సత్యం – అనుభవం

147

ఒక కట్టెలు కొట్టే వ్యక్తి రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టేవాడు.  ఒక్కోసారి వర్షం పడేది.  ఒక్కోసారి విపరీతంగా ఎండలు కాసేవి.  ఒక్కోసారి విపరీతంగా చలిపెట్టేది.  కాలే కడుపుతో అతను కష్టపడుతూ ఉండేవాడు.

ఆ అడవిలో ఒక సన్యాసి  తపస్సు  చేసుకుంటూ ఉండేవాడు.  అతను ఇతన్ని గమనిస్తూ ఉండేవాడు.  ఈ కట్టెలు కొట్టే వ్యక్తి రోజు రోజుకు  పెద్దవాడైపోతూ, బలహీనంగా, ఆకలితో అల్లాడుతూ నిరంతరం శ్రమించడం చూశాడు. ఒకరోజు ఆ సన్యాసి కట్టెలు కొట్టే వ్యక్తితో ”ఇంకొంచెం అడవి లోపలికి వెళ్లవచ్చు కదా!” అన్నాడు.  దానికి అతను ”ఇంకా లోపలికి ఎందుకు?  కట్టెలకోసమే కదా! లోపలికి వేళ్లేకొద్దీ దూరం పెరుగుతుంది.  ఇక్కడే కావలసినన్ని చెట్లున్నాయి కదా!” అన్నాడు.   సన్యాసి అందుకు కాదు.  నువ్వు ఇంకా కొద్దిగా లోపలికి వేళ్తే అక్కడ రాగి గనులు వున్నాయి.  అక్కడ ఒక రోజు నువ్వు సేకరించిన రాగిని నగరంలో అమ్ముకుంటే వారం రోజులు నువ్వు శ్రమపడాల్సిన పని ఉండదు” అన్నాడు.  కట్టెలు కొట్టే వ్యక్తి ”సరే! ఎందుకు ప్రయత్నించి చూడకూడదు” అనుకుని అడవిలోకి వెళ్లాడు.  అక్కడ రాగిగనులు కనిపించాయి.  వెంటనే సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చి సన్యాసి కాళ్లమీద పడ్డాడు.

సన్యాసి ”మరీ అప్పుడే ఇంత సంతోషపడిపోకు.  ఇంకాస్త లోపలికివెళ్తే అక్కడ వెండి గనులు వున్నాయి.  అక్కడ నువ్వు సేకరించే వెండితో మూడు నెలలు నిశ్చింతగా బ్రతకవచ్చు” అన్నాడు.  కట్టెలు కొట్టే వ్యక్తి మరింత లోపలికి వెళ్లి వెండిగనులు చూసి పట్టలేని ఆనందంతో తిరిగి వచ్చాడు.

సన్యాసి ”ఇంకొంత లోపలికి వేళ్తే బంగారు గనులు వున్నాయి.  సంవత్సరానికి ఒకసారి వచ్చి నీకు అవసరమైనంత పట్టుకెళ్లొచ్చు” అన్నాడు.  పరుగెత్తుకుంటూ వెళ్లి బంగారు గనుల్ని చూసి పరవశంతో ఊగిపోతూ తిరిగి వచ్చాడు.

సన్యాసి ” ఇంకాస్త లోపలికి వెళ్తే  వజ్రాల గనులు వున్నాయి” అన్నాడు. కట్టెలు  కొట్టేవాడు క్షణంలో మాయమైపోయాడు.  సన్యాసి చూస్తున్నాడు.  కావలసినన్ని వజ్రాలను మూటకట్టుకుని వచ్చి సన్యాసికి చూపి ”నాజీవితకాలానికి ఇవి సరిపోతాయి అనుకుంటాను” అన్నాడు.

సన్యాసి చిరునవ్వు నవ్వి ”మనం మళ్లీ ఎప్పుడూ కలుసుకోకపోవచ్చు.  అడవిని, రాగి గనుల్ని, వెండి గనుల్ని, బంగారు గనుల్ని, వజ్రాల గనుల్ని అన్నిటినీ మరిచిపో.  నేను నీకు ఒక అంతిమ రహస్యం చెబుతాను.  అన్నిటికన్నా విలువైన నిధి నీలో వుంది.  నీబాహ్యమైన అవసరాలన్నీ తీరాయి.  ఇప్పుడు నాలాగా ఇక్కడ కూర్చో అన్నాడు.  ఆ పేదవాడు ” అవును. నాకూ ఆశ్చర్యంగానే వుంది.  ఇప్పుడు నాకు నీవు చెప్పినవన్నీ అక్కడ ఉన్నాయని నీకు తెలుసు.  ఎందుకు ఇక్కడ కూర్చున్నావు?  ఈ ప్రశ్న మాటిమాటికీ నాలో మెదులుతోంది” అన్నాడు.

సన్యాసి ”అవన్నీ నేను చూశాను. చివర్లో వజ్రాలను కనిపెట్టినా నాగురువు ‘ఇప్పుడు ఇక్కడ కూర్చుని  లోపలికి వెళ్లు’ అన్నాడు” అని చెప్పాడు.  పేదవాడు వజ్రాలను క్రింద పడేసి ”మళ్లీ మనం కలుసుకోకపోవచ్చు.  నేను ఇంటికి తిరిగిపోదలుచుకోలేదు.  మీ పక్కనే కూర్చుంటాను.  లోపలికి వెళ్లడం ఎలాగో చెప్పండి.  నేను కట్టెలు కొట్టేవాడిని.  అడివిలోకి వెళ్లడం ఎలాగో నాకు తెలుసు.  ‘నాలోపలికి’ వెళ్లడం ఎలాగో నాకు తెలీదు” అన్నాడు.

సన్యాసి ”నీవజ్రాలు, బంగారు, వెండి,రాగి అవి ఒకప్పటికి నీచేజారిపోతాయి.  లోపలికి వెళ్లినవాడికి అవి ఎంత విలువలేనివో తెలిసివస్తుంది” అన్నాడు. ”మీరు చెప్పింది సత్యం.   మిమ్మల్ని విశ్వసిస్తున్నాను ఎందుకంటే అవన్నీ వదిలేసిన స్థితిలోనూ మీరు ఆనందంగా వున్నారు” అన్నాడు పేదవాడు.

గురువు అన్నవాడు భౌతిక స్థితి నుండి క్రమక్రమంగా మానసికస్థితికి మనల్ని తీసుకెళ్లాలి. ఆలోచన నుండి అంతరాత్మవైపు తీసుకెళ్లాలి.  మేధస్సు నుండి హృదయానికి, హృదయం నుండి అస్తిత్వానికి ప్రయాణించేలా చెయ్యాలి.

– సౌభాగ్య

NEWS UPDATES

CINEMA UPDATES