్రజలకోసం కూడా అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌కే కాదు పాతబస్తీకి కూడా మెట్రో ఉండాలన్నారు. చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్‌ మెట్రోలో అతిపెద్ద జంక్షన్‌ కాబోతోందని చెప్పారు. చంచల్‌గూడ జైలును ఇప్పుడున్న ప్రాంతం నుంచి తరలించి అక్కడ గొప్ప విద్యాసంస్థ ఏర్పాటు చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే నాలుగేళ్లలోనే పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి చూపిస్తామన్నారు.

రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఎంఐఎం నేతలతో కలసి మెట్రో రైలుకి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్ అభివృద్ధికి తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని చెప్పారు. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు అని చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ.

First Published:  8 March 2024 2:15 PM GMT
Next Story