మోదీ ఇందిరా గాంధీ లాంటి వారా!

522

కొన్ని సార్లు వ్యక్తులు చరిత్రగతి మారుస్తారు. కాని చరిత్రలో భాగంగానే వారు ఆ పని చేయగలుగుతారు. 2017 నవంబర్ 19న ఇందిరా గాంధీ శతజయంతి సందర్భంగా నరేంద్ర మోదీని ఆమెతో పోల్చి కొంత చర్చ జరిగింది. కాని చరిత్రలో భాగంగానే వ్యక్తులు చరిత్ర గతిని మారుస్తారన్న అభిప్రాయం ఆ సందర్భంగా గమనించలేదు. కొంత మంది వ్యాఖ్యాతలు ఇద్దరి మధ్య సామ్యం ఉందని తొందరపడి వ్యాఖ్యానాలు చేశారు. మరికొంతమంది ఇది ఇద్దరిలో ఉన్న ఉత్తమ లక్షణాలు తెలియజెప్పే ప్రయత్నం కింద కొట్టి పారేశారు. ఇందిరా గాంధీ, నరేంద్ర మోదీ వ్యక్తిత్వాల మధ్య చాలా తేడాలున్నాయి. విధాన పరంగా వారి మధ్య చాలా అంతరం ఉంది. వారి చారిత్రక పరిస్థితులు కూడా భిన్నమైనవి. అంతమాత్రం చేత వారి మధ్య ఉన్న సామ్యాన్ని విస్మరించలేం. చారిత్రకంగా పోల్చి చూసినప్పుడు సామ్యాలను, పొసగని అంశాలను కూడా బేరీజు వేయాలి. ఇది కేవలం సామ్యాలను వెతకడానికో, విభేదాలను ఎత్తి చూపడానికో కాదు. ఈ దృష్టితో చూస్తే ఇద్దరినీ పోల్చి చూడడంవల్ల అనేక విషయాలు బయటపడొచ్చు.

వారిద్దరి మధ్య ఉన్న తేడాల్లో ప్రధానమైంది రాజకీయాలలో వారు ఎదిగిన పద్ధతి. ఇందిరా గాంధీకి ఉన్న అర్హతల్లా ఆమె తండ్రి ఉత్తరదాయిత్వమే. ఆమెకు సొంతంగా రాజకీయ పునాది ఏమీ లేదు. ఒక ప్రాంతంలో కాని కాంగ్రెస్ లో కాని ఆమెకు ప్రత్యేక స్థానంగాని, పట్టుగాని ఏమీ లేదు. ఆమెకు అధికారం అప్పగిస్తే తమ ఇష్టానుసారం ఆడించవచ్చుననుకుని “సిండికెట్” నాయకులు ఆమెను ప్రధానమంత్రిని చేశారు. సిండికేట్ అంటే కాంగ్రెస్ లో వృద్ధ తరం నాయకులే. ఆమె అధికారం చేపట్టడానికి “ఇందిర గాలి” ఏమీ లేదు. ఆమె దాన్ని సృష్టించుకోవలసి వచ్చింది. అందువల్ల అధికారం చేపట్టినప్పుడు ఆమె కత్తి మీద సాము చేయవలసి వచ్చింది. మోదీ పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకు అపారమైన పలుకుబడి ఉన్నందువల్ల అధికారంలోకి వచ్చారు. గుజరాత్ లో ఆయనకు మంచి పట్టు ఉండేది. అక్కడ పార్టీ అగ్ర నాయకులను ఆయన పక్కనపెట్ట గలిగారు. ఇందిరా గాంధీ ఈ పని చేయడానికి కొంత సమయం పట్టింది. అనేక ఎత్తులు జిత్తులు అనుసరించవలసి వచ్చింది. మోదీ మొదటి నుంచే ఆ పని చేశారు. కాలం గడిచిన కొద్దీ ఇద్దరూ విధనాలను అద్భుతాలుగా చూపగలిగారు. ప్రధానమంత్రి అంటే సర్వం సహాధికారి అని ఇద్దరూ రుజువు చేశారు.

బలహీనమైన నాయకులు సంక్షోభాలను ఎదుర్కుంటారు, బలమైన నేతలు సంక్షోభాలను సృష్టిస్తారు అన్నది రాజకీయాలలో నానుడి. మోదీ, ఇందిరా గాంధీ ఇద్దరూ రెండవ రకం నాయకులే. అందులో సందేహం లేదు. ఇందిరా గాంధీ కొంత కాలం తర్వాతే ఆ పని చేయగలిగారు. మొదట్లో ఆమె తీసుకున్న రూపాయి విలువ తగ్గింపు వంటి నిర్ణయాలు పరిస్థితినిబట్టి తీసుకున్నవే. పరిస్థితి అప్పుడు ఆమె చేతిలో లేదు. కాని త్వరలోనే ఆమె సంక్షోభాలు సృష్టించే స్థాయికి చేరారు. అది రాష్ట్రపతి పదవికి ఎన్నిక, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు మొదలైనవి కావచ్చు. ఆత్యయిక పరిస్థితి అమలు చేయడం సరే సరి. కాంగ్రెస్ పార్టీని చీల్చడం, పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను గతి తప్పించడం, సుప్రీంకోర్టు నిర్ణయాలను నిరాకరించడం, ప్రాథమిక హక్కులను హరించడం వంటి నిర్ణయాలు ఇందిర తీసుకున్నారు. సంక్షోభాన్ని నివారించడానికి ఇది మార్గం కాదు అని ఎన్నడూ అనుకోలేదు. వాటిని నివారించవచ్చునని కూడా భావించలేదు. నిజానికి ఆ సంక్షోభాలన్నీ ఆమె సృష్టించినవే. మరో వేపున మోదీకి ఏ అడ్డంకీ లేదు. దశాబ్దాలుగా పెంచి పోషించిన స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను ఆయన ఎందుకూ కొరగాకుండా చేసి సంక్షోభం సృష్టించారు. ప్రభుత్వ అధీనంలోని విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి రిజర్వూ బ్యాంకు దాకా అన్ని వ్యవస్థలూ ఆయన దృష్టిలో బలాదూరే. తన అనాలోచిత చర్యల నుంచి వాటిని కాపాడాలన్న ధ్యాసే ఆయనకు లేదు.

కాని విధానాల విషయంలో ప్రధానమంత్రులుగా ఉన్న ఈ ఇద్దరి మధ్య అపారమైన అంతరం ఉంది. ఇందిరా గాంధీ అనుసరించిన విధానాల వెనక స్పష్టమైన సోషలిస్టు వాగాడంబరం ఉంది. ఒక్క అత్యవసర పరిస్థితిని మినహాయిస్తే ఇవేవీ పనిగట్టుకుని పేదలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కావు. ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు సంపన్నులకు వ్యతిరేకమైనవి కూడా. మోదీ విధానాలు పూర్తిగా జనాకర్షకమైనవి. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) పేదలను కుంగ దీశాయి. జాతి కోసం పేదలు “త్యాగం” చేయాలని చెప్పారు. ఆ త్యాగాల వల్ల సంపన్నులకే మేలు కలిగింది. కొంత మంది వ్యాఖ్యాతలు మోదీ అనుసరించిన ఈ దిగ్భ్రాంతికరమైన, విస్మయం కలిగించే విధానాలు నిరంకుశత్వానికి చిహ్నమని, అది హిందుత్వ దృష్టిలో రాజరికానికి సంబంధించిందని, యూరప్ లోని ఫాసిజం కాదని అన్నారు. ఆ ఫాసిజం మోదీ అనుసరించే హిందూత్వ సిద్ధాంతం ఒక లాంటివే.

ఈ ఇద్దరు ప్రధానమంత్రులు అనుసరించిన పద్ధతి వారి ప్రతిభ మీద ఆధారపడిందే అన్న వారు కూడా ఉన్నారు. ఇందిరా గాంధీకి తన మంత్రివర్గం మీద నమ్మకం ఉండేది కాదు. కాని ఆమె చుట్టూ చిన్న ముఠా ఉండేది. అందులో ఆమె సలహాదార్లుగా కొంతమంది సాంకేతిక నిపుణులు ఉండే వారు. వారిని ఎంపిక చేసింది ఆమే. వీరందరూ పురుషులే. కాని వారికి ప్రతిభ, నిజాయితీ ఉండేది. మోదీ చుట్టూ ఎలాంటి ప్రతిభా లేదు. అమిత్ షా ఎన్నికలలో విజయం సాధించగల వ్యూహాలు పన్నగలరేమో కాని ఇందిరా గాంధీని సమర్థించిన పి.ఎన్.హక్సర్ కు ఉన్న ప్రతిభ లేదు. లేదా నెహ్రూకు వి.కె.కృష్ణమీనన్, పి.సి. మహలనోబిస్ అందించిన అండలాంటిదీ కాదు.

మోదీ ప్రభుత్వంలో ప్రతిభావంతులు లేకపోవడానికి కారణం సంఘ్ పరివార్ కు ప్రతిభ అంటే కిట్టకపోవడమే. సంఘ్ పరివార వాతావరణంలో హేతుబద్ధతకు స్థానం ఉండదు. అది సాధికారికమైంది కాదు. అందువల్ల దాన్ని త్యజించవచ్చు. అందువల్ల మేధావులు, ఆలొఅచనాపరులకు స్థానం లేకపోయినా సమర్థులైన వృత్తి నిపుణులను ఆకర్షించడానికి కూడా ప్రయత్నించరు. క్రమశిక్షణకు మారు పేరు కాని కాంగ్రెస్ ఉపజ్ఞ ఉన్నవారిని ఆకర్షించేది. ఇందిరా గాంధీ సిద్ధాంత రహితమైన రాజకీయాలను అనుసరించారన్న విమర్శ ఉన్నా ఇది వాస్తవం. బీజేపీ ప్రధానంగా కార్యకర్తల మీద ఆధారపడే పార్టీ. అందులో మేధా సంపత్తి ఉన్న వారు చేరరు. రాజకీయంగా ఎదగాలంటే ఆ పార్టీలో ఆర్.ఎస్.ఎస్. ఆశీస్సులు అవసరం. ఇది సాధ్యం కావాలంటే మతాంధత, నిర్హేతుకత ఉన్న వారి అండ ఉండాలి. ఇలాంటి చోట ప్రతిభ వికసించదు.

కాని ఈ ఇద్దరు నాయకుల వ్యక్తిత్వంలోనే అపారమైన తేడా ఉంది. రాజకీయ అనుభవంలో కూడా వ్యత్యాసం ఉంది. “వ్యక్తి ఆరాధన”ను ప్రోత్సహించడంలో, అనుసరించవలసిన పద్ధతులను అనుసరించకపోవడంలో మూదీ కూడా ఇందిరా గాంధీలాగే వ్యవహరిస్తారు. ఇందిరాగాంధీకి అహంకారం ఉన్నా అది ఆధునిక ఉదారవాద సంప్రదాయానుగుణమైంది. రాజకీయాల్లో ఆమె పొందిన శిక్షణ కూడా పద్ధతులను పూర్తిగా విడనాడకుండా చేసింది. అత్యవసర పరిస్థితిని విధించడానికి కూడా ఇందిరా గాంధీ రాజ్యాంగాన్నే అనుసరించారు. వ్యక్తిత్వం, ఆయన ప్రాతినిధ్యం వహించే రాజకీయ సంప్రదాయం కారణంగా మోదీ అవసరం వస్తే రాజ్యాంగ నియమాలను ఖాతరు చేయరు. ఈ పరిస్థితి గురించి దేశ ప్రజలు ఆందోళన పడవలసిందే.

(ఇ.పి.డబ్ల్యు సౌజన్యంతో)

NEWS UPDATES

CINEMA UPDATES