చిరుకు వెన్నుపోటు పొడిచిందే నీవు….

1012

వైఎస్‌ హయాంలో అవినీతి జరిగింది.. తండ్రి సీఎం కాబట్టి కొడుకు కూడా సీఎం కావాలనుకోవడం నీచం అంటూ పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రోజా ఫైర్ అయ్యారు. జనసేన చంద్రబాబుకు భజనసేన అన్న విషయం పవన్ మాటలతో స్పష్టంగా అర్థమైందన్నారు. చంద్రబాబుది తల్లి టీడీపీ అయితే…. పవన్‌ కల్యాణ్‌ది పిల్ల టీడీపీ అని విమర్శించారు. చంద్రబాబు ఏదైనా సమస్యలో ఇరుక్కున్న వెంటనే పవన్‌ కల్యాణ్‌ తెరపైకి వస్తున్నారని రోజా విమర్శించారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఇంత వరకు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అనుభవం లేని వారు సీఎం కాకూడదంటున్న పవన్‌ కల్యాణ్…. మరి ఎమ్మెల్యే కూడా కానీ లోకేష్‌ నేరుగా మంత్రి అయితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును మాత్రం భుజాన మోస్తారా అని ప్రశ్నించారు. ఏ అనుభవం ఉందని చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టారని నిలదీశారు. పోలవరం పరిశీలనకు వైసీపీ నేతలు వస్తున్నారని తెలియగానే… షెడ్యూల్‌లో లేకపోయినా పవన్ కల్యాణ్ పోలవరం వద్దకు వచ్చారన్నారు. ఇదంతా చంద్రబాబు నడిపిస్తున్న డ్రామాలో భాగమేనన్నారు. విజయవాడ వద్ద పడవ ప్రమాదం గురించి లండన్‌లో విద్యార్థి చెబితేనే తెలిసిందంటున్న పవన్‌ కల్యాణ్‌కు… ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ తగలబడిన విషయం రాత్రికి రాత్రే తెలిసిపోయిందా అని ప్రశ్నించారు…. ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ గురించి వెంటనే సమాచారం ఉంటుందిగానీ…. సొంత రాష్ట్రంలో బోటు ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయినా పవన్ దృష్టికి రాలేదా అని నిలదీశారు. ఆంధ్రజ్యోతి ఆపీస్ కాలిపోతే వెళ్లి పరామర్శించేందుకు మాత్రం పవన్ కు సమయం ఉందా అని ఎద్దేవా చేశారు. ప్రతిసారి జగన్‌కు తాను 2014 ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని పవన్‌ కల్యాణ్ చెబుతున్నారని…. ఎప్పుడైనా జగన్‌ వచ్చి మద్దతు ఇవ్వాలని కోరారా అని రోజా నిలదీశారు.

పవన్‌ కల్యాణ్‌ వారసత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వారసత్వం రాజకీయాలకు మాత్రమే వర్తిస్తుందా…. సినిమాలకు వర్తించదా అని ప్రశ్నించారు. చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ అయితే…. ఆయన పేరు చెప్పుకుని వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు రోజా. చిరంజీవి వారసత్వం లేకుంటే పవన్‌ కల్యాణ్ ఎక్కడుండేవారని ప్రశ్నించారు. చిరంజీవికి అన్యాయం చేసిన మొదటి వ్యక్తి పవన్‌ కల్యాణేనని రోజా విమర్శించారు. పీఆర్పీ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంలో పార్టీ యువఅధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న పవన్‌ కల్యాణ్… పార్టీ అధికారంలోకి రాకపోయే సరికి నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారన్నారు. సేవ చేయడానికి అధికారమే అవసరం లేదంటున్న పవన్‌ కల్యాణ్ మరి ఆరోజు పీఆర్పీని ఎందుకు నడపలేదని రోజా ప్రశ్నించారు.

పార్టీ ఓడిపోగానే చిరంజీవిని వదిలేసి వెళ్లిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చిరంజీవిపై, పీఆర్పీపై ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో దారుణమైన కథనాలు రాయించి పార్టీ మూతపడేలా చేసిన వ్యక్తి చంద్రబాబు కాదా అని పవన్‌ను రోజా ప్రశ్నించారు. ఇప్పుడు అదే చంద్రబాబు పంచన చేరి…. చిరంజీవిని దెబ్బతీసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పడం హాస్యాస్పదమని రోజా అభిప్రాయపడ్డారు. విజయనగరంలో ఓ వ్యక్తి చనిపోతే పవన్‌ వెళ్లారు. మరి నారాయణ కాలేజీల్లో వందలమంది విద్యార్థులు చనిపోతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు… నారాయణ, గంటా శ్రీనివాసరావు గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు రోజా. అత్యంత అవినీతిపరుడైన చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నందుకు పవన్‌ కల్యాణ్‌ సిగ్గుపడాలన్నారు. ఇప్పటికైనా పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చేయిస్తున్న డ్రామాలు ఆపేసి సినిమాలు చేసుకుంటే మంచిదన్నారు. షూటింగ్‌ గ్యాప్‌లో వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని రోజా హెచ్చరించారు.

NEWS UPDATES

CINEMA UPDATES