Telugu Global
Telangana

ప్రవల్లిక విషయంలో ఏం జరిగింది? కాంగ్రెస్, బీజేపీ గురించి.. తల్లి, తమ్ముడు ఏం చెప్పారంటే..

కూలీ నాలికి వెళ్లి, రెక్కలు ముక్కలు చేసుకొని మేం మా బిడ్డలను చదివించుకుంటున్నాము.

ప్రవల్లిక విషయంలో ఏం జరిగింది? కాంగ్రెస్, బీజేపీ గురించి.. తల్లి, తమ్ముడు ఏం చెప్పారంటే..
X

అశోక్‌నగర్‌లోని ఒక వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న వరంగల్‌కు చెందిన మర్రి ప్రవల్లిక(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థిని ఆత్మహత్యపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇది ప్రభుత్వం చేసిన హత్యగా ప్రతిపక్షాలు విమర్శించాయి. మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం కారణం కాదని.. ప్రేమ వ్యవహారమే అసలు కారణమని పోలీసులు చెప్పినా ఎవరూ వినడం లేదు. కాంగ్రెస్ పార్టీ మర్రి ప్రవల్లిక ఆత్మహత్యను తమ ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మర్రి ప్రవల్లిక తల్లి, తమ్ముడు అసలు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.

నా కూతురు ప్రవల్లికను రెండేళ్లుగా హైదరాబాద్ హాస్టల్‌లో ఉంచి చదవిస్తున్నాను. కొడుకు కూడా నగరంలోనే ఉంటూ చదువుకుంటున్నాడు. కూలీనాలికి వెళ్లి, రెక్కలు ముక్కలు చేసుకొని మేం మా బిడ్డలను చదివించుకుంటున్నాము. మా కష్టాలు మా పిల్లలకు రావొద్దనే ఉద్దేశంతోనే హైదరాబాద్‌లో ఉంచి చదవిస్తున్నామని తల్లి చెప్పింది. అంతా బాగున్నదని అనుకుంటే వాడెవడో కళ్లల్లో మన్నుపోసుకున్నడు. నా బిడ్డను టార్చర్ చేసిండు. ఆ టార్చర్ భరించలేక, ఆ విషయం మాకు చెప్పలేక.. చావే మంచిదనే నిర్ణయం తీసుకున్నదని తల్లి ఆవేదన చెందింది.

నా బిడ్డ చావుకు కారణమయిన వాడిని కఠినంగా శిక్షించాలి. వాడు జీవితాంతం బయటకు రాకుండా జైల్లోనే పెట్టాలి. నా బిడ్డకు వచ్చిన పరిస్థితి మరే ఆడబిడ్డకు రాకూడదని ఆమె అన్నారు. నా బిడ్డయితే ఇప్పుడు మాకు రాదు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేసుకుంటుందని భావించాము. కానీ వాడి టార్చర్ కారణంగా చనిపోయింది. అయితే ఈ రాజకీయ పార్టీలు వాళ్ల గొడవలు వాళ్లే చూసుకోవాలి. మమ్మల్ని మాత్రం మీ రాజకీయంలోకి లాగవద్దని, ఇలా చెప్పండి.. అలా చేయండనే సలహాలు ఇవ్వొద్దని ప్రవల్లిక తల్లి వేడుకున్నారు. ఇప్పటికే నా బిడ్డ బతుకు ఆగం అయ్యింది. ఇప్పుడు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. మా దాక మాత్రం తీసుకొని రావొద్దు. నా బిడ్డ మరణానికి కారణమైన వాడికి తగిన శిక్ష విధించాలని ఆమె చేతులెత్తి నమస్కరించారు. నా బిడ్డ ఎలా అయితే ఉరేసుకొని చనిపోయిందో.. అలాగే వాడికి కూడా ఉరేసి చంపాలని ప్రవల్లిక తల్లి డిమాండ్ చేశారు.

ప్రవల్లిక తమ్ముడు ఏమన్నాడంటే..

నేను, అక్క ఉండే హాస్టల్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ఒక ఐదు నిమిషాలు నడిస్తే అక్క ఉండే హాస్టల్ వస్తుంది. వారానికి మూడు, నాలుగు సార్లైనా కలిసి మాట్లాడుకునే వాళ్లం. అక్క చావుకు శివరాం అనే వ్యక్తే కారణం. అతను వేరే అమ్మాయిల ద్వారా అక్కకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి అక్కను ఏడిపిస్తూ వస్తున్నాడు. అక్కకు ఇష్టం లేకపోయినా మాట్లాడటానికి ప్రయత్నించే వాడు. ఊరికే కాల్స్ చేయడం.. హాస్టల్ దగ్గరకు వచ్చి అందరి ముందు మాట్లాడటానికి ప్రయత్నించడం చేసేవాడు. హాస్టల్‌లో చదవుకునే సమయంలో అక్కడకు వచ్చి ఏడిపించడం. కాల్స్ లిఫ్ట్ చేయకపోతే వేరే అమ్మాయిలతో ఫోన్స్ చేయించడం చేసేవాడు. ఒక వేళ ఫోన్ ఎత్తకపోతే కొత్త నెంబర్ల నుంచి కాల్స్ చేసేవాడు.

శివరామ్ పెడుతున్న టార్చర్‌ను నాకు కానీ మా తల్లిదండ్రులకు కానీ అక్క చెప్పలేకపోయింది. ఒక వేళ ఇంట్లో చెప్తే వేరే ప్రాబ్లెమ్స్ ఏమైనా వస్తాయేమో అని అక్క భయపడింది. ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక అక్క సూసైడ్ చేసుకుందని తమ్ముడు చెప్పాడు. అక్కకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన శివరామ్‌ను ఎక్కడున్నా దొరకబట్టాలని.. ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశాడు.

ఇది ప్రభుత్వం చేసిన హత్య అని కాంగ్రెస్ వాళ్లు చెప్తున్నారు. కానీ నేను అలా భావించడం లేదు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని ప్రవల్లిక తమ్ముడు డిమాండ్ చేశాడు. ప్రభుత్వం ఏం చేసైనా సరే అక్క మరణానికి సంబంధించి మాకు సరైన న్యాయం చేయాలని కోరాడు. ప్రతీ రోజు మా ఇంటికి ఎవరో ఒకరు వచ్చి అమ్మ వాళ్లతో మాట్లాడుతున్నారు. అక్క గురించి పదే పదే ప్రశ్నిస్తుంటే అమ్మ వాళ్లు కూడా బాధతో ఇంకా కుంగిపోతున్నారు. దయచేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మీ రాజకీయాలను మా ఇంటి వద్దకు తీసుకొని రావొద్దని ప్రవల్లిక తమ్ముడు కోరాడు.



First Published:  17 Oct 2023 10:11 AM GMT
Next Story