జాతీయతకోసం ఆరాటం

616

యూరప్ లో “జాతీయతా సమస్య” చాలా వరకు పరిష్కారం అయిపోయింది. కాని గతంలో యూరప్ కు వలసలుగా ఉన్న దేశాలలో, అర్థ వలస దేశాలలొ జరుగుతున్న ఘర్షణల గురించి మీడియాలో వస్తున్న వార్తలనుబట్టి ఆ దేశాలు ఇంకా వెనకబడి ఉన్నాయని రుజువు అవుతోంది. స్పెయిన్ కు ఈశాన్య ప్రాంతంలో ఉన్న కటలోనియాలోని పరిణామాలు ఈ భ్రమను పటాపంచలు చేశాయి.

స్పయిన్ రాజ్యాంగాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కాదని కటలోనియా 2017 అక్టోబర్ ఒకటిన తమ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాజ్యప్రతిపత్తి కోరుతున్నారా లేదా అనే విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఇది రాజ్య హింసకు దారి తీసింది. భారీగా ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఓట్లు వేయడానికి వస్తే స్పెయిన్ పోలీసులు శాంతియుతంగా ఉన్న పౌరులపై విరుచుకుపడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. అయినా 42.3 శాతం మంది ఓటు వేసి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం కావాలని కోరారు. అయితే కటలోనియాలో స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. వారు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు. అయినప్పటికీ ఇది కటలోనియా జాతీయతకు విజయమే. స్పెయిన్ హింసకు పాల్పడడం వల్ల తన రాజ్యాధికార బలహీనతను బహిర్గతం చేసుకుంది. పౌరుల శాసనోల్లంఘన లక్ష్యం ప్రభుత్వాన్ని సిగ్గుపడేట్టు చేయడం. వలసవాద వ్యతిరేక జాతీయవాదాలన్నీ గతంలో ఇదే పని చేశాయి. సామ్రాజ్యవాద అంతం గురించి యూరప్ దేశాలు తమ చరిత్రను పరిశీలించడం మంచిది.

ఫ్రాన్సిస్కో ఫ్రాంకో ఫాసిస్టు పాలన కొనసాగినప్పుడు కటలోనియా ప్రజల స్వయం నిర్ణయాధికార ఆకాంక్ష బలంగా వ్యక్తమైంది. ఫ్రాంకో కటలోనియా భాషను కూడా నిషేధించాడు. కటలాన్ ప్రాంత పేర్లను కూడా నిషేధించాడు. కాని ఈ అణచివేత సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారి తీసింది. ప్రజలు ప్రైవేటుగా తమ భాషను వినియోగించారు. దానితో వారి సంస్కృతి, సాహిత్యం వికసించాయి. అందువల్ల కటలాన్ జాతీయతా వాదం ప్రధానంగా సంస్కృతి, భాషకు సంబంధించిందే. ఫ్రాంకో హయాంలో కటలోనియా భారీగా ఆర్థికాభివృద్ధి సాధించిన మాట నిజమే. ఫాసిస్టు పాలనలో ఇది మామూలే. కటలోనియా యూరప్ లో చాలా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎదిగింది.  తమ ప్రయత్నాలు కొనసాగించవచ్చునన్న భావన కటలాన్ జాతీయులకు కలిగింది. కాని కటలోనియా తన ఆర్థికాభివృద్ధి ఫలితాలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పించడానికి నిరాకరించడం వల్ల కటలాన్ జాతీయవాదం కేవలం ప్రచారం అన్న భావన కలిగింది. ఈ ప్రచారం చేసే వారి భావాలను అర్థం చేసుకోవచ్చు. కటలోనియా కనక విడిపోతే తమకు ఆర్థికంగా చాలా నష్టం అన్న విషయం స్పెయిన్ కు బాగా తెలుసు. అప్పుడు వరసగా సమస్యలు వెల్లువెత్తుతాయని యూరప్ సమాజంతో సహా యూరప్ దేశాలు భావిస్తున్నాయి.

కటలాన్ లో జనాభిప్రాయసేకరణను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అది “చట్ట విరుద్ధం” అయిందిగా భావించడమే. జాతీయ ప్రభుత్వాలే జనాభిప్రాయ సేకరణ నిర్వహించగలవని, దేశంలోని విభాగాలకు ఆ అధికారం లేదని స్పెయిన్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రకటించింది. ఈ వాదన కపటమైందే కాక దిగ్భ్రాంతి కలిగించేది కూడా. జాతీయ భౌగోళిక సమైక్యతను కాపడడమే జాతి రాజ్యాల లక్ష్యం అనుకుంటే నిష్పక్షపాతంగా చూసే వారందరికీ ఏ జాతీయ ప్రభుత్వమైనా తన విచ్ఛిన్నాన్ని కోరుకుంటుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ప్రజలు ఒక జాతిగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం, స్వయం ప్రతిపత్తి సాధించుకోవడం వారి మౌలిక హక్కు. ప్రస్తుతం ఉన్న జాతి రాజ్యాలు రాజ్యాంగ పరంగా హక్కులు ప్రసాదించక ముందూ ఈ హక్కు ఉంది. దాన్ని జాతీయ ప్రభుత్వాలు ఏదో దయదలిచి ఇవ్వడం కాని లాగేసుకోవడం కాని కుదరదు.

జాతీయ ప్రభుత్వాలు నిర్వహించే జనాభిప్రాయ సేకరణలన్నీ చట్టబద్ధమైనవేనని, సవ్యమైనవని అనుకోవడం కూడా దిగ్భ్రాంతి కలిగించే వాదనే. బ్రెక్సిట్ వ్యవహారంలో యూరప్ ఇటీవల సమస్య ఎదుర్కున్నా ఇది వాస్తవమే. మితవాద ప్రభుత్వం విదేశాల విముఖతను, జాతీయతావాదాన్ని, కోల్పోయిన సామ్రాజ్య ఘనతను మళ్లీ పొందాలన్న భావనను రెచ్చగొట్టి మితవాద ప్రభుత్వం తమ ప్రజలను సార్వభౌమాధికర జాతీయతనో లేక పేద యూరపియన్ల దోపిడీకి గురి కావాలో తేల్చుకొమ్మని చెప్పింది. ప్రభుత్వం “ప్రజల అభిప్రాయాన్ని తక్షణం అమలు చేయాలని అనుకుంది. ఈ జనాభిప్రాయాన్ని పార్లమెంటులో చర్చించలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడానికి అనుసరించవలసిన ఏ పద్ధతులూ అనుసరించలేదు. బ్రెక్సిట్ ను అర్థం చేసుకోవడానికి ఇదో మార్గం. బ్రిటన్ లో ప్రజాభిప్రాయ సేకరణ క్రమాన్ని గమనించిన యూరప్ వాసులు ఇదే అభిప్రాయానికి వచ్చారు. దీన్నంతటినీ చట్టబద్ధమైందని, న్యాయమైందని భావిస్తున్నారు. కాని కటలాన్ ప్రజలు “నిబద్ధం కావాల్సిన అవసరం లేని” అనేక జనాభిప్రాయ సేకరణలు జరిపినప్పటికీ, పోలీసుల కిరాతకాన్ని సాహసోపేతంగా ఎదుర్కున్నప్పటికీ ఆ ప్రజాభిప్రాయ సేకరణ చట్ట వ్యతిరేకమైంది అంటున్నరు. కనీసం రాజకీయ సంప్రదింపులకు కూడా నిరాకరిస్తున్నారు.

కటలోనియాలో ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన అంశాలు నెమ్మదిగా బహిర్గతమవుతున్నాయి. కటలాన్ పార్లమెంటు స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించింది. కాని కటలాన్ అధ్యక్షుడు కార్ల్స్ ప్యుడ్జొమాంట్ మాత్రం స్పెయిన్ ప్రభుత్వంతో సంప్రదింపుల ప్రయత్నాలను విడనాడారు. అయితే స్పెయిన్ ప్రధానమంత్రి మరియానో రజోయ్ సంప్రదింపులకు నిరాకరించారు. ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగంలోని 155వ అధికరణాన్ని అమలు చేస్తానని బెదిరిస్తున్నారు. పరిణతితో, జాగ్రత్తగా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే తప్ప ఈ సంక్షోభం మరింత ముదురుతుంది. కటలాన్ తన స్వయంప్రతిపత్తిని పరిరక్షించడానికి ప్రయత్నింస్తుందని, తన రాష్ట్రాల ప్రయోజనలకు, నిర్ణయాలకు బందీగా ఉండదని ఆశిద్దాం.

(ఇ.పి.డబ్ల్యు. 2017 అక్టోబర్ 14 సంచిక సౌజన్యంతో)

NEWS UPDATES

CINEMA UPDATES