అవినీతి అనకొండ దెబ్బకు…. ఏపీ సీఎస్‌ సంచలన నిర్ణయం

1324

ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నెంబర్ వన్‌ స్థానంలో ఉందని కొన్ని నెలల క్రితం ‘ఎన్‌సీఏఈఆర్‌’ నివేదిక వెల్లడించింది. అయినా సరే ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ప్రవాహం ఆగడం లేదు. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కూడా భరించలేని స్థాయికి అవినీతి చేరింది. తాజాగా సీఎస్‌ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిందని చెబుతున్నారు. ”ఇరిగేషన్‌లో మీరు చేస్తున్న అవినీతి, అక్రమాలు, ఎస్కలేషన్లు, టెండర్ల ప్రక్రియలో అడ్డగోలుగా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడాన్ని నేను ఒప్పుకోలేను. కావాలంటే నా నేతృత్వంలోని హైపవర్ కమిటీని తొలగించండి. ఆ తర్వాత మీకు ఇష్టమొచ్చిన వ్యక్తులతో కమిటీ వేసుకోండి…..” అంటూ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేశారు.

ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపాల్సిన సీఎస్సే అవినీతి దెబ్బకు కమిటీ నుంచి తప్పుకోవడంతో మిగిలిన ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. సీఎస్సే భయపడినప్పుడు ఇక తమ పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు. ఒక్క సీఎస్సే కాదు… ఏపీలో అవినీతి దెబ్బకు మరో కొందరు కీలక అధికారులు కూడా ఇలాగే ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పోలవం కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ ట్రాయ్‌కి అదనపు బిల్లులు చెల్లించే ప్రయత్నాలకు జలవనరుల అధికారులు అడ్డం తిరిగారు. ప్రాజెక్టుకు సంబంధించి వివాద పరిష్కార మండలి ఏర్పాటుకు తాము ఒప్పుకోబోమని ముఖ్యమంత్రికే జలవనరుల అధికారులు స్పష్టం చేశారు. వారిపై సీఎం మండిపడినా వారు వెనక్కు తగ్గలేదు. అదనపు చెల్లింపు అంగీకరిస్తే తాము కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని.. కావాలంటే కాంట్రాక్టర్‌ను కోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించాలని అధికారులు సీఎంతో చెప్పారు.

అమరావతిలో మొక్కల కొనుగోలు విషయంలో ఏకంగా ఎనిమిది రెట్లు అధికమొత్తం చెల్లించే ప్రయత్నం చూసి ఐఎఫ్ఎస్ అధికారి ఒకరు అదిరిపడ్డారు. కేసులో ఇరుక్కోవడం ఖాయమన్న ఉద్దేశంతో ఆయన ఏకంగా సర్వీసును వదులుకుని పదవి వదిలేసి వెళ్లిపోయారు. మొత్తం మీద ఏపీ సీఎస్సే ప్రభుత్వానికి ఎదురుతిరిగి అవినీతిపై ప్రశ్నించి కమిటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. సీఎస్‌ నిరసన తెలిపినా ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయలేదు. తనను కమిటీ నుంచి తప్పించాలని ఆయన కోరగానే… కనీసం చర్చించకుండా కమిటీ నుంచి తప్పించేశారు. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్ లు చంద్రబాబు పాలనలో భాగస్వామ్యం కాలేక కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.

NEWS UPDATES

CINEMA UPDATES