దొంగ సొత్తుతో అసెంబ్లీలోకి ఎంటరవుతారా?- కోడెలకు జగన్‌ ఘాటు లేఖ

59

ఏపీలో నూతన అసెంబ్లీ వేదికగా ఈసారి సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైన వేళ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌… స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు ఘాటు లేఖ రాశారు. దొంగసొత్తుతో నూతన అసెంబ్లీలోకి ఎలా అడుగుపెడుతారని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలను కొంటూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోవడం వల్లే అసెంబ్లీని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలింపు ప్రక్రియ ఇంత వేగంగా జరిగిందని జగన్‌ తన లేఖలో అభిప్రాయపడ్డారు.

వైసీపీ తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు వందల కోట్లు పెట్టి కొనుగోలు చేశారని… కాబట్టి ఆ 21 మంది ఎమ్మెల్యేలు  దొంగసొత్తు కిందకే వస్తారని జగన్ చెప్పారు. కొత్త అసెంబ్లీలోకి దొంగ సొత్తు అయిన 21 మంది ఎమ్మెల్యేలను అనుమతించడం సరికాదన్నారు. ఫిరాయింపుఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము చాలాకాలంగా కోరుతున్నా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని జగన్ గుర్తుచేశారు. దొంగ సొత్తు ఎమ్మెల్యేలను కొత్త అసెంబ్లీలోకి అనుమతించడం అంటే నూతన వేదికకు కూడా మకిలి అంటించడమే అవుతుందన్నారు. మీరు ఎంత టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజ్యాంగంపై, ప్రజా తీర్పుపై గౌరవంతో వ్యవహరించాలని స్పీకర్ కోడెలను ఉద్దేశించిన లేఖలో జగన్ వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ స్థానంలో ఉండి చర్యలు తీసుకోకపోవడం అంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.

[sm-youtube-subscribe]

NEWS UPDATES

CINEMA UPDATES