ఐఏఎస్ అధికారికి 51వ బ‌దిలీ

711

ఆయ‌న స‌ర్వీసు 20 ఏళ్లు. 51 సార్లు ట్రాన్స్‌ఫ‌ర్లు. ఇదీ సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ అశోక్ ఖేమ్కా ట్రాక్ రికార్డు. ఈయ‌నే కాదు హ‌ర్యానాలో ఇంకో అధికారి ఉన్నారు. ఆయ‌న ఏకంగా 68 సార్లు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. ఆయ‌న పేరు ప్ర‌దీప్ క‌స్నీ. అయితే ఈయ‌న రికార్డును కూడా స‌ర్వీసు అయ్యేలోపు అశోక్ ఖేమ్కా బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశం ఉంది. తాజాగా అశోక్‌ ఖేమ్కాను హర్యానా బీజేపీ సర్కార్‌ మళ్లీ బదిలీ చేసింది. సాంఘిక సంక్షేమ, మహిళా సాధికారత ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న ఆయనను క్రీడలు, యువజన సంబంధాల విభాగానికి బదిలీ చేశారు. మూడు నెల‌ల కింద‌టే ఆయ‌న సాంఘిక సంక్షేమ శాఖ‌కు వ‌చ్చారు. అప్పుడే బ‌దిలీ వేటు ప‌డింది.

మంత్రి కృష్ణ బేడీ తీరుపై అశోక్‌ ఖేమ్కా బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేయటమే బదిలీకి కారణ మని తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాహనాన్ని మంత్రి కృష్ణబేడి ఏడాది కాలంగా వాడుకోవటాన్ని అశోక్‌ ఖేమ్కా తప్పుబట్టారు. ఈ విషయం కాస్తా ఆ నోటా…. ఈనోటా జాతీయవార్తా పత్రికలకు ఎక్కింది. ఖేమ్కా రాసిన లేఖ వల్లే, సామాజిక సంక్షేమ శాఖ అంబాలా జిల్లా అధికారి వాహనాన్ని మంత్రి వాడుకుంటున్నారన్న విషయం బయటకు వచ్చింది. గతంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వ్యక్తిగత కార్యాలయ సిబ్బందికి మాత్రమే ‘దీపావళి’ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై అశోక్‌ ఖేమ్కా అభ్యంతరం వ్యక్తం చేయటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వారిని మాత్రమే ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదని అశోక్‌ఖేమ్కా కుండబద్దలు కొట్టారు.

సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూముల వ్యవహారాన్ని రద్దు చేసింది కూడా ఈయనే కావటం విశేషం. ఆ తర్వాత రవాణా విభాగానికి మారిన ఆయన అక్కడా తన పట్టువీడలేదు. ఇలా 20 ఏళ్లలో ఆయన మొత్తం 51 సార్లు బదిలీ అయ్యారు.

NEWS UPDATES

CINEMA UPDATES