వివేకం మూవీ రివ్యూ

123

రివ్యూ: వివేకం

రేటింగ్‌:   2 /5

తారాగణం:   అజిత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, వివేక్‌ ఒబేరాయ్‌, తదిత‌రులు

సంగీతం:    అనిరుధ్‌ రవిచంద్రన్‌

నిర్మాత:    సెన్ధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌, టీ.జీ. త్యాగరాజన్‌

దర్శకత్వం:  శివ

అప్పుడెప్పుడో బాలచందర్, మణిరత్నం, శంకర్ లాంటి వాళ్ళు తీసిన సినిమాలు తప్ప తమిళ డబ్బింగ్ లు తెలుగులో బాగా ఆడేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలో అసలు లేవు. అందుకే తమిళనాడు మొత్తం వివేగం జ్వరంతో ఊగిపోతూ టికెట్ల కోసం కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం అడిగేవారు పెద్దగా లేక చాలా కంఫర్టబుల్ గా టికెట్లు దొరికే పరిస్థితి ఉంది. కానీ అజిత్ కు రజినీకాంత్ రేంజ్ లో తెలుగు లో మార్కెట్ లేకపోయినా అతన్ని ఇష్టపడే వారు టాలీవుడ్ ప్రేక్షకులలో కూడా ఉన్నారు. అందుకే వివేకం సినిమాపై ఇక్కడ కూడా ఓ మోస్తరు ఆసక్తి నెలకొంది. పైగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ కావడం, మనకు కూడా బాగా పరిచయం ఉన్న వివేక్ ఓబెరాయి విలన్ గా నటించడం సినిమా మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణం అయ్యాయి. మరి రావడమే యావరేజ్ అంచనాలతో వచ్చిన వివేకం మూవీ రివ్యూ చూసి మీరే డిసైడ్ అవ్వండి.

కథ చాలా సింపుల్. అంతర్జాతీయ తీవ్రవాదులను పట్టుకునే మిషన్ మీద ఉన్న ఒక టీం లో అజిత్, వివేక్ ఒబెరాయ్ మెంబెర్స్. మరో ముగ్గురు కూడా ఉంటారు. ప్రపంచ పరిరక్షణ మొత్తం ఈ ఐదుగురి మీద వదిలేసి దేశాలన్నీ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. కృత్రిమ భూకంపాలు సృష్టించే ఉద్దేశంతో కనిపెట్టిన న్యూక్లియర్ బాంబ్ ఇండియా లో పెట్టారని ఈ టీం కి తెలుస్తుంది. దాని కోడ్ ఎక్కడో వేరే దేశంలో ఉన్న అక్షర హాసన్ కు తెలుసు. కాబట్టి ఆమెను వెతుక్కుంటూ ఒంటరిగా వెళ్తాడు అజిత్. ఆమె విలన్ ల చేతిలో ప్రాణాలు కోల్పోతూ అజిత్ కు కోడ్ ఇచ్చేస్తుంది. కాని వివేక్ ద్రోహం చేసి అది కాజేసి రివర్స్ లో అజిత్ మీద ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ స్టాంపు వేయిస్తాడు. మరి ఇందులో నుంచి మన హీరోగారు ఎలా బయటపడ్డారు అనేది వివేకం కథ.

అజిత్ గురించి కంప్లయింట్ ఏమీ లేదు. తన నుంచి దర్శకుడు ఆశించేది లేదు అనకుండా ఇచ్చాడు. వయసును కూడా లెక్క చేయకుండా బాగా కసరత్తులు కూడా చేసినట్టు కనిపిస్తుంది. చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి అజిత్ తన ఒళ్ళును హూనం చేసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. కెరీర్ బెస్ట్ అనలేం కాని వెనకటి సినిమాల కంటే ఇందులో ఇంకా స్టైలిష్ గా కనిపించి ఫాన్స్ తో విజిల్స్ వేయించుకుంటాడు. ఇక కాజల్ ది చాలా హోమ్లీ రోల్. మిషన్ మీద దూరం అయిన భర్త కోసం తపించే భార్యగా చక్కగా నటించింది. ఇక విలన్ గా వివేక్ ఓబెరాయి చాలా బాగున్నాడు. పాత్ర బాగున్నప్పటికీ అందులో డెప్త్ లేకపోవడం వల్ల మొదట స్పెషల్ గా అనిపించిన వివేక్ తర్వాత చాలా నార్మల్ గా కనిపిస్తాడు.

దర్శకుడు శివ పనితనం నచ్చి అజిత్ ఇచ్చిన మూడో అవకాశం ఇది. మొదటి రెండు సినిమాలు వీరం, వేదాలం రెండు బ్లాక్ బస్టర్ అయ్యాయి కాబట్టి నమ్మడంలో తప్పు లేదు. కాని శివ మాత్రం ఈ సారి అవకాశాన్ని పూర్తిగా వృధా చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ టెర్రరిజం అనే కాన్సెప్ట్ బాగుంది. కానీ దాని ప్రెజెంటేషన్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో చూపించాలి అనే తపనలో గాడి తప్పి అటు ఇటు కాని సినిమా తీసాడు. అజిత్ ఫాన్స్ కు సినిమా ఎలా ఉన్నా నచ్చుతుందేమో కాని సాధారణ ప్రేక్షకులకు మాత్రం కథా కథనాలు చాలా ఇంపార్టెంట్. వాటిని విస్మరించి శివ ఎంతసేపు ఫైట్ల మీద, చేజింగుల మీద దృష్టి పెట్టాడే తప్ప అసలైన టెంపో ని పూర్తిగా గాలికి వదిలేసాడు. పైగా అజిత్, వివేక్ మధ్య వార్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేయాల్సింది పోయి ఒక కొత్త దర్శకుడు తడబడుతూ తీసిన తరహాలో తీయటంతో నిర్మాత పెట్టిన భారీ ఖర్చు  కళ్ళ ముందు కనిపిస్తున్నా అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. సూపర్ హిట్స్ కి మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ ఇందులో మాత్రం చాలా పేలవమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఉన్న మూడు పాటలు కూడా ఏ మాత్రం ఇంపుగా లేవు. వెట్రి కెమెరా కొంత నయం. నిర్మాత మాత్రం రాజీ పడలేదు.

వివేకం అత్యంత  భారీ ఖర్చుతో తీసిన ఒక సాధారణ మిలిటరీ యాక్షన్ మూవీ. టేకింగ్ లో కొంత కొత్తదనం చూపించినా ముఖ్యమైన కథ మీద శ్రద్ధ పెట్టకపోవడంతో సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసేలా ఉంది వివేకం. స్టొరీ లైన్ మరీ వీక్ గా ఉండటం, టెర్రరిజం అన్నప్పుడు మరో మెయిన్ విలన్ ని ఎవరినైనా ఉంచే ప్రయత్నం చేయకపోవడం బాగా దెబ్బ తీసాయి. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు కనీస మోతాదులో కూడా లేకపోవడంతో షో పూర్తి కాకముందే లేచిపోవడం కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటె దేనిని పట్టించుకోము అనుకునే వాళ్ళకు ఓకే కాని సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా చూడడం కొంచెం కష్టమనే చెప్పాలి.

NEWS UPDATES

CINEMA UPDATES