మన పరువు తీశారు… రాజస్థాన్‌లో ఏసీబీకి చిక్కిన ఏపీ పోలీసులు

773

ఇప్పటికే అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందంట. ఈ విషయం ఎన్‌సీఏఈఆర్ సంస్థ తేల్చడంతో తలకొట్టేసినట్టు అయింది. మిగిలిన పరువు గంగలో కలిసిపోతోంది. తాజాగా విశాఖ పోలీసులు ఏకంగా రాజస్థాన్ వెళ్లి అక్కడ లంచాలు తీసుకుంటూ అక్కడి ఏసీబీకి దొరికిపోయి రాష్ట్ర పరువు తీశారు. గుంటూరులో బంగారం చోరి కేసులో రాజస్థాన్‌కు చెందిన రాకేష్‌ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు విశాఖకుచెందిన సీఐ ఆర్వీఆర్కే చౌదరి, ఎస్‌ఐలు షరీఫ్‌, గోపాలరావు వెళ్లారు. రాకేష్ సింగ్‌ను అరెస్ట్ చేసి 20 కిలోల బంగారం రికవరీ చేశారు. కేసు నుంచి బయటపడేయాలంటే లంచం ఇవ్వాలని రాకేష్‌ సింగ్‌ బ్యాచ్‌ను మన పోలీసులు డిమాండ్ చేశారు. దీంతో నిందితుల్లో ఒకరు రాజస్థాన్‌ ఏసీబీని ఆశ్రయించారు.

సమాచారం మేరకు ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు మాటు వేసి .. నిందితుడి నుంచి 80వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏపీ పోలీసులను పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన పోలీసులను మీడియా ముందు నేలపై కూర్చోబెట్టి ప్రవేశపెట్టారు అక్కడి ఏసీబీ అధికారులు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా రాజస్థాన్‌ హైకోర్టు తిరస్కరించింది. రాజస్తాన్‌లో విశాఖ పోలీసులు ఏసీబీకి దొరికిన విషయాన్ని విశాఖ నగర కమిషనర్‌ మీడియాకు వెళ్లడించారు. కావాలనే పోలీసులను ఇరికించారని భావిస్తున్నారా అని ప్రశ్నించగా…. మనవాళ్లు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారు అని కమిషనర్‌ వ్యాఖ్యానించారు.

NEWS UPDATES

CINEMA UPDATES