Telugu Global
Telangana

సెమీ డీలక్స్.. జీరో టికెట్ల భారం తగ్గించుకునే ప్రయత్నం

రాబోయే రోజుల్లో ఆర్డినరీల్లో ఉచిత ప్రయాణం అలాగే ఉంటుంది, ఎక్స్ ప్రెస్ సర్వీసులు తగ్గిపోతాయి, సెమీ డీలక్స్ లు వచ్చేస్తాయి కాబట్టి.. వాటిల్లో మాత్రం అందరూ టికెట్ కొనాల్సిందే. సో.. జీరీ టికెట్ల భారం అలా తగ్గిపోతుందనమాట.

సెమీ డీలక్స్.. జీరో టికెట్ల భారం తగ్గించుకునే ప్రయత్నం
X

గతంలో TSRTC రోజువారీ సగటు ఆదాయం రూ.16కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహాలక్ష్మి పథకం అమలు తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. తద్వారా ఆర్టీసీ ఆదాయం కూడా భారీగా పెరిగినట్టే లెక్క. కానీ అదంతా పేపర్ పై కనిపించే లెక్కలు మాత్రమే. జీరో టికెట్లను మినహాయిస్తే ఆర్టీసీకి రోజూ వస్తున్న ఆదాయం రూ.10.5 కోట్ల దగ్గర ఆగిపోయింది. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయాల్సి ఉన్నా.. నిధుల విడుదల ఆలస్యం కావడంతో ఆర్టీసీపై భారం పెరిగిపోతోంది. పైగా ఇటీవల పీఆర్సీ అమలుతో వేతనాల చెల్లింపు పెరగాల్సి ఉంది. అంటే ఆర్టీసీ ఆదాయం పెరిగితేనే పెంచిన వేతనాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అందుకే ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టిపెట్టింది.

సెమీ డీలక్స్ లు..

జీరో టికెట్ల కారణంగా ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల వల్ల ఆర్టీసీకి పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. డీలక్స్, సూపర్ లగ్జరీలో మాత్రం మహిళలు కూడా టికెట్లు తీసుకోవాల్సి ఉండటంతో.. వాటి ఆదాయానికి ఢోకా లేదు. అందుకే తెలంగాణ ఆర్టీసీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఎక్స్ ప్రెస్ ల తర్వాత సెమీ డీలక్స్ అనే కొత్త సర్వీసుని ప్రవేశ పెట్టబోతోంది. అంటే వీటి టికెట్లు సూపర్ లగ్జరీ అంత ఎక్కువ కాదు, అలాగని ఎక్స్ ప్రెస్ లాగా మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. వీటిలో ప్రయాణించాలంటే అందరూ టికెట్లు తీసుకోవాల్సిందే.

ప్రభుత్వానికి కూడా ఇది కలిసొచ్చే నిర్ణయమే. అందుకే సెమీ డీలక్స్ సర్వీసులకు అడుగులు త్వరగా పడుతున్నాయి. త్వరలో ఎక్స్ ప్రెస్ సర్వీసుల సంఖ్య తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ప్రభుత్వం తనపై భారం పడకుండా ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ఆర్డినరీల్లో ఉచిత ప్రయాణం అలాగే ఉంటుంది, ఎక్స్ ప్రెస్ సర్వీసులు తగ్గిపోతాయి సెమీ డీలక్స్ లు వచ్చేస్తాయి కాబట్టి.. వాటిల్లో మాత్రం అందరూ టికెట్ కొనాల్సిందే. సో.. జీరీ టికెట్ల భారం అలా తగ్గిపోతుందనమాట. ఆర్టీసీ రోజువారీ కళ్లజూసే ఆదాయం కూడా పెరుగుతుంది. మరి ఈ మాస్టర్ ప్లాన్ పై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో చూడాలి.

First Published:  15 April 2024 4:24 AM GMT
Next Story