అంగ‌న్‌వాడీల్లో కోటి మంది న‌కిలీ ల‌బ్దిదారుల తొలగింపు

537

దేశ వ్యాప్తంగా ఉన్న అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల‌లో దాదాపు కోటి మంది న‌కిలీ ల‌బ్దిదారుల‌ను తొల‌గించిన‌ట్లు కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేన‌కాగాంధీ వెల్ల‌డించారు. న‌కిలీ ల‌బ్దిదారుల గుర్తింపు, తొల‌గింపు అనేది నిరంత‌ర ప్ర‌క్రియ అని ఆమె తెలిపారు.

ఈ ఏడాది జూన్ నెల‌లో అసోంలో అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల‌లో చేప‌ట్టిన ఓ స‌ర్వేలో 14 ల‌క్ష‌ల మంది న‌కిలీ ల‌బ్ధిదారులున్న‌ట్లు వెలుగు చూడ‌డంతో మంత్రి సీరియ‌స్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట‌ర్ల‌న్నింటిలోనూ త‌నిఖీలు చేప‌ట్టి న‌కిలీల‌ను ఏరివేయాల‌ని ఆదేశించారు. మంత్రి ఆదేశాల‌క‌నుగుణంగా ఇప్ప‌టి వ‌ర‌కు కోటి మంది నికిలీల‌ను అధికారులు గుర్తించిన‌ట్లు తెలిసింది.

పొష‌ణ్ అభియాన్ కార్య‌క్ర‌మాన్ని ముందుండి న‌డిపిస్తున్న ప్ర‌ధాన మంత్రికి మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంగ‌న్‌వాడీ సిబ్బంది జీతాలు పెంచుతూ ప్ర‌ధాని తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆమె ప్ర‌శంసించారు. జీతాల పెంపుతో సిబ్బందిని ఉత్సాహ‌ ప‌రిచిన‌ట్లయింద‌ని… మ‌రింత మెరుగైన సేవ‌లు అందిస్తార‌ని మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

దేశ వ్యాప్తంగా 14 ల‌క్ష‌ల అంగ‌న్ వాడీ సెంట‌ర్ల‌లో 10 కోట్ల మందికి పైగా ల‌బ్ధిదారులున్నారు. వారిలో ఆరేళ్ల లోపు పిల్ల‌ల‌తో పాటు , గ‌ర్భిణిల‌కు, పాలిచ్చే త‌ల్లుల‌కు పౌష్టికాహారం అందిస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES