Telugu Global
Telangana

ఆ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి.. హైకోర్టు కీలక ఆదేశం

న్యాయస్థానం నిర్ణయంతో సస్పెండ్ అయిన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని అంటున్నారు.

ఆ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి.. హైకోర్టు కీలక ఆదేశం
X

ఇటీవల తెలంగాణలో 106 మంది ఉద్యోగులపై ఒకేసారి ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి సంచలనంగా మారింది. వారంతా బీఆర్ఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనేది అభియోగం. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఓ మీటింగ్ గురించి మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన ఫిర్యాదుతో ఉద్యోగులు బలయ్యారు. అయితే ఇప్పుడు వారికి ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వారందర్నీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఐకేపీ, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సమావేశంపై రఘునందన్ ఫిర్యాదు ఆధారంగా జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఒకేసారి 106మంది సస్పెండ్ కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులను అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. అది ప్రచార కార్యక్రమం కాదని వాదనలు వినిపించారు. దీంతో కోర్టు ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఉత్తర్వులిచ్చింది.

ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడంతో రఘునందన్ రావు కాలరెగరేశారు. బీఆర్ఎస్ ని మానసికంగా దెబ్బకొట్టానని సంబరపడ్డారు. అయితే ఉద్యోగులు మాత్రం దుమ్మెత్తిపోశారు. తమ పొట్టకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని అంటున్నారు. తిరిగి విధుల్లో చేరేందుకు వారు సిద్ధమవుతున్నారు.

First Published:  19 April 2024 7:46 AM GMT
Next Story