అనేక భారత రికార్డులు ఈమె సొంతం

1734

ఒక మ‌హిళ త‌న‌ను తాను నిరూపించుకోవాలంటే ఎదురీదాల్సిందే ఇప్ప‌టికీ. ఆధునిక స‌మాజంలోనూ ఎదురీత త‌ప్ప‌డం లేదు. అలాంటిది… పూర్తి సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన నేప‌థ్యంలో మ‌హిళ ఇల్లు దాటి త‌ల బ‌య‌ట పెట్ట‌డానికి అనుమ‌తించ‌ని రోజుల్లో మ‌హిళ‌ల ప‌రిస్థితి ఎలా ఉండేదో? ఆ రోజుల్లో తొలి అడుగులు వేసిన అచీవ‌ర్స్ ఎంద‌రో. వారంతా నేటి మ‌హిళ‌ల‌కు ఒక దారి వేశారు. ఆ మార్గ‌ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు కార్నెలియా సొరాబ్టి. ఆమె మ‌హిళాభివ్రుద్ధికి బాట‌లు వేసిన తొలి త‌రం మ‌హిళ మాత్ర‌మే కాదు. అనేక ‘తొలి’ రికార్డుల‌ను సొంతం చేసుకున్నారు.

ఆమె 1866, నవంబర్‌ 15న నాసిక్‌లో జన్మించారు…. అప్ప‌టిక‌ది బ్రిటిష్ పాల‌న‌లో బొంబాయి ప్రెసిడెన్సీలో భాగం.

  • ఆమె బొంబాయి యూనివ‌ర్శిటీ నుంచి తొలి మ‌హిళా గ్రాడ్యుయ‌ట్‌.
  • ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ నుంచి లా గ్రాడ్యుయేట్ల‌లో తొలి మ‌హిళ‌.
  • బ్రిటిష్ యూనివ‌ర్శిటీల‌లో చ‌దివిన తొలి ఇండియ‌న్‌.
  • ఇండియా తొలి మ‌హిళా న్యాయ‌వాది.
  • ఇండియాలోనూ, బ్రిట‌న్‌లోనూ లా ప్రాక్టీస్ చేసిన తొలి మ‌హిళ కూడా.

ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న కార్నెలియా సొరాబ్జీ తండ్రి రెవ‌రెండ్ సొరాబ్జీ కర్సేద్ జీ, త‌ల్లి ఫ్రాన్సినా ఫోర్డ్‌. వీరికి తొమ్మిది మంది సంతానం. కార్నెలియాను బ్రిటిష్ దంప‌తులు ద‌త్త‌త తీసుకున్నారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం ఇండియాలోనే జ‌రిగింది. ఆక్స్‌ఫ‌ర్డ్‌లో చ‌దివిన త‌ర్వాత ఇండియాకే వ‌చ్చేశారామె. అల‌హాబాద్ హై కోర్టులో ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. అప్ప‌టికి మ‌హిళ‌లు న్యాయ‌వాద వృత్తిలో లేక‌పోవ‌డంతో నిబంధ‌న‌ల ప‌రంగా ఆమెకు అనేక ఇబ్బందులు ఎదుర‌య్యాయి. వాటిని ఎదురీదుతూ ప్రొఫెష‌న్‌లో కొన‌సాగారు.

మ‌హిళ‌ల‌కు హ‌క్కుల‌నేవి ఉంటాయ‌నే క‌నీస సృహ లేని రోజుల్లో మ‌హిళ‌ల కోసం శ్ర‌మించారామె. దేశంలో శిశువులకు, ప్ర‌స‌వం స‌మ‌యంలో స్త్రీల‌కు మెరుగైన వైద్యం అంద‌డం లేద‌నే కార‌ణంగా దేశ‌మంతా ప‌ర్య‌టించారు. ప‌రిస్థితిని అవ‌గాహ‌న చేసుకున్న త‌ర్వాత ఆమె సంఘ సంస్క‌ర్త‌గా మారారు. కొన్ని సంద‌ర్భాల‌లో మ‌హాత్మా గాంధీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. ముఖ్యంగా శాస‌నోల్లంఘ‌న ఉద్య‌మాన్ని ఆమె తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. హిందూ సంప్ర‌దాయ విధానంలో మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల మీద స‌మాజాన్ని చైత‌న్య ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. విమెన్ రైట్స్ యాక్టివిస్టుగా ఆమె సేవ‌ల‌కు కైస‌ర్ ఇ హింద్ నుంచి గోల్డ్ మెడ‌ల్ అందుకున్నారు.

ఆమె లండ‌న్ వెళ్లి అక్క‌డ న్యాయ‌వాదిగా కొన‌సాగారు. లండ‌న్ వెళ్లిన త‌ర్వాత కూడా శీతాకాలంలో ఇండియాకి వ‌చ్చి వెళ్తుండే వారు. విశ్రాంత జీవ‌నాన్ని లండ‌న్‌లోని గ‌డుపుతూ 1954, జూలై 6వ తేదీన తుది శ్వాస‌వ‌దిలారు.

దేశంలో మ‌హిళాభ్యుద‌య వాదానికి ఆమె వేసిన తొలి అడుగులు నేటికీ దారి చూపిస్తూనే ఉన్నాయి. కొన‌సాగుతున్న పోరాటానికి త‌ర‌గ‌ని స్ఫూర్తిగా ఆమె ఎప్ప‌టికీ నిలిచి ఉంటారు.

NEWS UPDATES

CINEMA UPDATES