అర్జున్ రెడ్డి రివ్యూ

833

రివ్యూ: అర్జున్ రెడ్డి

రేటింగ్‌:   3 /5

తారాగణం:   విజయ్‌ దేవరకొండ, షాలినీ పాండ్యే, తదిత‌రులు

సంగీతం:    రథన్‌

నిర్మాత:    ప్రణయ్‌ రెడ్డి వంగ

దర్శకత్వం:  సందీప్‌ రెడ్డి వంగ

టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాకు ప్రీమియర్ షోలు వేయటం, వందకు పైగా స్క్రీన్ లు ప్లాన్ చేస్తే అన్నింటిలోను అడ్వాన్సు బుకింగ్ ఫుల్ కావడం అర్జున్ రెడ్డి విషయంలో మాత్రమే జరిగింది. కారణాలు ఏవైనా ఇది ఒకరకంగా మంచి పరిణామమే అని చెప్పాలి. చిన్న సినిమాలు బ్రతకడం లేదు, అన్ని పెద్ద సినిమాలే ఆడుతున్నాయి అని గగ్గోలు పెడుతున్న వాళ్ళకు అర్జున్ రెడ్డి మంచి ఉదాహరణగా నిలుస్తాడు. జనంలోకి పాజిటివ్ గా కాకుండా అనవసరమైన వివాదాలతో వెళ్ళిన అర్జున్ రెడ్డికి వాటి వల్లే ఫ్రీ పబ్లిసిటీ దొరికి ఓపెనింగ్స్ భారీగా దక్కుతున్నాయి. పెళ్లి చూపులు గ్రాండ్ సక్సెస్ తర్వాత ద్వారకా రూపంలో ఫ్లాప్ టేస్ట్ చేసిన విజయ్ దేవరకొండకు అర్జెంటుగా మరో హిట్ కావాల్సిన తరుణంలో వచ్చిన అర్జున్ రెడ్డి కోరుకున్నదాని కన్నా ఎక్కువ హైప్ దక్కించుకుంది. మరి ఇవన్ని అందుకునేలా అర్జున్ రెడ్డి ఉన్నడా లేదా చూద్దాం.

ఇది ఒక డాక్టర్ ప్రేమ కథ. అర్జున్ రెడ్డి అనే మెడికో స్టూడెంట్ ప్రీతీ అనే తన జూనియర్ ని ప్రేమిస్తాడు. తను కూడా అర్జున్ ని ఇష్టపడి సర్వం సమర్పించుకుంటుంది. ఇద్దరూ చాలా ఘాడమైన ప్రేమలో ఉంటారు. కాని వేరే కులం అనే కారణంతో ప్రీతీ తండ్రి అడ్డు చెప్పడంతో ప్రీతీ పెళ్లి మరొకరితో జరిగిపోతుంది. దీంతో మెంటల్ గా డిస్టర్బ్ అయిన అర్జున్ రెడ్డి ఇల్లు వదిలి దూరంగా ఉంటూ సకల వ్యసనాలకు బానిసగా మారి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు. భుక్తి కోసం హాస్పిటల్ లో పని చేస్తూ ఉంటాడు. ఒక సారి తాగిన మత్తులో చేసిన ఆపరేషన్ వల్ల పోలీస్ కేసులో ఇరుక్కుంటాడు అర్జున్. మరోవైపు ఎందరు అమ్మాయిలు కవ్వించినా ప్రీతీని మర్చిపోలేక రోజురోజుకి దిగజారుతూ ఉంటాడు. మరి అర్జున్ రెడ్డి లైఫ్ చివరికి ఏ మజీలీ చేరుకుంది అనేది అసలు కథ…

స్టేజి మీద అతి ఆవేశంతో ఏదేదో మాట్లాడి విమర్శలు కొనితెచ్చుకున్నాడు కాని విజయ్ దేవరకొండ ఇందులో సిన్సియర్ గా అర్జున్ రెడ్డి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసాడు. రక్తం బదులు ఒళ్ళు మొత్తం అసహనం నింపుకున్న పాత్రలో ఇతను కాకుండా ఇంకెవరినైనా ఊహించుకోవడం కష్టమే. రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రను సూపర్బ్ అనే రేంజ్ లో చేసాడు. పెళ్లి చూపులు సినిమాలో పాత్రకు పూర్తి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే అర్జున్ రెడ్డి పాత్రను ఓన్ చేసుకుని మరీ జీవించాడు. చూస్తున్నంత సేపు అర్జున్ రెడ్డి మాత్రమే కనిపిస్తాడు. హీరొయిన్ శాలిని షిండే తండ్రి చాటు బిడ్డలా, పక్కింటి అమ్మాయిగా చక్కగా చేసింది. అర్జున్ కోసం పడిచచ్చే పాత్రలో ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ తో సమానంగా కనిపిస్తుంది. కానీ స్టొరీ డిమాండ్ మేరకు సెకండ్ హాఫ్ లో మాత్రం మాయం అయిపోతుంది. హీరో ఫ్రెండ్ గా నటించిన రాహుల్ రామకృష్ణ మాత్రం టాలీవుడ్ కు మరో చక్కని కమెడియన్ ఉన్నాడని హామీ ఇచ్చేలా రఫ్ఫాడించాడు. దాదాపు విజయ్ దేవరకొండతో సమానంగా సినిమా మొత్తం కనిపిస్తాడు. సీనియర్ నటి కాంచన, కమల్ కామరాజు, రెండో హీరొయిన్ జియా శర్మ పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్రలే. కాని ఏవి వేస్ట్ కాదు. అవసరానికి తగ్గట్టు దర్శకుడు బాగా వాడుకున్నాడు.

దర్శకుడు సందీప్ వంగాలో విషయం చాలా ఉంది. ఇంటర్వ్యూస్ లో చెప్పాడు కాని అతని దర్శకత్వ ప్రతిభ స్క్రీన్ మీద చూస్తే కాని అర్థం కాదు. ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టొరీ ని అతను తెరకెక్కించిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎమోషన్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు. హీరో హీరొయిన్ మధ్య లవ్ స్టొరీ ని బోల్డ్ గా చూపించిన సందీప్ వాళ్ళిద్దరూ దూరం అయ్యాక హీరో పడే స్ట్రగుల్ ని చాలా సెన్సిటివ్ గా చూపించి శభాష్ అనిపించుకుంటాడు. లెంగ్త్ మూడు గంటలకు పైగా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే రాసుకున్న తీరు, అవసరమైన చోట హీరో ఫ్రెండ్ పాత్ర ద్వారానే కామెడీ ని రాబట్టిన టెక్నిక్ ఇవన్ని సందీప్ లో విషయాన్ని బయట పెడతాయి. పదే పదే ముద్దులు పెట్టుకోవడం కేవలం యూత్ కోసం పెట్టారేమో అనిపిస్తుంది.విసుగు రాకుండా ఇంత పెద్ద సినిమాని అందులోనూ ఒక లవ్ స్టొరీ ని చెప్పడంలో విజయవంతం అయ్యాడంటేనే సందీప్ టాలెంట్ ఏంటో తెలుస్తుంది. రాదన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. పాటలు స్క్రీన్ మీద చూస్తే బాగున్నాయి అనిపిస్తాయి. రాజు తోట కెమెరా వర్క్ తో ఇంప్రెస్ చేస్తాడు.  

అర్జున్ రెడ్డి క్లాసిక్ అనదగ్గ ఒక సీరియస్ యూత్ బేస్డ్ లవ్ స్టొరీ. చెప్పిన విధానంలో కొంత బోల్డ్ గా వెళ్ళినా కథ అందులోనూ హీరో పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి అదేమీ ఎబ్బెట్టుగా అనిపించదు. స్టైల్ ను మిస్ కాకుండానే ఎమోషన్స్ ని చాలా సున్నితంగా ఆవిష్కరించిన ఈ మూవీ మాస్ కి, ఫ్యామిలీ కి కనెక్ట్ అయ్యేది కాదు. కాని యూత్ మాత్రం వెర్రెత్తి పోయి రిపీట్ రన్ కి వెళ్ళేంత స్టఫ్ అయితే ఇందులో ఉంది. బాక్స్ ఆఫీస్ సక్సెస్ విషయంలో కూడా ఎటువంటి అనుమానం అక్కర్లేదు.

NEWS UPDATES

CINEMA UPDATES