బాబు మోచేతి నీళ్లు తాగే పచ్చమీడియా ప్రచారం

1853

బాబ్లీ ఆందోళనకు సంబంధించిన ఒక చెత్త కేసును పట్టుకుని చంద్రబాబును అల్లూరి సీతారామరాజు తరహాలో చిత్రీకరించేందుకు పచ్చమాఫియా ప్రయత్నిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. వాయిదాలకు హాజరుకాకపోతే ప్రధాని పైన కూడా కోర్టులు వారెంట్లు జారీ చేస్తాయన్నారు.

ట్రాఫిక్ ఉల్లంఘన కేసు ఎలాంటిదో బాబ్లీ ధర్నా వ్యవహారంలో చంద్రబాబుపై పెట్టిన కేసూ అలాంటిదేనన్నారు. అలాంటి కేసును పట్టుకుని ఏదో కుట్ర జరుగుతోందని… దాన్ని చంద్రబాబు వీరోచితంగా ఎదుర్కొంటున్నారని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.
పెద్దపెద్ద కేసులు కోర్టుల్లో విచారణ జరపకుండా చేసుకునే నేర్పరి చంద్రబాబు అని విమర్శించారు.

కోర్టులు ఇచ్చిన నోటీసుల వెనుక వైసీపీ, బీజేపీ, జనసేన హస్తముందని ప్రచారం చేయడం అంటే కోర్టుకు దురుద్దేశం ఆపాదించడమేనన్నారు. కోర్టుకు దురుద్దేశాలు ఆపాదిస్తూ బహిరంగంగానే చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడినందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, విద్యార్థులపైనా కేసుల పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం…గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు వల్ల 30 మంది చనిపోతే కనీసం కేసు నమోదు కాలేదన్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా కనీసం విచారణకు పోలీసులు పిలువలేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో వేల కోట్లు తింటున్నా కేసులు లేవన్నారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల భూములు దోచుకున్నా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు.

భూములు దోచుకునేందుకే దొంగల ముఠా కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తుందని విమర్శించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్న తర్వాత కూడా కేసు నమోదు కాలేదన్నారు. కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు వైసీపీ ఇన్‌చార్జ్ నారాయణ రెడ్డిని హత్య చేయించినా కేసు నమోదు చేయలేదన్నారు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నడిపినా కేసులు పెట్టిన దాఖలాలు లేవన్నారు.

చింతమనేని రోజుకో అరాచకం చేస్తున్నా చర్యలు లేవన్నారు. వేల కోట్లు మైనింగ్‌లో దోచుకుంటున్నా కేసులు పెట్టలేదన్నారు. అలాంటి సీరియస్‌ అంశాలపై కేసులు పెట్టని చంద్రబాబు ప్రభుత్వం… బాబ్లీ ఆందోళనకు సంబంధించిన చెత్త కేసును పట్టుకుని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. అర్జునుడికి విశ్వరూపం చూపించిన వెంకటేశ్వరస్వామికే చంద్రబాబు తన అవినీతి విశ్వరూపం చూపిస్తున్నారని కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

చంద్రబాబు దోపిడీలో వాటా అందుతోంది కాబట్టే, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారు కాబట్టే…. చెత్త కేసును పట్టుకుని కొందరు నాలుగు రోజులుగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఓటుకు నోటు కేసు, సదావర్తి భూములు, అమరావతి భూములు వ్యవహారాల్లో సీబీఐ విచారణకు సిద్ధపడాలని అప్పుడు అవినీతి ఊడలమర్రి చంద్రబాబు సంగతి తేలిపోతుందన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానాల్లో విచారణ జరగాల్సిన నేరాలను కూడా చంద్రబాబు చేశారన్నారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే 18 కేసుల్లో స్టే ఎత్తివేయించుకోవాలని సవాల్ చేశారు.

NEWS UPDATES

CINEMA UPDATES