సర్వేలపై బుగ్గన ముందస్తు హెచ్చరిక

1195

సుధీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక విఫల నేతగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నూతన రాజధాని నిర్మించే అవకాశాన్ని చంద్రబాబు తన అసంబద్ధ నిర్ణయాలతో భ్రష్టు పట్టించారని విమర్శించారు.

అన్నింటిలో పారదర్శకత అంటూ మాట్లాడే చంద్రబాబు… అమరావతి బాండ్లను కేవలం 9మంది మాత్రమే ఎలా కొన్నారని… ఆ తొమ్మిది మంది ఎవరన్నది బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేవలం 7.9 శాతం వడ్డీతోనే వేల కోట్ల అప్పులు పుడుతుంటే… అమరావతి బాండ్లకు ఏకంగా 10.23 శాతం వడ్డీ చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని కాంట్రాక్టులను కేవలం ఐదు కంపెనీలకు మాత్రమే అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో చంద్రబాబు చేస్తున్న హంగామా చూసి జనం నవ్వుకుంటున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడే ఈ కేసులో చంద్రబాబుకు 35 సార్లు నోటీసులు వచ్చాయన్నారు. కానీ ఆయన స్పందించకపోవడంతో ఇప్పుడు నాన్‌బెయిలబుల్ వారెంట్ వచ్చిందన్నారు.

ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో జగన్‌కు 43 శాతం ప్రజాదరణ ఉన్నట్టు తేలిందని…. మరో ఆరు నెలలు ఆగితే అది 63 శాతానికి చేరుతుందని జోస్యం చెప్పారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజాదరణ 38శాతానికి పడిపోవడం ఆయన చేస్తున్న అవినీతి, అసమర్ధ పాలనకు అద్దం పడుతోందన్నారు.

ఈ సర్వే నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి త్వరలోనే టీడీపీ అనుకూల మీడియా ఏదో ఒక సర్వే ప్రసారం చేస్తుందని బుగ్గన చెప్పారు. చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారని కథలు అల్లి సర్వేను ప్రసారం చేసే అవకాశం ఉందని వివరించారు.

NEWS UPDATES

CINEMA UPDATES