బౌద్ధంలో ధ్యానం ప్రధానం

228

బౌద్ధధర్మంలో ధ్యానానికీ చాలా ప్రాధాన్యం ఉంది.

ధ్యాన సాధన చేయకుండా బౌద్ధాన్ని పూర్తిగా ఆచరించడం సాధ్యంకాదు. బౌద్ధ ధర్మ ఆచరణకు అనుకూలమైన సమతా స్థితి మనసుకు కలగాలన్నా, మన మనసు స్వరూపం మనకు తెలియాలన్నా ధ్యానమే సాధనం.

విపశ్యనా ధ్యానం

విపశ్యనా ధ్యానాన్ని రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం బుద్ధుడు కనుగొన్నాడు. ఈ ధ్యానంలో ఉండే సంబోధి పొందాడు. ఈ ధ్యానాన్ని అభ్యాసం చేయడం వల్లనే తన బోధనల లక్ష్యమైన నిర్వాణ సుఖాన్ని పొందగలిగాడు. అందువల్ల దీన్ని బౌద్ధధ్యానం అని కూడా అంటారు.

ధ్యాన విధానాలన్నీ మానసిక వత్తిడిని తగ్గించి, ప్రశాంతమైన ఆనందానుభూతులను కలగజేస్తాయి. విపశ్యనా ధ్యానంలో ఈ ప్రయోజనం సిద్ధించడంతోపాటు మనలోని దుఃఖాన్ని సమూలంగా నిర్మూలిస్తుంది.

మహాభినిష్క్రమణం తర్వాత గౌతముడు ఆలారకాలాముని వద్ద, ఉద్ధక రామ పుత్రుని వద్ద ధ్యానవిద్యలను చాలా బాగా అభ్యసించాడు.

ధ్యాన సాధనలో చాలా ప్రశాంతత లభించినప్పటికీ అప్పుడప్పుడు మనసును చికాకుపరిచేలా, దిగులు పుట్టించేలా, వేదన కలిగించేలా కొన్ని ఆలోచనలు ఆయన మనసులో ప్రవేశించేవి. దాంతో సిద్ధార్థుడు చాలా అశాంతికి లోనయ్యేవాడు.

ఈ విషయాన్ని తన గురువుల దృష్టికి తీసుకువచ్చాడు. అలాంటి ఆలోచనలను నిరోధించే మార్గం తమకు తెలియదని, వాళ్ళు తమ నిస్సహాయతను తెలియజేశారు. మాకు తెలిసిన ధ్యాన పద్ధతులన్నీ నేర్పాము. ఇంతకుమించి మాకేమీ తెలియదని చెప్పారు.

సిద్ధార్థుడు ఆలోచనలో పడ్డాడు. మనసులో అశాంతిని సమూలంగా తుడిచిపెట్టేయ గల ధ్యానమార్గంకోసం అన్వేషించాడు.

విజయం సాధించాడు.

అదే విపశ్యనా ధ్యానం.

మనలోని కామ, క్రోధ, ఈర్ష్యాసూయల వంటి హీన గుణాలను మనసు పైపొరల నుంచి తొలగించుకుంటాం. కాని ఆ గుణాలకు సంబంధించిన అవశేషాలు మన మనసు అట్టడుగు పొరల్లో దాక్కునే ఉంటాయి. వాటిని వేళ్ళతోసహా సమూలంగా తొలగించే దాకా దుఃఖం పూర్తిగా నివృత్తి కాదు. దుఃఖం పూర్తిగా తొలగిపోయేదాకా శాంతి లభించదని తెలుసుకున్నాడు సిద్ధార్థుడు.

విపశ్యనా ధ్యానంతో అంతర్ముఖుడై తనలోకి తాను ప్రవేశించి తనను తాను చూసుకోగలిగాడు. మనసులోని వికారాలను వేళ్ళతోసహా పెకలించివేయగలిగాడు. దుఃఖనివృత్తి చేసుకోగలిగాడు.

విపశ్యనా ధ్యానం అంటే శీల – సమాధి – ప్రజ్ఞల అభ్యాసం. మంచి భావంతో, మంచి సంకల్పంతో మంచి ప్రయత్నంతో శీల, సమాధులను అభ్యాసం చేసిన వారికి ప్రజ్ఞ లభిస్తుంది. ప్రజ్ఞ లభించిన సాధకుడు తన మనసులోని వికారాలను గుర్తించి వాటిలో ఒక్కొక్కదానిని తొలగించుకుంటాడు. ఇది ఒక విశిష్టమైన మానసిక నైపుణ్యం.

ధ్యానం ద్వారా వ్యక్తిత్వ వికాసాన్నీ చెబుతుంది బౌద్ధం. తనని తాను స్వతంత్రుణ్ణి గావించుకునే, అంటే ఎవరి మీదా, దేనిమీదా ఆధారపడని స్థితిని పొందే ప్రయత్నం. శిక్షణ ద్వారా మనిషి వికసిస్తాడు. అందుకు విపశ్యన సాయపడుతుంది. తనను తాను జయించిన వాడిని ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు.

మతపరమైన బోధనలతో సంబంధం లేకుండానే బుద్ధుడు మానసిక సంయమ నాన్ని, ప్రేమను బోధించాడు.

NEWS UPDATES

CINEMA UPDATES