Telugu Global
Telangana

వెనక్కి తగ్గిన పటేల్‌ రమేష్‌ రెడ్డి.. ఆ హామీతోనే..!

సూర్యాపేట టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రమేష్ రెడ్డి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఈ నెల 10న నామినేషన్ దాఖలుచేశారు.

వెనక్కి తగ్గిన పటేల్‌ రమేష్‌ రెడ్డి.. ఆ హామీతోనే..!
X

సూర్యాపేటలో కాంగ్రెస్ రెబల్‌ అభ్యర్థి పటేల్ రమేష్‌ రెడ్డి నామినేషన్‌ ఉపసంహరణపై సస్పెన్స్‌ వీడింది. పటేల్‌ను పోటీ నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సక్సెస్‌ అయ్యాయి. సూర్యాపేట బరి నుంచి తప్పుకునేందుకు పటేల్‌ రమేష్ రెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్‌ అధిష్టానం సూచనతో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి.. రమేష్‌ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చర్చల అనంతరం పోటీ నుంచి తప్పుకుంటానని రమేష్‌ రెడ్డి ప్రకటించారు.

సూర్యాపేట టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రమేష్ రెడ్డి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఈ నెల 10న నామినేషన్ దాఖలుచేశారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్‌. అయితే స్వయంగా కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసి మాట్లాడటంతో రమేష్‌ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆయనకు అధిష్టానం నల్లగొండ ఎంపీ సీటు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించిన పటేల్.. సూర్యాపేటలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తానని ప్ర‌క‌టించారు.

అంతకుముందు రమేష్ రెడ్డి నివాసం దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. పటేల్‌ను బుజ్జగించేందుకు వచ్చిన మల్లు రవిపై పటేల్ అభిమానులు, అనుచరులు దాడికి యత్నించారు. పటేల్‌ రమేష్‌ రెడ్డితో చర్చలు జరుపుతుండగా ఆ గదివైపు రాళ్లు రువ్వారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

First Published:  15 Nov 2023 9:56 AM GMT
Next Story