మండు వేసవిలో చల్లని నేస్తాలు… తాటి ముంజలు

88

వేసవి అనగానే మామిడిపండ్లు, మల్లెపూలు ప్రకృతి ప్రసాదాలని చాలామందికి తెలుసు. అలాగే తాటి ముంజలు కూడా ఆ ప్రకృతి ప్రసాదించినవే. వీటిని తినడంలోనే చాలా మజా ఉంటుంది. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా, ఇంకా చెప్పాలంటే ఐస్‌ ముక్కల్లా ఉంటాయి. అందుకో ఏమోగానీ వీటిని ‘ఐస్‌ యాపిల్‌’ అని కూడా అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. వీటి లోపలి నీరు చాలా తియ్యగా ఉంటుంది. ఈ తాటి ముంజలు శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిని కన్నడలో ‘తాటి నుంగు’ అంటే, తమిళంలో ‘నుంగు’ అని అంటారు. తాటి ముంజల్లో వుండే కొబ్బరి నీళ్ళ లాంటి తియ్యటి నీళ్ళు మీదపడకుండా తినటం ఒక సరదా…వేసవిలో ప్రత్యేకంగా లభించే తాటిముంజలు, పుచ్చకాయలు భానుడి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు అత్యంత ప్రియంగా వీటిని తింటారు.

అదేవిధంగా శీతల పానియాలపై కూడా ఎక్కువ మోజు చూపుతారు. అందులో భాగంగానే వేసవి కాలంలో వచ్చే తాటిముంజలకు బలే గిరాకి పెరిగింది. ఈ ఐస్ ఆపిల్ లో  విటమిన్ బి, ఐరన్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఎ, సి విటమిన్లు, జింక్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌ వంటి బి కాంప్లెక్స్‌ వంటివి కూడా తాటి ముంజల్లో లభిస్తాయి.. పసుపు వర్ణం తోలును కలిగి తాటి ముంజలు ఆకర్షించేలా ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.

మూడు తాటి ముంజలు ఒక కొబ్బరి బోండంతో సమానమంటారు పెద్దలు. వంద గ్రాముల ముంజల్లో 43 శాతం కేలరీలుంటాయి. అయితే చాలామంది ముంజల్ని తినేటప్పుడు పై పొట్టును తీసేసి తింటారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇవి మరింత అవసరం. అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కాబట్టి తాటి ముంజల్ని తినేప్పుడు పొట్టు తీయకండి. ముంజలు ఎక్కువగా తిని కడుపు నొప్పితో అవస్థపడుతుంటే మామిడికాయ ముక్కతో దీనికి చెక్‌ పెట్టేయొచ్చు. తాటి ముంజను తొలవగానే మధ్యలో కొంత నీరు ఉంటుంది. ఆ నీరు మాత్రం నోరూరించే రుచిగా ఉంటుంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండాకాలం ఈ తాటి ముంజల్లో నీళ్లు చలువ చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ముసలి వాళ్లకి చాలా మంచిది. వీటిలో అధికంగా తేమ, తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి చిన్నారులకు, హుద్రోగులకు, షుగర్‌ వ్యాధి గ్రస్తులకు, స్థూల కాయులకు ఎంతాగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు దాహార్తికి కూడా మంచి విరుగుడు.అంతేకాదు శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాదు..అందానికీ ఎంతో మేలుచేస్తాయివి. కాలిన గాయాలకు, మచ్చలు, దద్దుర్లు వంటి సమస్యల్ని నివారించడానికి తాటిముంజల్లోని నీరు దివ్వౌషధంలా పనిచేస్తాయి.

మరిన్ని ప్రయోజనాలు…

 1. మన శరీరం బరువును తగ్గించుకోవాలనుకుంటే… ఉత్తమ మార్గం తాటిముంజలు.
 2. వికారం, వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంటే ఐస్ యాపిల్ తింటే ఆ ఫీలింగ్ తగ్గుతుంది.
 3. వేసవిలో ఆటలమ్మ వస్తే, తాటి ముంజలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 4. గర్భిణీలు తాటి ముంజలు తినడం వల్ల వారిలో మలబద్దకం సమస్య తగ్గుతుంది.
 5. నీరసం, అలసటను తాటి ముంజలు నివారించి, తక్షణ శక్తిని అందిస్తాయి.
 6. అన్ని రకాల జీర్ణ సమస్యలను నివారిస్తాయి.
 7. లివర్ సమస్యలను తగ్గించుకోవచ్చు.
 8. ముంజలో ఉండే అధిక పొటాషియం… శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడానికి అద్భుతంగా సహాయపడతుంది.
 9. వేసవి కాలంలో ప్రిక్లీ హీట్ ను తగ్గిస్తుంది.
 10. చెమట కాయలను నివారిస్తుంది.
 11. వీటి పొట్టును తీసి చర్మానికి మర్దన చేయడం వల్ల చెమటకాయలు తగ్గించడంతో పాటు, చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.
 12. తాటిముంజల్లో ఉండే ఫైటో కెమికల్, ఆంథోసయానిన్… శరీరంలో ట్యూమర్లు మరియు బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తుంది.

NEWS UPDATES

CINEMA UPDATES