Telugu Global
Telangana

ఎమ్మెల్యేపై పెట్రోలు.. తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ రచ్చ

ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కూడా పెట్రోల్‌ పోసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఎమ్మెల్యేపై పెట్రోలు.. తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ రచ్చ
X

చేరికలతో రాజకీయ పార్టీలు బలపడతాయా, లేదా అనే విషయం పక్కన పెడితే.. స్థానికంగా ఉన్న నేతలు మాత్రం ప్రత్యర్థులతో కలసి పనిచేసేందుకు అంతగా ఇష్టపడరు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ని దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు.. ఇలా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంది. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. ఈ లిస్ట్ ఇంకా ఉంది.. అయితే ఈ చేరికల జోరుకి వనపర్తి కాంగ్రెస్ నేతలు బ్రేక్ వేశారు.


వనపర్తిలో రచ్చ రచ్చ..

వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో చేరికల చిచ్చు రాజుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు హల్‌చల్‌ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు, మాజీ సర్పంచ్‌ గణేష్ గౌడ్.. తన అనుచరులతో కలసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరించారు. అంతే కాదు, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కూడా పెట్రోల్‌ పోసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ గణేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చేరికలను ఆపకపోతే ఆత్మాహుతికి పాల్పడతానన్నారు. తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతోపాటు, ఏకంగా ఎమ్మెల్యేపై కూడా పోయాలని చూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిన్నారెడ్డి కావాలనే తన అనుచరులతో కలసి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. పార్టీకోసం అందరూ కలసి పనిచేయాలన్నారు. వ్యక్తిగత స్వార్థాలను వదిలిపెట్టాలని సూచించారు.

First Published:  18 April 2024 8:41 AM GMT
Next Story