అస‌హ్యంగా ఉంది…. ఫిరాయింపుదారుల‌పై రాజు ఫైర్

1525

బీజేపీ శాస‌న‌స‌భ ప‌క్ష నేత విష్ణుకుమార్ రాజు…. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను అస‌హ్యించుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొత్తం క‌ల్తీ అయిపోయింద‌న్నారు. వ‌స్తువుల‌తో పాటు రాజ‌కీయాలు మ‌రీ దారుణంగా క‌లుషిత‌మైపోయాయ‌న్నారు. ఏ నాయ‌కుడి భుజం పై ఎప్పుడు ఏ కండువా ఉంటుందో కూడా అర్థం కావ‌డం లేద‌న్నారు. రాజ‌కీయం ఇంత‌ దారుణంగా ఉంటుంద‌న్న ఆలోచ‌నే అస‌హ్యంగా ఉంద‌న్నారు.

సోమ‌వారం అసెంబ్లీలో రాష్ట్రంలో క‌ల్తీ స‌రుకు హ‌ద్దు అదుపు లేక‌పోవ‌డంపై చ‌ర్చ జ‌రిగింది.అనంత‌రం లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేసిన విష్ణుకుమార్ రాజు… అస‌లు ఈ రాష్ట్రంలో క‌ల్తీ లేనిది ఏముంద‌ని ప్ర‌శ్నించారు. ప‌సుపు, కారం, బియ్యం, బిస్కెట్లు, పాలు, నూనె, నెయ్యి చివ‌ర‌కు మాంసం కూడా క‌ల్తీ అయిపోయింద‌న్నారు. రాజ‌కీయాలు మ‌రింత క‌లుషితం అయ్యాయ‌న్నారు. పార్టీ మారాల‌నుకుంటే గెలిచిన పార్టీకి రాజీనామా చేసి వెళ్లాల‌న్నారు. అలా చేయ‌కుండా పార్టీ కండువాలు మార్చుకోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌దేప‌దే ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెప్పే బ‌దులు.. ఆయా ప్రాంతాల్లోని నేత‌ల‌కు రౌడీమామూళ్లు ఇచ్చి ఇసుక తీసుకెళ్లండ‌ని చెప్ప‌డం స‌బ‌బుగా ఉంటుంద‌ని రాజు స‌ల‌హా ఇచ్చారు.

NEWS UPDATES

CINEMA UPDATES