హాస్యం-ఆగ్రహం ఒకే చోట పొసగవు

624

– ఎన్. పొన్నప్ప

తమిళనాడు లో కార్టూనిస్టు బాలను అక్టోబర్ 29న అరెస్టు చేశారు. బాల ఓ కార్టూన్ వేశారు. అందులో ముగ్గురు వ్యక్తులను నగ్నంగా చిత్రించారు. నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి మాత్రం టై కట్టుకుని ఉన్నాడు. అందరూ తమ మర్మాంగాలను నోట్ల కట్టలతో కప్పుకుని ఉన్నారు. వాళ్ల కాళ్ల దగ్గర ఓ బాలుడున్నాడు. బహుశా అతని శరీరం కాలిపోయి ఉంది. అతని వీపు ఇంకా కాలుతున్నట్టుగా ఉంది. ఈ వ్యంగ్య చిత్రం దాదాపు 2015లో మధ్యధరా సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఏలాన్ కుర్దీ చిత్రం లాగే ఉంది. తేడా ఏమిటంటే ఈ చిత్రం మరీ ఘోరంగా ఉంది. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక రోజు కూలీ తన ఇద్దరు పిల్లలను, భార్యను తగులబెట్టేసి తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతం ఆధారంగా బాల ఈ వ్యంగ్య చిత్రం గీశారు. తనకు అప్పు ఇచ్చిన వారి వేధింపులు భరించలేక ఆ వ్యక్తి ఆరు సార్లు జిల్లా కలెక్టరుకు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డాడు.

బాల తన వ్యంగ్య చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తుంటాడు. ఆయన చిత్రాలను చూసే వారు అసంఖ్యాకంగా ఉన్నారు. దీన్ని బట్టి ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారని రుజువు అవుతుంది. ఆ వ్యంగ్య చిత్రంలో బాల తమిళంలో రాసిన వ్యాఖ్యలకు పత్రికలలో రెండు అనువాదాలు వచ్చాయి. ఒక దాంట్లో “అవును…ఈ వ్యంగ్య చిత్రం దురాక్రమణకు పరాకాష్ఠ” అని ఉంది. రెండవ దానిలో “అవును చాలా ఆగ్రహంతో ఉన్నప్పుడు నేను ఈ వ్యగ్య చిత్రం గీశాను” అని ఉంది. ఈ రెండు అనువాదాలు ఒకే రకంగా లేవు. వ్యంగ్య చిత్రం “నవ్వు” పుట్టించడమే కాక ఆలోచన రేకిత్తించాలి. హాస్యానికి అనేక రూపాలు ఉండొచ్చు కాని కచ్చితంగా ఆగ్రహం అందులో భాగం కాదు. “హాస్యం” “ఆగ్రహం” ఒకే చోట పొసగవు. వ్యంగ్య చిత్రంలో కూడా పొసగవు. ఈ చిత్రాన్ని ఆగ్రహంలో ఉన్నప్పుడు గీసానని బాల స్వయంగా అంగీకరిస్తున్నారు.

చాలా క్లిష్టమైన అంశాన్ని వ్యంగ్య చిత్రంగా గీయడం కూడా కష్టమే. ఒక వేళ గీసినా అది నర్మ గర్భంగా ఉండాలి. కాని బాల గీసిన కార్టూన్ వాచ్యంగా ఉంది తప్ప సూచ్యంగా లేదు. ఈ కార్టూన్ లో ఒక బాలుడు కాలి పోతున్నట్టు చూపించారు. అధికారులను నగ్నంగా చిత్రీకరించారు. వారి మర్మాంగాలను నోట్ల కట్టలతో కప్పుకున్నట్టు చూపించారు. అవి రద్దయిన పెద్ద నోట్లు కావచ్చు. వ్యంగ్య చిత్రం ఇలా ఉండకూడదు.

వడ్డీ వ్యాపారులు గోళ్లూడగొట్టి నడ్డి విరిచే వడ్డీ వసూలు చేస్తారు. వడ్డీ వ్యాపారి దాష్టీకం ఈ దారుణ ఘటనకు దారి తీసింది. ఈ వ్యంగ్య చిత్రం కూడా ఈ ఘటనల ఫలితమే. కాని ఈ ఉదంతానికి కారకుడైన వడ్డీ వ్యాపారి ఈ కార్టూన్ లో ఎక్కడా లేరు. ఒక వేళ ఆ వ్యంగ్య చిత్రకారుడు మరి కొంత సమయం తీసుకుని, ఆలోచించి గీసి ఉంటే వడ్డీ వ్యాపారిని కూడా ఏదో ఒక రకంగా తన కార్టూన్ లో చూపించే వారు. అప్పుడు నగ్నంగా ఉన్న ఆ ముగ్గురు అధికారుల ఆగ్రహం కొంత తగ్గేది. ఆ పని చేసి ఉంటే అర్థ రాత్రి వేళ అరెస్టు చేసి జైలులో కుక్కడం బాలకు తప్పి ఉండేది. తమను నగ్నంగా చిత్రించారని మూడు వారాల తర్వాత అధికారులు గుర్తించి అరెస్టు చేశారు.

సామాజిక మాధ్యమాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ విశృంఖలంగా ఉంటుంది కనక ఈ కార్టూన్ స్వైర విహారం చేసింది. సామాజిక మాధ్యమాలు ఇలాంటి సరుకు అందిస్తాయి. అక్కడ “ఏదైనా చెల్లుతుంది” అన్న వైఖరి ఉంటుంది. పత్రికలలో అయితే సంపాదకుడి కత్తెర ఉంటుంది. సామాజిక మాధ్యమాలలో ఇది ఉండదు. ఆగ్రహంగా ఉన్నప్పుడు ఈ కార్టూన్ గీసానని బాల స్వయంగా చెప్తున్నారు కనక ఆయన మర్యాద, అశ్లీలం అన్న అంశాలను పట్టించుకోలేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం ముఖ్యమైనవే. కాని వాటికీ కొన్ని పరిమితులున్నాయి. ఈ కట్టుబాట్లను పాటించినప్పుడు అద్భుతమైన వ్యంగ్య చిత్రాలు వచ్చాయి.

ఏ పర్యవేక్షణ లేకుండా సామాజిక మాధ్యమాలలో ప్రకటించవచ్చు. ఇది కొత్త ధోరణి. అక్కడ వ్యాఖ్యలు, మాటకు మాట సమాధానం చెప్పడం; వీటిలో నిర్మాణాత్మకమైనవి, అనాలోచితమైనవి కూడా ఉంటాయి. అక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. సామాజిక మాధ్యమాలలో వచ్చే అంశాలను అభిమానించే వారు ఒకే రీతిలో వ్యవహరిస్తారని చెప్పలేం. ముద్రణా మాధ్యమాలకన్నా సామాజిక మాధ్యమాలలో స్వేచ్ఛ ఎక్కువ కనక కార్టూనిస్టు గనక జాగ్రత్తగా లేక పోతే ప్రమాదం కూడా ఉంటుంది.

గతంలో ముద్రణా మాధ్యమాలలో కార్టూన్లు ప్రచురితం అయితే విశాల హృదయంతో అర్థం చేసుకునే వారు. ఆహ్వానించే వారు. అప్పుడు కార్టూన్లు గీసే వారు జాగ్రత్తగా ఆలోచించే వారు. ఇప్పుడు ఆలోచనల్లో వైవిధ్యం ఉంది. ప్రస్తుతం ప్రజల్లో చీలికలు ఎక్కువ. అలాంటప్పుడు ఏదో వర్గానికి ఆగ్రహం కలిగించడం సులభం.

కార్టూనున్ ను ఆ చిత్రకారుడి దృష్టినుంచే చూస్తారని ఏమీ లేదు. ఈ రోజుల్లో కార్టూనిస్టు మరింత ఆలోచింప చేయాలి. ముద్రణా మాధ్యమంలో సంపాదకుడి పర్యవేక్షణ ఉంటుంది కనక కార్టూనిస్టులకు కొంత రక్షణ ఉంటుంది. సంపాదకుడు ఏదైనా కార్టూన్ ను ప్రచురించకుండా ఉండవచ్చు. కొన్ని దశాబ్దాల కింద ఆనంద వికటన్ పత్రికలో ప్రచురితమైన ఓ కార్టూను సంపాదకుడిని ఇబ్బందుల్లో పడేసింది. కార్టూనిస్టుకు ఆ ఇబ్బంది లేకుండా పోయింది. అందువల్ల మంచి సంపాదకుడి విలువను విస్మరించలేం.

(ఎన్.పొన్నప్ప ప్రసిద్ధుడైన కార్టూనిస్టు. ఆయన ఇ.పి.డబ్ల్యు.లో కార్టూన్లు గీస్తుంటారు. ఇ.పి.డబ్ల్యు. 2017 నవంబర్ 11 సంచిక సౌజన్యంతో)

NEWS UPDATES

CINEMA UPDATES