గుజ‌రాత్‌లో నేటితో ముగియ‌నున్న తొలి ద‌శ ప్ర‌చారం

163

గుజ‌రాత్‌లో తొలి విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారానికి నేటితో తెర ప‌డ‌నుంది. దీంతో బిజెపి, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నారు. డిసెంబ‌ర్ 9న తొలి ద‌శ‌లో 89 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 977 మంది అభ్య‌ర్దులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.

దక్షిణ గుజ‌రాత్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో జ‌రుగుతున్న‌మొద‌టి విడ‌త ఎన్నిక‌లలో ప్ర‌స్తుత గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ప్ర‌ముఖ వ్యాపార కేంద్ర‌మైన సూర‌త్‌లో కూడా తొలి ద‌శ‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌తంలో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ సీట్లు సాధించిన బిజెపి ఈ సారి కూడా ఎక్కువ స్థానాలు ల‌భిస్తాయ‌ని ఆశిస్తోంది.

మ‌రోవైపు కాంగ్రెస్ కూడా ఈ ప్రాంతాల్లో త‌మ బ‌లాన్ని పెంచుకుంది. పెద్ద‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీ ప్ర‌భావం ఈ ప్రాంతం ప్ర‌జ‌ల‌పై తీవ్రంగా ప‌డింద‌ని…వారు బిజెపిపై కోపంగా ఉన్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు భావిస్తున్నారు. బిజెపిపై వ్య‌తిరేక‌త త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని కాంగ్రెస్ ఎన్నోఆశ‌లు పెట్టుకుంది.

దేశ ప్ర‌జ‌ల దృష్టి గుజ‌రాత్‌పైనే ఉండ‌డంతో ఇరు ప్ర‌ధాన పార్టీలు ఈ ఎన్నిక‌ల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. రాహుల్‌గాంధీ, న‌రేంద్ర మోడీ ఇప్ప‌టి వ‌ర‌కు హోరాహోరీగా ప్ర‌చారం చేశారు. మాట‌ల తూటాలు పేల్చుకున్నారు. ఘాటైన విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఓట‌ర్ల‌కు గాలం వేయడానికి చేయాల్సిన ప‌నుల‌న్నీ చేశారు. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ప్ర‌చారాన్ని హీటెక్కించారు. గుజ‌రాత్ అభివృద్ధి న‌మూనాలోని డొల్ల‌త‌నాన్ని రాహుల్ గాంధీ ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తూ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేశారు.

సౌరాష్ట్ర‌, క‌చ్ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కుల భావ‌న‌. గుజ‌రాత్‌లో 11 జిల్లాలు సౌరాష్ట్ర ప‌రిధిలో ఉండ‌గా….క‌చ్ ప్రాంతంలో 10 తాలూకాలు, 939 గ్రామాలు, 6 మున్సిపాలిటీలు ఉన్నాయి.

2012 ఎన్నిక‌ల్లో సౌరాష్ట్ర‌, క‌చ్ ప్రాంతంలో ఉన్న 58 సీట్ల‌లో బిజెపి 35 స్థానాలు గెలుచుకుంటే…కాంగ్రెస్ 20 సీట్ల‌కే ప‌రిమితం అయింది. ప్ర‌స్తుతం ఆ ఈక్వేష‌న్ మార‌నున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

సూర‌త్ లో ఉన్న 12 సీట్లు బిజెపికి స‌వాలుగా మారాయి. పెద్ద‌నోట్ల ర‌ద్దు, జీఎస్టీల‌కు రిఫ‌రెండ‌మ్‌గా ఈ స్థానాలు నిల‌వ‌నున్నాయి. రాహుల్‌గాంధీ సూర‌త్‌లో వ‌ర్త‌కుల‌తో ఇప్ప‌టికే ఒక‌సారి మాట్లాడారు. వారి క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కూడా వారి బాధ‌ల‌ను పంచుకున్నారు. వారికి అండ‌గా నిలుస్తామ‌ని భరోసా ఇచ్చారు.

NEWS UPDATES

CINEMA UPDATES