భీం ఆర్మీ నేత ఆజాద్ విడుదల

706

పదిహేను నెలల నుంచి జైలులో ఉన్న భీం ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఆయన 2017 జూన్ నుంచి జైలులో ఉన్నారు. ఆయన విడుదలవుతున్న సందర్భంగా వందలాది మంది భీం ఆర్మీ కార్యకర్తలు షహరాన్ పూర్ జైలు ఎదుట గుమి గూడారు.

రాష్ట్ర ప్రభుత్వం…. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసింది అని విడుదలైన తర్వాత ఆజాద్ వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం కొనసాగిస్తానని పునరుద్ఘాటించారు.

2017 నవంబర్ రెండవ తేదీన యు.పి. ప్రభుత్వం ఆయన మీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు మోపింది. అలహాబాద్ హైకోర్టు ఆయనకు జామీను మంజూరు చేసిన ఒక రోజు తర్వాత ఈ కేసు మోపారు. ఈ చట్టం కాలపరిమితి 2018 నవంబర్ ఒకటిన ముగియవలసి ఉంది. అంతకు ముందే ఆయనను విడుదల చేయాలని యు.పి. ప్రభుత్వం నిన్ననే నిర్ణయించింది. షహరాన్ పూర్ లో దళితులకు, ఠాకూర్లకు మధ్య ఘర్షణలు జరిగిన సందర్భంగా ఆయనను అరెస్టు చేశారు.

ఆజాద్ ను విడుదల చేయాలని ఆయన తల్లి కంలేశ్ దేవి చాలా కాలంగా కోరుతున్నారు. ఆజాద్ తో పాటు అరెస్టయిన శివకుమార్, సోనును కూడా జాతీయ భద్రతా చట్టం కాలపరిమితి ముగిసే లోగా విడుదల చేసే అవకాశం ఉంది.

ఏ వ్యక్తి అయినా దేశ భద్రతకు, ప్రజానీకంలో అశాంతికి కారకుడు అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఈ చట్టం కింద అరెస్టు చేయవచ్చు. కానీ ఆ ఉత్తర్వులను మూడు నెలలకు ఒక సారి పునరుద్ధరించవలసి ఉంటుంది.

షహరాన్ పూర్ లో కుల కలహాలు జరిగిన తర్వాత భీం ఆర్మీ సభ్యులనుకున్న వారందరి మీదా కేసులు నమోదు చేశారు. అప్పటి వరకు భీం ఆర్మీ పెద్దగా ప్రచారంలో లేదు. కానీ ఇలా కేసులు మోపిన తర్వాత ఆ సంస్థకు విపరీతమైన ప్రచారం వచ్చింది.

NEWS UPDATES

CINEMA UPDATES