Telugu Global
Telangana

మళ్లీ తెరపైకి టీఆర్ఎస్‌.. పేరు మార్పు ఖాయమేనా..?

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయతత్వం బ్రతకాలన్నా.. తెలంగాణ ఆత్మ గౌరవం, యాస, భాష , సంస్కృతిని కాపాడడానికి బీఆర్ఎస్‌ నుంచి TRSగా మారాల్సిన అవసరం ఉందంటూ పోస్టు పెట్టారు.

మళ్లీ తెరపైకి టీఆర్ఎస్‌.. పేరు మార్పు ఖాయమేనా..?
X

బీఆర్ఎస్ తిరిగి మళ్లీ టీఆర్ఎస్‌గా మారబోతుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఆఫ్‌ లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. తిరిగి టీఆర్ఎస్‌గా మార్చేందుకు అవసరమైన న్యాయపరమైన అంశాలను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తిరిగి పాత పేరుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాక పార్టీకి మంచి జరగలేదనే భావన చాలా మంది కార్యకర్తల్లో ఉంది. BRSగా మారిన తర్వాత పార్టీ సక్సెస్‌ కాకపోవడం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలవడం, కవిత అరెస్టు ఇలా ఏది కలిసిరాలేదని కొందరు నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ పేరు మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సైతం ఈ అంశంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ వేదికగా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయతత్వం బ్రతకాలన్నా.. తెలంగాణ ఆత్మ గౌరవం, యాస, భాష , సంస్కృతిని కాపాడడానికి బీఆర్ఎస్‌ నుంచి TRSగా మారాల్సిన అవసరం ఉందంటూ పోస్టు పెట్టారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. త్వరలోనే బీఆర్ఎస్‌.. టీఆర్ఎస్‌గా మారబోతుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ అంశం గులాబీ బాస్‌ కేసీఆర్ ఎక్కడా స్పందించలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First Published:  26 March 2024 2:34 AM GMT
Next Story