జీలకర్రతో ఇన్ని ఉపయోగాలా?

118

జీలకర్ర అంటే తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. జీలకర్ర అంటే కేవలం వంటల్లో రుచికోసమే కాక ఒంట్లోని రుగ్మతలను కూడా తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీలకర్రలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్‌ సమస్యను దరిచేరనివ్వదు. ఉదయం పరిగడుపున జీలకర్ర పొడిని, తేనే, కొద్దిగా నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేసుకుని తింటే గ్యాస్ట్రిక్‌ సమస్యలనుంచి బయటపడవచ్చు.

అంతేకాకుండా ఒంట్లో అజీర్తిగా ఉన్నప్పుడు ఒక టీ స్ఫూన్‌ జీలకర్రను కప్పు నీటిలో వేసి బాగా మరిగించి జీలకర్ర టీని తాగితే అజీర్తి సమస్యను దూరం చేయవచ్చు. బయటిఫుడ్‌ తిన్నప్పుడు పొట్ట టైట్‌గా ఉన్నట్లుగా అనిపిస్తే జీలకర్రతో తయారైన జీరా సోడాలు లాంటి వాటిని తీసుకోవడం వల్ల ఆ ఇబ్బందినుంచి ఉపశమనం పొందవచ్చు.

మీరు దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లయితే పది గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్‌ జీలకర్ర, ఒక చిన్న అల్లంముక్కను వేసి బాగా మరిగించి గోరు వెచ్చగా అయ్యే వరకు చల్లార్చి ఆ నీటిని రోజుకు రెండు సార్లు తాగితే జలుబు, దగ్గు సమస్యల నుంచి బయటపడేయటమే కాకుండా వ్యాధినోరధక శక్తిని కూడా పెంచుతుంది.

జీలకర్రపొడితో పాటు కొంచెం పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నుంచి 15 నిముషాల తరువాత నీటితో శుభ్రంగా కడిగితే ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.

వీటితో పాటు జీలకర్రపొడితో మన జుట్టును పదిలంగా, దృఢంగా ఉంచుకోవచ్చు. నాలుగు గ్లాసుల నీటిలో ఒక టీ స్ఫూన్‌ జీలకర్రపొడిని, గుడ్డులోని తెల్ల సొనను వేసి మిశ్రమాన్ని తయారుచేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక 30 నిమిషాల తరువాత తల స్నానం చేస్తే జుట్టు దృఢంగా, కుదుళ్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఈ జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. వికారంగా, అజీర్తిగా ఉన్నట్లయితే గోరువెచ్చని పాలలో ఒక టీ స్సూన్‌ జీలకర్రపొడి, తేనెను కలిపి తాగితే బాగుంటుంది.

ఈ జీలకర్ర చిట్కాలన్నీ పెద్ద ఖర్చు లేకుండా తక్కువ సమయంలో మన వంటింట్లోనే తయారు చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

NEWS UPDATES

CINEMA UPDATES