నోట్లో అగ్నిప‌ర్వ‌తం

91

ఉద‌యాన్నే ఓ క‌ప్పు కాఫీ, టీవీ ఎదురుగా కూర్చుని ఏం చూస్తున్నామో తెలియ‌క‌నే కాఫీ సిప్ చేస్తాం.

అదో ఆనందం. అయితే అన్ని రోజులూ ఒక‌లాగే ఉండ‌వు. ఉన్న‌ట్లుండి ఆనందం ఆవిరైపోయి నోరు భ‌గ్గుమంటుంది.

ఒక్క సిప్పుకే భ‌గ్గుమంటుంది. నోట్లో అగ్నిప‌ర్వ‌తం పేలిన‌ట్లు. ఎలాగోలా కాఫీని మేనేజ్ చేసి రొటీన్‌లో ప‌డిపోతాం.

మ‌ధ్యాహ్నం భోజ‌నం క్యారియ‌ర్ తీయ‌గానే నోరూరించే ఆవ‌కాయ‌. క‌లిపి ముద్ద నోట్లో పెట్టుకుంటే అగ్నిప‌ర్వ‌తం మ‌రో ద‌ఫా బ‌ద్ద‌ల‌వుతుంది.

అప్పుడొస్తుంది డౌట్‌? నోటికి ఏమైంది? అని.

మౌత్ అల్స‌ర్‌!

మౌత్ అల్స‌ర్ పేరు మాత్రం అందంగా మౌత్ ఆర్గాన్ అన్నంత విన‌సొంపుగా ఉంటుంది. కానీ ఇది పెట్టే బాధ వ‌ర్ణ‌నాతీతం. క‌డుపులో అల్స‌ర్‌లాగ ఇది ప్రాణాంత‌కం కాదు. కొద్దిగా ఇబ్బంది పెట్టి మాయ‌మ‌య్యే జ‌బ్బే. కానీ ప‌ది రోగాల పెట్టు. ఆక‌ల‌వుతుంటుంది, అన్నం తిన‌లేం. నీర‌సం వ‌స్తుంటుంది, త‌ల తిరుగుతుంటుంది, ప‌డుకోవాల‌నిపిస్తుంది, ఎనిమిక్‌గా అనిపిస్తుంది… ఇవ‌న్నీ అల్స‌ర్ ల‌క్ష‌ణాలు కాదు. మౌత్ అల్స‌ర్‌కు అనుబంధ ల‌క్ష‌ణాలు. మౌత్ అల్స‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ఆహారం సరిగ్గా తిన‌క‌పోవ‌డంతో కాదు కాదు తిన‌లేక‌పోవ‌డంతో ఎదుర‌య్యే అనుబంధ స‌మ‌స్య‌లు.

మౌత్ అల్స‌ర్ ఎలా ఉంటుంది?

నోటి లోప‌ల‌, పెద‌వులు, నాలుక‌, చెంప‌ల లోప‌లి వైపు, గొంతు భాగాల్లో చిన్న గుల్ల వ‌స్తుంది. అది పుండుగా మారుతుంది. చ‌ర్మంలో ప‌గుళ్లు కూడా రావ‌చ్చు. ఎక్కువ గుల్ల‌లు కూడా రావ‌చ్చు. ఇది అన్ని వ‌య‌సుల వారికీ వ‌స్తుంటుంది. అయితే వ‌య‌సును బ‌ట్టి కార‌ణాలు మారుతుంటాయి.

 • మ‌ధ్య వ‌య‌సు , అంత‌కంటే పెద్ద‌వారిలో వ‌చ్చే అల్స‌ర్‌కు కార‌ణం స‌రైన నోటి శుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తుంటుంది.
 • మ‌హిళ‌లు, పిల్ల‌ల్లో వ‌చ్చే అల్స‌ర్ల‌లో బి కాంప్లెక్స్ విట‌మిన్ లోపం ఎక్కువ‌గా ఉంటుంది. నిజానికి బి విట‌మిన్ లోపంతో వ‌చ్చేది నోటి పూత మాత్ర‌మే. అయితే పూత‌కు ఇన్‌ఫెక్ష‌న్ తోడ‌యితేఅల్స‌ర్లుగా రూపాంత‌రం చెందుతాయి.
 • నోటి అల్స‌ర్‌తోపాటు గొంతులోని లింఫ్‌నోడ్స్ వాపు కూడా వ‌స్తుంటుంది. అయితే ఈ అల్స‌ర్ల‌న్నీ నాలుగైదు రోజులు ఇబ్బంది పెట్టి వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. అవ‌స‌ర‌మైతే యాంటీబ‌యాటిక్స్ ఒక కోర్స్ వాడితే చాలు.

ఇవి కాకుండా కొన్ని అల్స‌ర్‌లు క్యాన్స‌ర్ కార‌ణంగా వ‌స్తాయి. వాటి విష‌యంలో క‌చ్చిత‌మైన చికిత్స అవ‌స‌రం. నోట్లో వ‌చ్చిన పుండు ఏ ర‌క‌మైన‌ద‌నే సంగ‌తి మొద‌ట్లో అంచ‌నాకు రావ‌డం క‌ష్టం. కాబ‌ట్టి నాలుగు రోజులు దాటినా త‌గ్గ‌క‌పోతే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయించుకుని క్యాన్స‌ర్ పూరిత అల్స‌ర్ కాద‌ని నిర్ధార‌ణ‌కురావ‌డం లేదా క్యాన్స‌ర్ కార‌ణంగా వ‌చ్చిన అల్స‌ర్ అయితే వెంట‌నే ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. ఈ నిర్ధార‌ణ‌కు బ‌యాప్సీ ప‌రీక్ష చేయాల్సి ఉంటుంది.

అల్స‌ర్‌లు రావ‌డానికి ఆరోగ్య‌ప‌ర‌మైన కార‌ణాలివి!

 • బ్యాక్టీరియ‌ల్ జింజివోస్టోమాటైటిస్‌… ఇది  వైర‌ల్ బ్యాక్టీరియా వ‌ల్ల నోటి లోప‌ల‌, చిగుళ్ల‌కు వ‌స్తుంది.
 • హెర్పిస్ సింప్లెక్స్ వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌… ఇది కూడా వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌నే. నోటిలోప‌ల‌, పెద‌వుల ద‌గ్గ‌ర పొక్కులు వ‌స్తాయి.
 • షార్ప్ టీత్‌… కొంద‌రిలో దంతాలు వంక‌ర‌గా, కోర‌గా ఉంటాయి.  కోర‌లు చెంప‌ల‌ను తాకుతూ గాయ‌ప‌రుస్తూ ఉంటాయి. ఆ గాట్లు క్ర‌మంగా పుండు ప‌డుతుంది.
 • ల్యూకో ప్లాకియా… ఇది పొగాకు వాడ‌కం వ‌ల్ల వ‌చ్చే అల్స‌ర్‌.
 • ఓర‌ల్ క్యాన్స‌ర్
 • ఓర‌ల్ లెకెన్ ప్లాన‌స్‌… నిజానికి ఇది చ‌ర్మ వ్యాధి. ఈ వ్యాధి నోటి లోప‌ల చ‌ర్మానికి వ‌చ్చిన‌ప్పుడు చ‌ర్మం గాయ‌ప‌డి పండు అవుతుంది.
 • ఓర‌ల్ థ్ర‌ష్‌… ఇది బ్యాక్టీరియా కార‌ణంగా ఏర్ప‌డే పుండు.
 • నైకో రాండిల్‌… ఇది కొన్ని ర‌కాల మందుల వాడ‌కం, టూత్‌పేస్టులో ఉండే కెమిక‌ల్స్‌కి చ‌ర్మం ఇరిటేష‌న్‌కు గుర‌యి పుండు ఏర్ప‌డే కండిష‌న్‌.
 • వీటితోపాటు ముందు చెప్పుకున్న‌ట్లు మ‌హిళ‌లు, పిల్ల‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే పోష‌కాహార లోపంతో వ‌చ్చే నోటి పూత ప్ర‌ధాన‌మైన‌వి.

చాలా త‌క్కువ సంద‌ర్భాల‌లో జ‌న్యులోపాలు, క‌డుపులో పేగుల‌కు వ‌చ్చే క్రోన్స్ డిసీజ్‌,  గ్లూటెన్‌, అమైనో యాసిడ్ అల‌ర్జీ, ఆర్థ‌రైటిస్ వంటి కొన్ని స‌మ‌స్య‌లున్న‌ప్పుడు వాటి అనుబంధ స‌మ‌స్య‌గా నోటి అల్స‌ర్ వ‌స్తుంటుంది. ఈ స‌మ‌స్య‌లేమీ లేకుండా వ‌చ్చే మౌత్ అల్స‌ర్ ప్ర‌మాద‌కారి కాదు. పై అనారోగ్యాల‌తో క‌లిసి ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త‌లు ఎక్కువ‌గా తీసుకోవాలి.

మౌత్ అల్స‌ర్‌కు ట్రీట్‌మెంట్‌!

మొద‌ట‌గా వ్యాధి ల‌క్ష‌ణానికి చికిత్స‌చేస్తారు. అంటే మౌత్ అల్స‌ర్ కార‌ణంగా వ‌చ్చే నొప్పిని త‌గ్గించ‌డానికి మందులిస్తారు. నొప్పి త‌గ్గితే  పేషెంట్ ఆహారాన్ని స‌రిగ్గా తీసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. నీర‌సం వంటివి కూడా అదుపులోకి వ‌స్తాయి.

 • అల్స‌ర్‌కు దారి తీసిన కార‌ణాన్ని గుర్తించ‌డ‌మే ఇందులో అస‌లైన చికిత్స‌. అంటే… నోట్లో దంతాలు గుచ్చుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన‌ట్లు గుర్తిస్తే డెంటిస్టును సంప్ర‌దించి ప‌ళ్ల‌ను స‌రి చేయించుకోవాలి, భ‌విష్య‌త్తులో పున‌రావృతం కాకుండా ఉండ‌డానికి.
 • ఇందుకు కారణం టూత్ పేస్టుల్లోని ర‌సాయ‌నాలుగా గుర్తిస్తే వాటిని మార్చేయాలి.
 • నోటి శుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల బ్యాక్టీరియ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్‌లు డెవ‌ల‌ప్ అవుతున్న‌ట్లు నిర్ధార‌ణ అయితే నోటిశుభ్ర‌త పాటించ‌డ‌మే దీనికి వైద్యం. అల్స‌ర్ వ‌చ్చిన త‌ర్వాత మాత్ర‌మే కాదు నోటిశుభ్ర‌త అంద‌రికీ అన్నివేళల్లోనూ అవ‌స‌ర‌మే.
 • బి కాంప్లెక్స్ విట‌మిన్ లోప‌మైతే ఆ మాత్ర‌లు రాసిస్తారు డాక్ట‌ర్లు. అవ‌స‌రాన్ని బ‌ట్టి యాంటీబ‌యాటిక్స్ కూడా ఇస్తారు.

ఇదంతా మౌత్ అల్స‌ర్‌కు  ప్రైమ‌రీ ట్రీట్‌మెంట్‌. ఈ ట్రీట్‌మెంట్‌తో తాత్కాలికంగా త‌గ్గి మ‌ళ్లీ మౌత్ అల్స‌ర్ వ‌స్తుంటే మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి అరుదుగా క‌నిపించే కార‌ణాలను అన్వేషిస్తారు.

ఇది అంటువ్యాధి కూడా!

విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజ‌మే. అల్స‌ర్ ఉన్న వ్య‌క్తిని  ముద్దు (లిప్‌లాక్ కిస్‌) పెట్టుకుంటే మౌత్ అల్స‌ర్ రెండ‌వ వారికి కూడా వ‌స్తుంది. ఒక‌రు కొరికి ఇచ్చిన తినుబండారాల‌ను మ‌రొక‌రు తిన‌కూడ‌ద‌ని పిల్ల‌ల‌ను గ‌ట్టిగా భ‌య‌పెట్టేది ఇందుకే.

మౌత్ అల్స‌ర్‌ను నివారించ‌నూ వ‌చ్చు!

నోటి పుండుకు వైద్యం అత్యంత సులువు. అలాగే దానిని రాకుండా నివారించ‌డ‌మూ అంతే ఈజీ.

 • చాలా వ‌ర‌కు ఓర‌ల్ హైజీన్ పాటించ‌క‌పోవ‌డంతో వ‌చ్చేవే. కాబ‌ట్టి ప్రాప‌ర్ హైజీన్ పాటించ‌డం. దీని వ‌ల్ల ఇత‌ర కార‌ణాల‌తో వ‌చ్చిన అల్స‌ర్‌లు కూడా ఇన్‌ఫెక్ష‌న్‌తో విస్త‌రించ‌కుండా త్వ‌ర‌గా  త‌గ్గుతాయి.
 • పొగాకు వాడ‌కాన్ని మానేయాలి. కాఫీ, టీలు, పుల్ల‌టి ప‌దార్థాల‌ను త‌గ్గించాలి.

NEWS UPDATES

CINEMA UPDATES