Telugu Global
Telangana

తెలంగాణ బీజేపీలో మార్పులకు ఆర్ఎస్ఎస్ అడ్డు?

రాష్ట్ర అధ్యక్షుడిని మారిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని తెలంగాణ ఆర్ఎస్ఎస్ నాయకులు అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తున్నది.

తెలంగాణ బీజేపీలో మార్పులకు ఆర్ఎస్ఎస్ అడ్డు?
X

తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోమవారమే బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ అంచనా వేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించడం ఖాయమయ్యిందనే వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇప్పటికే రాష్ట్ర నాయకులు బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయినా, అధ్యక్షుడి మార్పుపై నిర్ణయం మాత్రం వెలువడలేదు.

తెలంగాణ బీజేపీలో మార్పులకు ఆర్ఎస్ఎస్ అడ్డుకుంటోందని తెలుస్తున్నది. ఎన్నికలకు మరికొన్ని వారాలే సమయం ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర అధ్యక్షుడిని మారిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని తెలంగాణ ఆర్ఎస్ఎస్ నాయకులు అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీని తనదైన శైలిలో అడ్డుకోవడంలో బండి సంజయ్ విజయం సాధించారని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తోంది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనే స్థితికి బండి సంజయ్ తీసుకొని వచ్చారని.. పార్టీ ఎదుగుదలలో సంజయ్‌ది కీలక పాత్ర అని ఆర్ఎస్ఎస్ వాదిస్తోంది.

ఇలాంటి సమయంలో పార్టీ అధ్యక్షుడి మార్పు ఆత్మహత్యాసదృశ్యమే అని చెబుతోంది. గతంతో పోలిస్తే పార్టీ ఇప్పుడు తెలంగాణలో బాగా పుంజుకుందని.. గెలిచే గ్రాఫ్ కూడా పెరిగిందని ఆర్ఎస్ఎస్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొత్తగా నియమించాలని భావిస్తున్న కిషన్ రెడ్డికి దూకుడు తక్కువని.. కొత్తగా చేరిన నాయకులు పార్టీని నడిపించలేరని కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు వాదిస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం లేదని బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేశారు.

అయితే, బీజేపీ అగ్రనేతలు మాత్రం పార్టీ అధ్యక్షుడి మార్పువైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం ఇప్పుడు ఆర్ఎస్ఎస్‌ను బుజ్జగించే పనిలో ఉన్నట్లు సమాచారం. వారితో సంప్రదింపుల అనంతరం పార్టీ నాయకత్వ మార్పుపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. బండి సంజయ్‌కి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇస్తున్నాము కాబట్టి.. ఆర్ఎస్ఎస్‌ను సంతృప్తి పరచవచ్చని భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అప్పటికీ ఒప్పుకోకపోతే పార్టీ అధ్యక్షుడి మార్పుపై వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీపై ఆర్ఎస్ఎస్ గుర్రుగా ఉన్నది. అందుకే ఇప్పుడు తెలంగాణ విషయంలో వారు ఇచ్చే సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. బండి సంజయ్ వంటి దూకుడైన నాయకుడిని తప్పించడం వల్ల హిందువుల్లో అసంతృప్తి వచ్చే అవకాశం ఉందని కూడా ఆర్ఎస్ఎస్ చెబుతోంది. అందుకే తెలంగాణ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ రోజు కూడా పలువురితో అధిష్టానం సంప్రదింపులు చేయనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాతే అధ్యక్షుడి మార్పుపై నిర్ణయం వెలువడనున్నది.

First Published:  4 July 2023 3:07 AM GMT
Next Story