అమ్మకానికి 30 వేల కోట్ల రూపాయిల కేంద్ర ప్రభుత్వ భూములు….

721

ప్రభుత్వ రంగం విఫలమైంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ బోల్తాపడింది. ఫలితంగా ప్రైవేటు ఆర్థిక వ్యవస్థ తెరమీదకు వచ్చి 1991 నుంచి మొత్తం అన్ని రంగాలను ప్రైవేటు వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరుగులు తీయించాయి. దాదాపు 25 ఏళ్ళ తరువాత ప్రైవేటు రంగం కూడా దాదాపుగా విఫలమై చివరకు బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి దాపురించింది. దాంతో ప్రభుత్వం చేయగలిగిందల్లా ప్రజలనెత్తిన భారం మోపి పన్నులు పెంచడంతో పాటు ప్రభుత్వ రంగంలోని ఆస్తులను పూర్తిగా ప్రైవేటు పరం చేసి చేతులు దులుపుకోవడంతో పాటు సంక్షోభంలో ఉన్న ప్రైవేటు రంగానికి మేలు చేకూర్చేందుకే చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ ప్రైవేటు రంగం కోలుకునే సూచనలు కనిపించడం లేదు. ఏదైతేనేమి ప్రభుత్వ రంగంలోని ఆస్తులు తెగనమ్మటమే లక్ష్యంగా మోడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కాంగ్రెస్‌ విధానాలతో బీజెపి ఏమాత్రం విభేదించడం లేదని మరోసారి రుజువు అవుతోంది.

తాజాగా 18 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన భూములు, ఆస్తులను విక్రయించి సొమ్ము చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ (ప్రభుత్వ పెట్టుబడుల అమ్మకం, ఉపసంహరణ) ద్వారా 72,500 కోట్ల సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో 15వేల కోట్ల రూపాయలు భూములు, ఆస్తుల అమ్మకం ద్వారానే కూడబెట్టుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా కంపెనీల్లోని భూములు, తదితర ఆస్తుల వివరాలు సేకరించే పనిలో మంత్రిత్వ శాఖలు పడ్డాయి. ప్రధానంగా డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌, స్కూటర్స్‌ ఇండియా, హిందూస్థాన్‌ ప్రిఫెబ్‌ అండ్‌ పవన్స్‌ హాన్స్‌ తదితర సంస్థలకు సంబంధించిన ఆస్తుల విక్రయాలు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. నవంబర్‌ 1వ తేదిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ రూపొందించిన అంచనాల ప్రకారం 30,158 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను విక్రయించాలని నిర్ణయించారు.

స్కూటర్స్‌ ఇండియాకు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో 150 ఎకరాల విలువైన భూమి ఉంది. అదే విధంగా హిందూస్థాన్‌ ప్రిఫెబ్‌ భవన నిర్మాణ రంగంలో స్ట్రక్చర్లు మొదలైన వాటిని రూపొందించి రైల్వేలు ఇతరత్రా సంస్థలకు సరఫరా చేస్తోంది. ఈ సంస్థకు 28 ఎకరాల భూమి ఢిల్లీలోని విలువైన ప్రాంతంలో ఉంది. ఈ విధంగా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన మొత్తం భూములను అమ్మివేయాలా? లేదా కొంత మేర అమ్మి మిగిలిన భూములను భవిష్యత్తులో అమ్మకానికి ఉంచాలా అనేది ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. ఎలాగైనప్పటికి దశల వారిగా నైనా మొత్తం భూమిని, ఆస్తులను అమ్మివేయటం తథ్యమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే హిందూస్థాన్‌ లేటెక్స్‌, గోవా షిప్‌యార్డు, త్రివేణి స్ట్రక్చరల్స్‌ అండ్‌ హెచ్‌ఈసీ తదితర సంస్థలకు సంబంధించిన ఆస్తులు కూడా అమ్మే విధంగా ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. వీటిని రియల్‌ఎస్టేట్‌ లేదా ప్రైవేటు రంగంలోని పెద్ద సంస్థలకు విక్రయించేందుకు ముసాయిదా సిద్ధమవుతోంది.

NEWS UPDATES

CINEMA UPDATES