Telugu Global
Telangana

రోహిత్‌ వేముల కేసు మూసివేత.. పోలీసులు ఏం తేల్చారంటే!

రోహిత్ వేముల అసలు ఎస్సీ కాదని తేల్చారు పోలీసులు. రోహిత్ వేముల ఎస్సీ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తన కులానికి సంబంధించి నిజం బయటపడుతుందన్న భయంతోనే రోహిత్‌ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని రిపోర్టులో తెలిపారు.

రోహిత్‌ వేముల కేసు మూసివేత.. పోలీసులు ఏం తేల్చారంటే!
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్‌ వేముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోహిత్ వేముల కేసును తెలంగాణ పోలీసులు మూసివేశారు. ఈ కేసు నుంచి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ మాజీ వీసీ అప్పారావుతో పాటు అప్పటి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌ రావు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీలను కేసు నుంచి తప్పించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో రోహిత్ వేముల కేసుకు సంబంధించి క్లోజర్‌ రిపోర్టును సమర్పించారు.

రిపోర్టులో పోలీసులు ఏం చెప్పారంటే.?

రోహిత్ వేముల అసలు ఎస్సీ కాదని తేల్చారు పోలీసులు. రోహిత్ వేముల ఎస్సీ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తన కులానికి సంబంధించి నిజం బయటపడుతుందన్న భయంతోనే రోహిత్‌ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని రిపోర్టులో తెలిపారు. కుల ధృవీకరణకు సంబంధించిన పత్రాలు ఫోర్జరీ చేశారని పోలీసులు ఆరోపించారు. అయితే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఎలాంటి ఆధారాలను పోలీసులు సమర్పించలేదు. మరో 10 రోజుల్లో తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనున్న వేళ ఈ రిపోర్టు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగింది.

2016, జనవరి 17న HCUలోని తన హాస్టల్‌ గదిలో రోహిత్ వేముల సూసైడ్ చేసుకోవడం దేశ వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. రోహిత్‌ వేముల మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది. అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేశారు. దళిత, బహుజన వర్గాలకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్‌ పుట్టుకొచ్చింది. రోహిత్ వేములది ఇనిస్టిట్యూషనల్ మర్డర్‌గా పేర్కొంటూ.. యూనివర్సిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

2016లో జస్టిస్‌ ఫర్ రోహిత్ వేముల పేరుతో జరిగిన ఆందోళనలకు కాంగ్రెస్‌ మద్దతు కూడా ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన భారత్‌ జోడో యాత్రకు రోహిత్ వేముల తల్లిని సైతం రాహుల్ గాంధీ ఆహ్వానించాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఎస్సీలకు విద్యాహక్కు, గౌరవాన్ని పరిరక్షించడానికి రోహిత్ వేముల పేరుతో చట్టం తీసుకువస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రోహిత్ వేముల కేసును ఎలాంటి ఆధారాలు లేవని చూపుతూ మూసివేయడం విమర్శలకు తావిస్తోంది.

First Published:  3 May 2024 2:52 PM GMT
Next Story