నాలుగేళ్ల‌లో 75,000 మంది దేశాన్ని విడిచిపోయారు….

436

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ మోడీ ప్ర‌భుత్వంపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. దేశంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు రోజురోజుకు పెరుగుతూ ఉంటే ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో ప్ర‌తిరోజు రైతులు చ‌నిపోతున్నా వాటి గురించి మాట్లాడేవారే లేర‌ని ఆమె మండిప‌డ్డారు. అదే విధంగా మోడీ ప్ర‌భుత్వం అనుసరిస్తున్న విధానాల వ‌ల్ల పారిశ్రామిక వేత్త‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆమె తెలిపారు.

పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆదాయ‌ప‌న్ను అధికారులు, సిబిఐ అధికారులు, ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు భ‌య‌పెడుతున్నార‌ని…. అందుకే గ‌త నాలుగేళ్ల‌లో 75000 మంది దేశాన్ని విడిచిపోయార‌ని ఆమె తెలిపారు. ఒక్క పారిశ్రామిక వేత్త త‌న‌తో పాటు వెయ్యి కోట్ల పెట్టుబ‌డి దేశాన్నుంచి త‌ర‌లిస్తే దేశానికి ఎంత న‌ష్టం జ‌రుగుతుందో ప్ర‌జ‌లు అర్ధం చేసుకోవాల‌ని ఆమె అన్నారు.

విదేశాల్లో దాగిన న‌ల్ల‌ధ‌నాన్ని స్వ‌దేశానికి తీసుకువ‌స్తాన‌ని హామీ ఇచ్చిన మోడీ దానికి విరుద్ధంగా చేస్తున్నార‌ని మ‌మ‌త ఫైర్ అయ్యారు. దేశం నుంచి భారీ మొత్తంలో న‌ల్ల‌ధ‌నం త‌ర‌లిపోతోంద‌ని ఆమె ఆరోపించారు. అదే విధంగా దేశంలో మైనార్టీ వ‌ర్గాల‌పై జ‌రుగుతున్నదాడుల‌ను కూడా ఆమె ఖండించారు. మ‌త‌సామ‌రస్యాన్నినెల‌కొల్పాల‌ని ఆమె ప్ర‌భుత్వానికి హితవు పలికారు. రైతుల‌ను, కార్మికుల ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవాల‌ని ఆమె ప్ర‌భుత్వానికి సూచించారు.

గుజ‌రాత్ లో ద‌ళితుల‌పై దాడులు ఎక్కువ‌య్యాయ‌ని మమ‌త బెన‌ర్జీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ద‌ళితుల‌ను దారుణంగా చంపేస్తున్న‌ప‌రిస్థితుల‌ను అదుపుచేయాల్సింది పోయి….వారి ఇళ్లోల్లో భోజ‌నాలు చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంట‌ని దీదీ ప్ర‌శ్నించారు.

త‌న‌కు హిందూ మ‌త‌మంటే అభిమాన‌మ‌ని…అలాగ‌ని ముస్లింల‌ను, క్రిస్టియ‌న్‌ల‌ను ద్వేషించే హ‌క్కు త‌న‌కు లేద‌ని ఆమె అన్నారు. రాజ్యాంగం మ‌న‌కు ఇత‌ర మ‌తాల‌ను ద్వేషించే హ‌క్కుని ఇవ్వ‌లేద‌ని ఆమె అన్నారు. మ‌త ప్రాతిప‌దిక‌న ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు సృష్టించడంలో బిజెపి బిజీ బిజీగా ఉంద‌ని ఆమె ఎద్దేవా చేశారు. కోల్‌క‌త్తాలో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో మ‌మ‌త ఈ వ్యాఖ్య‌లు చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES