జంతుబలి

214

రాజగృహ నుంచి బయలుదేరిన సిద్ధార్థుడు జ్ఞానులు, ఋషులు నివసించే ఒక పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. అటువైపు నుంచి ఒక గొర్రెల మంద సిద్ధార్థుని వైపు వచ్చింది. ఆ మందలో ఒక గొర్రెపిల్ల కుంటుతూ నడవలేక నడుస్తూఉంది. దాని కాలి నుంచి రక్తం కారుతోంది. దాని తల్లిలాగున్న మరో గొర్రె ఆ పిల్ల వైపు దీనంగా వెనక్కి తిరిగి చూస్తూ నడుస్తూ ఉంది. ఆ గొర్రెపిల్ల దీనస్థితి చూసి సిద్ధార్థుడి మనసు కరిగిపోయింది. ఆ గొర్రెపిల్లను చేతుల్లోకి ఎత్తుకుని, మృదువుగా నిమురుతూ మంద వెంట నడిచాడు. గొర్రెల కాపరి కనిపించగానే ‘ఇంత మధ్యాహ్నం పూట గొర్రెల మందను ఎక్కడికి తోలుకు వెళుతున్నా’వని అడిగాడు. దానికి గొర్రెల కాపరి ‘రాజుగారు యజ్ఞం నిర్వహిస్తున్నారు. అందులో బలి ఇవ్వడానికి నూరు గొర్రెలను, నూరు మేకలను తెమ్మని భటులు చెప్పారు. అక్కడికే వీటిని తోలుకు వెళుతున్నాను’ అని చెప్పాడు.

‘నేనూ మీతో వస్తాను’ అని ఆ గొర్రెపిల్లను మృదువుగా తన చేతుల్లో పట్టుకుని మంద వెంట నడిచాడు సిద్ధార్థుడు. నగరంలో యజ్ఞశాలను చేరాడు. యజ్ఞకుండంలో మంట మండుతూ ఉంది. అగ్నిలో ఆవు నెయ్యి పోస్తూ వైదికులు మంత్రాలు చదువుతున్నారు. రాజు పలుకుతున్నాడు. మరోవైపు ఆ గొర్రెల మందను బలి

ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి గొర్రెను బలిపీఠం మీద ఉంచి దాని మెడ నరకడానికి ఒక వైదికుడు సిద్ధం అవుతుండగా సిద్ధార్థుడు వేగంగా అక్కడికెళ్ళి ఆ వైదికుడిని ఆపాడు.

రాజువైపు తిరిగి ”రాజా! ఈ వైదికులు యజ్ఞయాగాదుల పేరుతో జంతువుల ప్రాణాలు తీయకుండా కాపాడండి. ఏ జీవి ప్రాణమైనా విలువైనదే. ప్రాణాలు

తీయగలమే గాని ప్రాణంపోసే శక్తి మనకెవరికీ లేదని మనం గ్రహించాలి. మనుషులకు వచ్చినట్లే వ్యాధులు వచ్చి, ముసలితనం వచ్చి అవీ మరణిస్తాయి. ఈలోగా కఠిన

హృదయంతో వాటి ప్రాణాలు తీయడం దేనికి? మన ప్రాణాలకు ఇతరుల నుంచి హాని కలగకూడదని మనం కోరుకుంటున్నప్పుడు, వాటి ప్రాణాలు తీయడం ధర్మం కాదు కదా ! మనం ఇతరుల నుంచి కరుణ ఆశిస్తే మనం ఇతరులపైన కూడా కరుణ చూపాలి.

ఏ ప్రాణి అయినా చావుకు భయపడుతుంది. మనిషి మరో ప్రాణిని చంపేముందు దానిస్థానంలో తనను ఊహించుకుంటే ప్రాణభయం అంటే ఏమిటో తెలుస్తుంది. అందుకే ఏ ప్రాణినీ చంపకూడదు. చంపించకూడదు. చర్య, ప్రతిచర్యల ప్రకారం కూడా చంపేవారు చంపబడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో మనం సుఖ సంతోషాల్ని కోరుకుంటే ఇతరులు ఎవ్వరికీ, ఏ ప్రాణికీ హాని కలిగించకూడదు, దుఃఖం కలిగించ కూడదు. మీరూ ఆలోచించండి’ అంటూ కరుణాపూరితంగా, శక్తివంతంగా, దృఢంగా సిద్ధార్థుడు మాట్లాడిన తీరుకు రాజుగారి మనసు మారింది.

రాజు జంతుబలిని ఆపి వేయించాడు. సిద్ధార్థుణ్ణి తమ రాజ్యంలో ఉండి ప్రజలకు కారుణ్యాన్ని బోధించమని అభ్యర్థించాడు. రాజు ప్రతిపాదనకు సిద్ధార్థుడు కృతజ్ఞతలు తెలిపి, తన సత్యాన్వేషణ గురించి చెప్పి, ఆయన దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు.

NEWS UPDATES

CINEMA UPDATES