Telugu Global
Telangana

కాంగ్రెస్ మేనిఫెస్టోకు తెలంగాణ సెంటిమెంట్

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమలు చేయబోయే మేనిఫెస్టో విడుదలకు తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీకారం చుడుతోందని చెప్పారు భట్టి.

కాంగ్రెస్ మేనిఫెస్టోకు తెలంగాణ సెంటిమెంట్
X

లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 6న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు నేతలు. ఈసారి మేనిఫెస్టోకు తెలంగాణ సెంటిమెంట్ జతచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. మేనిఫెస్టో విడుదలకు కూడా వేదికగా తెలంగాణను ఎంపిక చేసుకున్నారు. తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మేనిఫెస్టో విడుదల బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమలు చేయబోయే మేనిఫెస్టో విడుదలకు తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీకారం చుడుతోందని చెప్పారు భట్టి. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే కేవలం తెలంగాణలోనే ఈ కార్యక్రమం ఉంటుందా, దేశవ్యాప్తంగా మిగతా ప్రాంతాలతోపాటు తెలంగాణను కూడా ఎంపిక చేశారా అనే విషయంపై భట్టి క్లారిటీ ఇవ్వలేదు.


పాంచ్ న్యాయ్..

ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలకు విశేష ప్రచారం లభిస్తోంది. భాగస్వామ్య న్యాయ్, కిసాన్ న్యాయ్, మహిళా న్యాయ్, కార్మిక న్యాయ్, యువ న్యాయ్ వంటి కార్యక్రమాలతో మేనిఫెస్టో రూపొందించారు. పాంచ్ న్యాయ్ పేరిట ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందులో మొత్తం 25 గ్యారెంటీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. 'ఘర్ ఘర్ గ్యారంటీ' ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పాంచ్ 'న్యాయ్', 25 'గ్యారంటీ'ల గురించి ప్రజలకు వివరిస్తారు. దేశంలోని 8 కోట్ల కుటుంబాలకు ఈ గ్యారంటీల ప్రచారం చేరాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేసింది.

First Published:  30 March 2024 7:43 AM GMT
Next Story