సైకిల్‌

123

ఒక జెన్‌ గురువు తన దగ్గర చదువుకునే ఐదు మంది విద్యార్థులు మార్కెట్‌ నుండి సైకిళ్ళు తొక్కుకుంటూ రావడం చూశాడు. వాళ్లందరి ముఖ కవళికల్ని పరిశీలించాడు.  వాళ్లని ప్రశ్నించాలని అనిపించింది.  వాళ్లందరూ వచ్చి సైకిళ్లు దిగారు.  గురువుగారికి అభివాదం చేశారు.  గురువుగారు మొదటి విద్యార్థుల్ని చూసి అందర్ని కూచోమని చెప్పాడు.  విద్యార్థులు గురువుగారు ఏదో ఆసక్తికరమయిన విషయాన్ని వివరించబోతున్నారనుకున్నారు.  కాసేపయ్యాక శిష్యులు విశ్రాంతి తీసుకున్నాక గురువుగారు ”మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను.  సూటిగా సమాధానమివ్వండి” అన్నాడు.  శిష్యులు సరేనన్నారు.

గురువు ”మీరు సైకిల్‌ ఎందుకు తొక్కుతున్నారు” అని అడిగారు.  ఊహించని ఆ ప్రశ్నకు అందరూ కాసేపు మౌనంగా ఉన్నారు. తరువాత మొదటి శిష్యుడు నోరు విప్పాడు. ”ఈ సంచిలోని టమేటోలని సైకిల్‌ మోస్తోంది నేను మోసే బాధ తప్పింది. అందుకని నేను సైకిల్‌ తొక్కుతున్నాను. గురువు మొదటి విద్యార్థిని అభినందించి ” నువ్వు  చురుకయినవాడివి.  ముసలివాడయ్యాక నాలాగా నీకు గూని రాదులే” అన్నాడు.

తరువాత రెండో విద్యార్థి కేసి చూశాడు గురువు.  రెండో విద్యార్థి ”నేను దార్లో ఉన్న చెట్లని,పొలాల్ని చూస్తూ హాయిగా వెళ్లడానికి ఇష్టపడతాను.  అందుకుని సైకిల్‌ తొక్కుతున్నాను” అన్నాడు. గురువు ” నీ కళ్లు తెరుచుకున్నాయి.  నువ్వు ప్రపంచాన్ని చూశావు” అన్నాడు.

మూడో విద్యార్థి ” నేను సైకిల్‌పై వెళుతూ ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ ఉంటే  గాల్లో తేలుతున్నట్లుంది. అందుకని సైకిల్‌ తొక్కాను” అన్నాడు.  గురువు ”నీమనసు ధ్యానంపై చక్రంగా సాగిపోతుంది” అన్నాడు. నాలుగో విద్యార్థి ”నేను సైకిల్‌పై వెళుతూ ఉంటే ప్రాణులన్నిటితో కలిసి పరవశంగా సాగుతున్నట్లుంటుంది” అన్నాడు. గురువు ”ఎవరికి అపకారం చెయ్యని బంగారు బాటలో నువ్వు సాగిపోతావు” అని అభినందించాడు. ఐదో విద్యార్థి ”నేను నా సైకిల్‌పై వెళ్లడానికి సైకిల్‌ తొక్కుతున్నాను.” అన్నాడు.  ఆమాటలు విన్న మరుక్షణం గురువు లేచి శిష్యుడి పాదాలకు నమస్కరించి ”నేను నీ శిష్యుణ్ణి” అన్నాడు.  జెన్‌ గురువుల మాటల్ని మన ఆలోచనల్తో అందుకోవాలంటే అవి అందవు.  వాటి అర్ధం కోసం మనం మన హృదయాన్ని అడగాలి.

– సౌభాగ్య

NEWS UPDATES

CINEMA UPDATES