బాబు గ్యాలరీ వాక్‌, జలహారతి వెనుక….

1728

(ఎస్‌. విశ్వేశ్వర రావు)

‘గ్యాలరీ వాక్‌’, ‘జలహారతి’… ఇవి కొత్తగా ఏపి రాజకీయాల్లో తెరమీదకు వచ్చాయి. ర్యాంప్‌వాక్‌ చూసాం, క్యాట్‌వాక్‌ విన్నాం, మంకీ జంప్‌ కూడా చూసాం… స్నేక్‌వాక్‌ కూడా విన్నాం కొత్తగా వచ్చిన ఈ గ్యాలరీ వాక్‌ ఎక్కడిది?

ఇక దేవాలయాల్లో పూజల సందర్భంగా హారతులు చూసాం, విన్నాం. వారణాసి లాంటి ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల్లో జలహారతులు చూశాం. ఇప్పుడు కొత్తగా ఏపిలో జలాశయాల వద్ద జల హారతులు తెరమీదకు వచ్చాయి. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే వీటిని కొత్తగా తెరమీదకు తెచ్చి రాజకీయాల్లో కొత్త పోకడలకు బీజాలు వేస్తున్నారు. ఎందుకు ఇదంతా? ఏమి ఆశించి ఆయన ఇలా చేస్తున్నారు. ప్రాజెక్టులను రాజకీయ మార్కెటింగ్‌లోకి తీసుకురావడం వెనుక కారణం ఏమిటి?

మొన్న పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉండగానే గ్యాలరీలో ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఆఖరికి ప్రాజెక్ట్‌ అంటే ఏంటో తెలియని మనువడు కూడా పోలవరం కట్టేయడం తన జీవిత లక్ష్యం అంటూ గ్యాలరీలో వాక్‌ చేశారు. ఇక ఆయన మంత్రివర్గం పరివారం పాల్గొనటం సహజమే. నేటి నుంచి (సెప్టెంబర్‌ 14) ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల పాటు ప్రాజెక్ట్‌ల సందర్శన, జలహారతి నిర్వహించనున్నారు. ఇందులో ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే…. దశాబ్దాల క్రితం పూర్తయిన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను కూడా సందర్శించి ఆయన జలహారతి నిర్వహిస్తున్నారు.

సాధారణంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణం ప్రారంభించేప్పుడు, పూర్తయిన తరువాత జాతికి అంకితం చేసే సమయంలో ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితి. నిర్దేశించిన లక్ష్యం మేరకు పని సకాలంలో జరిగేవిధంగా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం పాలకుల బాధ్యత. కానీ ఏపిలో మాత్రం చిత్రమైన పరిస్థితి నెలకొంది. పనికన్నా ప్రచారం ఎక్కువై పోయింది. ప్రతీ చిన్న అంశాన్ని మార్కెటింగ్‌ తరహాలో ప్రచారం సాగిస్తున్నారు. ఆ విధంగానే గ్యాలరీవాక్‌, జలహారతులు రంగంలోకి వచ్చాయి.

ఎందుకు ఆయన వీటికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తున్నారు. పనికన్నా ప్రచారం ఎక్కువ కోరుకోవడం వెనుక కారణం ఏమిటి? పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పనికన్నా దాని వర్చువల్‌ పరిశీలన, నేరుగా వెళ్లి పరిశీలించడం చాలా సార్లు జరిగింది. ఇదంతా కేవలం ప్రచారం కోసమే. సాధారణంగా పని ప్రారంభించేప్పుడు శంకుస్థాపన, భూమిపూజ చేస్తారు. ఈ పని రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉనప్పుడే జరిగిపోయాయి. అప్పుడే పనులు ప్రారంభించారు. మామూలుగా అయితే చివరకు ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన తరువాత జాతికి అంకితం చేసే సమయంలో ప్రచారం నిర్వహిస్తారు.

కానీ పోలవరం విషయంలో స్పిల్‌వేకి ఒకసారి, రాక్‌ఫిల్‌ ఢ్యాంకు మరోసారి, పవర్‌బ్లాక్‌కు ఇంకోసారి, డయల్‌ఫ్రం వాల్‌కు వేరోసారి, మట్టిపనికి ఇంకొకసారి, కాంక్రిట్‌ పనికి…. మళ్లీ ఇలా ప్రతీపనికి శంకుస్థాపనలు చేశారు. ఇంకా చాలానే ఉన్నాయి. సాధారణంగా అయితే ప్రాజెక్ట్‌ మొత్తాన్ని సమగ్రంగా ఒకే పనిగా తీసుకుంటారు. కానీ ప్రచారం కోసం బాబు ప్రాజెక్ట్‌లో అడుగడుగును వినియోగించుకోవటానికి వెనుకాడడంలేదు.

ఇక జలహారతి కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో ముఖ్యంగా నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలాశయాలు నిండాయి. ఇందుకు ప్రకృతి కారణం. కానీ ఆయన ధోరణి భిన్నంగా ఉంటుంది. తాను అధికారంలో ఉండటం వల్లనే ఆ జలాశయాలకు నీళ్లు వచ్చాయని గతంలో వాటికి ఎప్పుడూ వరద, నీళ్లు రాలేదనే ధోరణిలో ఇప్పుడు హారతి నిర్వహిస్తున్నారు. ఈ హారతి ద్వారా ప్రాజెక్టులు నుంచి రైతులకు తనవల్లే ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలనేది తెలుగుదేశం మీడియా మార్కెటింగ్‌ బృందం లక్ష్యంగా కనిపిస్తోంది. బహుశా భవిష్యత్తులో సకాలంలో వర్షాలు కురిస్తే కూడా ఆ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇలా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు చేస్తోంది? అందుకు బలమైన కారణం లేకపోలేదు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో దాదాపు ఏడేళ్ళపాటు రాష్ట్రాన్ని కరువులు వెంబడించాయి. ప్రాజెక్టుల్లోకి సరిగ్గా నీరు రాలేదు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు అధికమయ్యాయి. దాంతో పాటు ఆయన వ్యవసాయ, గ్రామీణ, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యత తగ్గించి పారిశ్రామిక, సాంకేతిక (ఐటి) రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రైతు వ్యతిరేకిగా ఆయనపై ముద్రపడింది. అదే సమయంలో ఆయన వ్యవసాయం దండగా అంటూ బహిరంగంగా సెలవిచ్చారు.

రైతులను సేవా-సాంకేతిక రంగాలవైపు మళ్లించాలని సూచించారు. దీనివల్ల 2004 ఎన్నికల్లో తెలుగుదేశం తీవ్రంగా నష్టపోయింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సాగునీటి ప్రాజెక్ట్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు జలయజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈపీసీ విధాన్నాన్ని అన్ని ప్రాజెక్ట్‌ల్లోనూ అమలులోకి తెచ్చారు.

ఇప్పుడు జరుగుతున్న పోలవరమైనా, మరేప్రాజెక్టయినా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 80కి పైగా ప్రాజెక్ట్‌లు) ఆయన చేపట్టినవే. పట్టిసీమ విజయవంతం కావడానికి కూడా అప్పట్లో ఆయన పోలవరం కుడికాలువను యుద్ధప్రాతిపదికన తవ్వించడమే. ఇలా చెప్పుకుంటూ పోతే రాయలసీమకు వరప్రసాదినిగా మారిన హంద్రినీవా, గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడు హెడ్‌రేగ్యులేటర్‌ తదితర పనులన్నీ ఆయన కాలంలోనే మొదలయ్యాయి.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తన ఇమేజీని రాజకీయంగా మార్కెటింగ్‌ చేసుకునేందుకు ఈయన కూడా ప్రాజెక్ట్‌ల బాటను పట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే చంద్రబాబు నడుస్తున్నారు. అయితే వైయస్సార్‌ను మరిపించి సాగునీటి రంగంలో తానే జలయజ్ఞ పితామహుడిగా పేరుసంపాదించుకోవాలంటే ప్రాజెక్ట్‌లను పూర్తిగా రాజకీయ మార్కెటింగ్‌కి ఉపయోగించుకోవాలి. ఇందుకోసం రోజూ పోలవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయాలి. గ్యాలరీవాక్‌లు నిర్వహించాలి, జలహారతులు ఇవ్వాలి. తద్వారా కొత్త తరాల్లో తానే ప్రాజెక్ట్‌ల ప్రధాతగా అభిప్రాయం కలిగించాలి.

వైయస్సార్‌ ప్రాజెక్టుల గురించి అవగాహన ఉన్నవారికి సైతం ఆ విషయం మరిచిపోయేలా చేయ్యాలి. అందుకే జలహారతి, గ్యాలరివాక్‌లకు ఇంత ప్రాధాన్యత. ఆఖరకు దేవాంశ్‌ కు కూడా.

NEWS UPDATES

CINEMA UPDATES