గతంలో చక్రపాణిరెడ్డి చేసిన ఆ ఒక్క పని వల్లే కాల్పులు

127

శిల్పా చక్రపాణిరెడ్డిపై  టీడీపీ నేత అభిరుచి మధు కాల్పులు జరపడం వెనుక పాత పగ కూడా ఉందని చెబుతున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పార్టీకి చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కాల్పుల వరకు పరిస్థితి వెళ్లేందుకు కారణమైందంటున్నారు.

నిజానికి మధుది తొలి నుంచి నేర చరితే.  రౌడీ షీట్ ఉంది. కొద్ది రోజుల క్రితం తన కారుకు అడ్డు వచ్చారంటూ బైక్‌పై వెళ్తున్న ఒక యువకుడిని నడిరోడ్డుపై మధు దారుణంగా కొట్టాడు.  గతంలో టీడీపీ నేత ఫరూఖ్‌పైనా దాడికి ప్రయత్నించారు. ఇవన్నీ జరిగిన సమయంలో అభిరుచి మధు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

అదే సమయంలో చక్రపాణిరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. అభిరుచి మధు ఆగడాలు మితిమీరిపోవడంతో అతడిని పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడి హోదాలో శిల్పా చక్రపాణిరెడ్డి సస్పెండ్ చేశారు. ఇంతలోనే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి రావడంతో ఆయనకు దగ్గరయ్యాడు.  శిల్పా సోదరుడు టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమా కుటుంబం అండతో తిరిగి టీడీపీలో హవా కొనసాగిస్తున్నారు మధు.

తనను గతంలో శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినందుకు శిల్పా కుటుంబంపై కసి పెంచుకున్న అభిరుచి మధు ఎన్నికల్లోనూ తన వాహనాల్లో కత్తులు, వేటకొడవళ్లు వేసుకుని తిరిగారు. ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్ కుటుంబసభ్యులను పరామర్శించి వస్తున్న చక్రపాణిరెడ్డికి వాహనాలు అడ్డుపెట్టి మధు కాల్పులకు తెగబడ్డారు. అయితే శిల్పా అనుచరులు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఒక టీడీపీ నేత అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కత్తులు, తుపాకులతో స్వైర విహారం చేసినా ఇప్పటికీ కఠిన చర్యలు లేకపోవడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేకతగా భావించాల్సి ఉంటుంది.

Also Read:

NEWS UPDATES

CINEMA UPDATES