బాబు సోకులకు షాక్‌ ఇచ్చిన కేంద్రం

2316

ఈ మూడున్నరేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆడిందే ఆట పాడిందే పాటలా సాగింది. ఏపీ బీజేపీలోని కీలక నేతలు కూడా చంద్రబాబుకు వంతపాడే వారే కావడంతో ఆయనకు ఎదురులేకుండాపోయింది. కేంద్రంలో వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుకు ఆయన కొండంత అండగా ఉండేవారని చెబుతుంటారు. కానీ వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతిగా పంపిన తర్వాత పరిస్థితి మారిపోయింది.

చంద్రబాబు ప్రభుత్వ ప్రతి చర్యను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణంలో చంద్రబాబు సొంతంగా టెండర్లు పిలువగా ముందు వాటిని ఆపేయండి అంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబు పనితీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా కేంద్రం నుంచి వచ్చే నిధులను తాత్కాలికంగా ఆపేశారు. ఇందుకు కారణం కూడా పరోక్షంగా చంద్రబాబు ఏకపక్ష వైఖరే కావడం విశేషం. అనేక పథకాలకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. కానీ ప్రజల్లో మాత్రం కేంద్రానికి ఒక్క శాతం క్రెడిట్‌ గానీ, పబ్లిసిటీగానీ రాకుండా చంద్రబాబు వ్యవహారం నడిపారు.

చివరకు ప్రధాని పేరుతో ఉన్న బీమా పథకానికి కూడా చంద్రన్న భీమా అంటూ చంద్రబాబు సొంతం చేసుకుని ప్రచారం చేసుకున్నారు. బీజేపీ నేతలు దీనిపై అభ్యంతరం చెప్పగా… తెలివిగా చంద్రన్న బీమా ముందు.. ప్రధాని అన్న పదం చేర్చి ప్రధాని చంద్రన్న బీమా అంటూ మార్చేశారు. ఆ పేరు చంద్రబాబే ప్రధాని అన్న అర్థం వచ్చేలా ఉండడంతో బీజేపీ నేతలు సైతం కంగుతిన్నారు. ఇక గ్రామాల్లో వేసే సిమెంట్‌ రోడ్లకు వంద శాతం నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి. అయితే చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు మాత్రం సీసీ రోడ్లన్నీ తామే వేస్తున్నామంటూ ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తున్నారు. వాటికి చంద్రన్న బాట అంటూ సొంత ప్రచారం చేసుకున్నారు. ఉపాధి నిధుల సంగతి సరే సరి.

ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం.. ఉపాధి పనులను పరిశీలించింది. పనులు పూర్తయిన చోటుకు వెళ్లి స్థానికులను ఆరా తీయగా.. వారంతా ఇవి చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనులే అని చెప్పారు గానీ.. ఒక్కరంటే ఒక్కరు కేంద్ర నిధులతో చేసినవిగా గుర్తించలేదు. దీంతో కేంద్రం పంపుతున్న నిధులను చంద్రబాబు సొంత సోకులకు ప్రచారం చేసుకుంటున్నట్టు కేంద్రానికి బృందం నివేదిక ఇచ్చింది. దీనికి తోడు ఏపీ బీజేపీలోని మోడీ వర్గం చంద్రబాబు తీరుపై ఇటీవల పలు ఫిర్యాదులు చేశారు. కేంద్ర బృందం నివేదిక, బీజేపీ నేతలు ఫిర్యాదులను బేరీజు వేసిన కేంద్రం… ఏపీకి ఇచ్చే నిధులను తాత్కాలికంగా ఆపేసింది. ఇకపై తాను చెప్పినట్టుగా ఖచ్చితమైన మార్గదర్శకాలు పాటిస్తేనే నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

ఉపాధి హామీ కింద చేసే పనులకు రికార్డులు పక్కాగా ఉండాలని ఆదేశించింది. కేంద్ర నిధులతో గ్రామాల్లో వేసే సీసీ రోడ్లకు చంద్రన్న బాటగా పేరు పెట్టుకోవడంపై సీరియస్‌గా ఉన్న కేంద్రం … ఆయా రోడ్ల నిర్మాణం సమయంలో ఏర్పాటు చేసే బోర్డుల్లో ఇవి కేంద్ర నిధులతో నిర్మించిన దారులు అంటూ స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది. అప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తాయని స్పష్టం చేసింది. మొత్తం మీద చంద్రబాబు సొంత ప్రచార పిచ్చి కారణంగానే కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES