ప్రైవేట్ రంగం గుప్పెట్లో ప్రజారోగ్యం

1809

దేశంలో ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థ ప్రైవేటు రంగంలో సర్వభక్షక స్థాయిలో విస్తరిస్తోంది. దీనివల్ల వైద్యానికి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. పేదలకు వైద్యం అందుబాటులో లేని స్థితిలో ఉంది. వైద్యానికి ఖర్చులు చాలా ఎక్కువగా ఉండడంవల్ల పేదలు దేవుడి మీద భారం వేసి చికిత్స లేకుండానైనా ఉండాలి. లేదా ఉన్నదేదో అమ్మి వైద్యం చేయించుకుని మరింత పేదరికంలోకి జారి పోవాలి. వైద్య ఖర్చులు తీవ్రంగా పెరగడంవల్ల ఆ ఖర్చు భరించలేని వారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది.

ఈ స్థితిలో అత్యవసర ఔషధాల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నూతన ఔషధ విధానం ప్రవేశ పెట్టి 2013లో విధాన ప్రకటన చేసింది. సాధారణ ఔషధాలను అందుబాటు ధరల్లో ఉంచడానికి జన ఔషధి కేంద్రాలను (జెనెరిక్ ఔషధ కేంద్రాలు) ప్రారంభించింది. ఇది ఆహ్వానించదగిందే. అయితే ఆసుపత్రులకెళ్లి చికిత్స చేయించుకోవడానికే ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సిన స్థితిలో మందులు తక్కువ ధరకు అందుబాటులో ఉంచినందువల్ల ఏ మేరకు ఫలితం ఉంటుందన్నది చర్చనీయాంశంగానే మిగిలిపోతోంది.

అత్యవసర ఔషధాల ధరలను నియంత్రించడం ప్రస్తుత ప్రభుత్వాన్ని వేధిస్తున్న సమస్యే కాదు. ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఈ సమస్యతో సతమతమయ్యాయి. ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనేక హామీలు గుప్పించినా పేదలకు ఉచితంగా ఔషధాలు అందుబాటులో ఉంచడానికి చట్ట ప్రరంగా తీసుకున్న చర్యలు ఏమీ లేవు. ఇంతవరకు జరిగిందల్లా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అరకొర చర్యలు తీసుకున్నాయి.

జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా కేద్రం రాష్ట్రాలకు ఉచితంగా మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు చేయించడానికి కొన్ని రాయితీలు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు గంభీరమైన ప్రకటనలకు, “ధరల నియంత్రణకు” మాత్రమే పరిమితమైనాయి. ఇది ఔషధ మార్కెట్లో నాల్గో వంతుకు కూడా వర్తించదు. అదీగాక ఔషధ ధరలను నియంత్రించడానికి జరిగిన ప్రయత్నాలవల్ల పెద్ద ప్రయోజనమూ కనిపించలేదు.

శిశువుల్లో మూత్ర విసర్జనను సుగమం చేసే ఫ్యూరోసిమైడ్ (దీనిని లాసిక్స్ పేరుతో విక్రయిస్తారు) ధరను జాతీయ ఔషధ ధరల నిర్ణయ సంస్థ ఒక్కో మాత్ర ధరను రూ. 0.29 కు పరిమితం చేసింది. ఈ ఔషధం పది మాత్రల ధర రూ. 100 నుంచి రూ. 110 దాకా ఉంటే దానిని రూ. 10 కన్నా ఎక్కువ ధరకు విక్రయించకుండా కట్టడి చేశారు. ధర తగ్గించడంవల్ల ఈ మాత్రలు తయారు చేసే కంపెనీలు మార్కెట్లో అవి అందుబాటులో లేకుండా కొరత సృష్టించారు.

ఔషధ ధరలు నియంత్రించడానికి పెద్ద అడ్డంకి ఉంది. ఔషధాల తయారీ పెద్ద కంపెనీల గుప్పెట్లో ఉంది. మొత్తం అమ్మకాలలో ఈ పది కంపెనీలు అమ్మే మందులే అయిదింట రెండు వంతులు ఉంటాయి. అలాంటప్పుడు ధరల నియంత్రణవల్ల అంతగా ప్రయోజనం కనిపించడం లేదు. ధరల నియంత్రణ మార్కెట్లో ఒక శాతం కన్న తక్కువ అమ్మకాలు జరిగే మందులకే వర్తిస్తోంది.

ప్రభుత్వం ధరలను నియంత్రించిన తర్వాత పెద్ద కంపెనీలు మళ్లీ ధరలు పెంచేస్తున్నాయి. ఉదాహరణకు 1995లో నూతన ఔషధ విధానం కింద నియంత్రించిన ధరకన్నా మధుమేహ చికిత్సకు వాడే మెట్ ఫార్మిన్ మందు మార్కెట్ లో ప్రభుత్వం నిర్దేశించిన ధరకన్నా మూడు రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ ధరలను ఔషధాల ఉత్పత్తిదార్లే నిర్ణయిస్తున్నారు.

అదీగాక సరఫరా తక్కువగా ఉన్నందువల్ల తక్కువ ధరలకు లభించే మందులు అందుబాటులో ఉండవు. జన ఔషధి కేంద్రాలలో కావలసిన మందులకు ఎప్పుడూ కొరతే ఉంటుందని మీడియాలో పదే పదే వార్తలు వస్తుంటాయి. ఎన్ని మందులు కావాలో అంచనా లేకపోవడం, ఔషధాల సేకరణ పద్ధతి అస్తవ్యస్తంగా ఉండడం, ఈ ఔషధాల అమ్మకాలే తక్కువగా ఉండడంవల్ల మందుల కొరత నిరంతరం ఉంటోంది. జెనెరిక్ మందుల నాణ్యత కూడా సమస్యగా ఉంది.

ఔషధాల ధరల నియంత్రణ రాష్ట్రాల పరిధిలో ఉండడంవల్ల ధరల నియంత్రణలో నిర్దిష్ట విధానం ఉండడం లేదు. ఈ పరిస్థితిలో నకిలీ మందులు రాజ్యమేలుతున్నాయి. ప్రధాన నగరాల్లో అమ్మే మందుల్లో 20 శాతం నకిలివే అని ఔషధాలు తయారు చేసే కంపెనీలు చెప్తున్నాయి. ఈ నకిలీ మందులు 10 శాతం ఉన్నట్టు ప్రభుత్వ అంచనా. తక్కువ ధరకు అందుబాటులో ఉండే మందుల్లో చాలావరకు నకిలీవే అన్న అభిప్రాయం విస్తారంగా ఉంది.

అందరికీ ఆరోగ్య సదుపాయాలు అన్న జాతీయ విధానం సమానత్వం, అందుబాటు, సరసమైన ధర అన్న సూత్రాల మీద ఆధారపడి ఉంది. ఈ సూత్రాలను అనుసరించాలంటే ఒక మందు అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో మందు కొని రాజీపడక తప్పదు. ఉదాహరణకు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన అందరికీ ఆరోగ్య సదుపాయం అన్న ప్రస్తుత ప్రభుత్వ విధానాన్నే తీసుకోండి.

ఇది ఆరోగ్య బీమాపై ఆధారపడిన పథకం. ఈ పథకంవల్ల పేదలకు ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి రావచ్చు. కాని అందుబాటు ధరలకు ఔషధాలు దొరకడానికి పూచీ ఉండదు. ఔషధాల సరఫరా సవ్యంగా లేకపోతే, అత్యవసర వైద్య సేవలు ప్రభుత్వ రంగ వ్యవస్థల ద్వారా అందుబాటులో లేకపోతే ఈ ఆరోగ్య పథకంవల్ల అంతగా ఫలితం ఉండదు. అలా కానప్పుడు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రైవేటు వైద్య రంగానికే మేలు జరుగుతుంది.

ధరల నియంత్రణతో పాటు ఔషధాల సరఫరాకు కూడా హామీ ఉండాలి. ఔషధ నియంత్రణ పకడ్బందీగా ఉండాలి. సరఫరా మెరుగుపడాలి. ఔషధ మార్కెట్ తీరు తెన్నులపై సంపూర్ణ అవగాహన ఉండాలి. లేకపోతే కేవలం ఔషధాల ధరలు నియంత్రించడంవల్ల మందుల ధరలు అందుబాటులో ఉండవు.

ఈ లక్ష్యాల సాధనలో ఆర్థిక నిర్ణయాలలో సమతూకం ఉండడమే కాక అమలు చేయడానికి రాజకీయ సంకల్పం అత్యవసరం. కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు తక్కువ ధరకు ఈ సదుపాయం అందించడంవల్లే ప్రయోజనం ఉంటుందని అనుభవం రుజువు చేస్తోంది. ఇది సాధ్యం కావాలంటే మౌలిక సదుపాయాలకు అడ్డంకి ఉండకూడదు. తక్కువ ధరకు మందులు, రోగ నిర్ధారణా సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలి.

గిరాకీని బట్టి ఆరోగ్య సదుపాయాలకు ఆర్థిక సహాయం అందించాలన్న ప్రస్తుత ప్రభుత్వ వైఖరి చూస్తే ప్రభుత్వం కేవలం ఆరోగ్య సదుపాయ కల్పనలో వెసులుబాటు కల్పించడానికే పరిమితం కావాలనుకుంటున్నట్టు అనిపిస్తోంది. అసలు ఆరోగ్య సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రైవేటు రంగానికే వదిలేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

NEWS UPDATES

CINEMA UPDATES