Telugu Global
Telangana

వలస నేతలకు టికెట్లు.. కాంగ్రెస్‌లో చిచ్చు

ఇప్పటివరకూ 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ దాదాపు 5 స్థానాల్లో వలస నేతలకే టికెట్లు ఇచ్చింది.

వలస నేతలకు టికెట్లు.. కాంగ్రెస్‌లో చిచ్చు
X

కాంగ్రెస్‌లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక చిచ్చు రాజేస్తోంది. గెలుపు గుర్రాల పేరుతో వలస నేతలకు పెద్దపీట వేస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఆర్థికంగా బలమైన ఇతర పార్టీల నేతలను తీసుకువచ్చి మరీ టికెట్లు ఇస్తుండడం వివాదానికి దారి తీస్తోంది.

ఇప్పటివరకూ 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ దాదాపు 5 స్థానాల్లో వలస నేతలకే టికెట్లు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన గడ్డం వివేక్ కుమారుడు వంశీకి పెద్దపల్లి టికెట్ ఇచ్చింది. మరోవైపు ఇప్పటికే వివేక్ సోదరులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలోకి తీసుకువచ్చి మరీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కట్టబెట్టింది. ఇక నెల రోజుల క్రితం పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌ను మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్‌.. పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి స్థానం కట్టబెట్టింది. ఇక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌ రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్‌. ఇక వరంగల్‌లోనూ వలస నేతకే టికెట్ దక్కనుంది.

దీంతో కాంగ్రెస్‌లో ముసలం రాజుకుంది. అయితే మంత్రుల కుటుంబాలు, లేకపోతే వలస నేతలకే టికెట్లు దక్కుతున్నాయని పలువురు సీనియర్లు సీఎం రేవంత్ రెడ్డి ముందే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. నిన్నటి వరకు కార్యకర్తలను తిట్టి, కేసులు పెట్టించిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

First Published:  29 March 2024 3:35 AM GMT
Next Story