Telugu Global
Telangana

తెలంగాణ ఓట్లతో మోదీ చంద్రమండలానికి రాజవుతాడా..?

లోక్ సభ ఎన్నికలను రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు అది రెఫరెండం అంటూనే.. తన సొంత జిల్లాలో సత్తా చూపించాలని అనుకుంటున్నారు.

తెలంగాణ ఓట్లతో మోదీ చంద్రమండలానికి రాజవుతాడా..?
X

పదేళ్లలో పాలమూరుకు ఏమీ చేయని ప్రధాని మోదీ ఇప్పుడేం చేస్తారని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఓటేస్తే మోదీ చంద్రమండలానికి రాజవుతాడా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో కాంగ్రెస్ ని బీజేపీ నేతలు దొంగదెబ్బ తీశారని అన్నారు. దొంగలంతా ఒక్కటై తనను రాజకీయంగా బలహీనపరచాలని చూస్తున్నారని మండిపడ్డారు రేవంత్. మహబూబ్ నగర్ కి చెందిన వాల్మీకి బోయ సామాజికవర్గ పెద్దలతో గాంధీ భవన్ లో ఆయన సమావేశమయ్యారు. వాల్మీకిబోయలపై కాంగ్రెస్‌కు అభిమానం ఉందని, కర్నాటకలో బోయలకు రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని వివరించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ పూర్తయిన తర్వాత వాల్మీకిబోయల డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.

బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు వంశీ, మల్లు రవిపై కోపం లేదని, తనపైనే వారికి కోపం ఉందని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి, తద్వారా తనను దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. తన సొంత జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోతే.. తనని టార్గెట్ చేయాలని వారు అనుకుంటున్నారని వివరించారు. అందుకే దొంగలంతా ఒక్కటయ్యారన్నారు రేవంత్ రెడ్డి. పాలమూరుకు ఏమీ చేయని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఏం మొహం పెట్టుకొని ఓట్లడుగుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకున్న డీకే అరుణ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.

మొత్తమ్మీద తెలంగాణలో లోక్ సభ ఎన్నికలను రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనకు అది రెఫరెండం అంటూనే.. తన సొంత జిల్లాలో సత్తా చూపించాలని అనుకుంటున్నారు. లోక్ సభ ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా ప్రతిపక్షాలు విమర్శలకు మరింత పదును పెడతాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.

First Published:  30 March 2024 2:30 AM GMT
Next Story