ది వైర్ న్యూస్ పోర్ట‌ల్‌కు స‌మ‌న్లు

549

అమిత్ షా కుమారుడు జ‌య్ షా కంపెనీల‌పై సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించిన ది వైర్ న్యూస్ పోర్ట‌ల్ ఇర‌కాటంలో ప‌డింది.
అహ్మ‌దాబాద్ కోర్టు వైర్ న్యూస్ పోర్ట‌ల్‌కి చెందిన ఆరుగురికి స‌మ‌న్లు జారీ చేసింది.

సంచ‌న‌ల క‌థ‌నం రాసిన జ‌ర్న‌లిస్ట్ రోహిణీ సింగ్‌తో పాటు సంస్థ‌కు చెందిన‌ మ‌రో ఐదుగురు ఎడిట‌ర్ల‌కు స‌మ‌న్లు పంపింది. న‌వంబ‌ర్ 13లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

జ‌ర్న‌లిస్ట్ రోహినీ సింగ్ తో పాటు న్యూస్ పోర్ట‌ల్ ఫౌండర్ ఎడిట‌ర్స్ సిద్ధార్డ్ వ‌ర‌ద‌రాజ‌న్‌, సిద్ధార్ధ భాటియా, ఎంకె వేణు మ‌రియు మేనేజింగ్ ఎడిట‌ర్ మోనోబినా గుప్తా, ప‌బ్లిక్ ఎడిట‌ర్ ప‌మీలా ఫిలిపోజ్, వైర్ న్యూస్ పోర్ట‌ల్‌లో క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్న సంస్థ‌ ఫౌండేష‌న్ ఫ‌ర్ ఇండిపెండెంట్ జ‌ర్న‌లిజం ….కోర్టు స‌మ‌న్లు అందుకున్నారు.

ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ సెక్ష‌న్ 500 ప్ర‌కారం వైర్ న్యూస్ పోర్ట‌ల్‌పై చ‌ర్య‌లు తీసుకోడానికి అహ్మ‌దాబాద్ కోర్టు అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తోంది.

జ‌య్ షా వేసిన ప‌రువు న‌ష్టం దావాను ప‌రిశీలించిన కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. జ‌య్ షా న్యాయ‌వాది ఎస్‌వి రాజు కోర్టుకు స‌మ‌ర్పించిన డాక్యుమెంట్ల‌ను కోర్టు క్షుణ్ణంగా ప‌రిశీలించింది.

జ‌య్ షా ప‌రువును దిగజార్చే ఉద్దేశ్యంతోనే వైర్ న్యూస్ పోర్ట‌ల్ ఈ సంచ‌ల‌నాత్మ‌క‌ క‌థ‌నం ప్ర‌చురించింద‌ని రాజు కోర్టుకు తెలిపారు. జ‌య్ షా కూడా త‌న వాద‌న‌ను లాయ‌ర్ ద్వారా వినిపించారు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా, త‌మ‌పై ఉసిగొలిపే విధంగా క‌థ‌నం ఉంద‌ని కోర్టుకు తెలియ‌ప‌రిచారు.

కేసు న‌మోదు చేయ‌డంలో జాగ్ర‌త్త‌లు

వైర్ న్యూస్ పోర్ట‌ల్‌పై ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేసేట‌ప్పుడు జ‌య్ షా వ‌ర్గీయులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని సెక్ష‌న్ 500, సెక్ష‌న్ 109, సెక్ష‌న్ 39, సెక్ష‌న్ 120 బి ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టును కోరారు.

జైమిన్ షా, రాజీవ్ షా అనే ఇద్ద‌రు వ్యాపార వేత్త‌లు కోర్టులో సాక్షులుగా హాజ‌ర‌య్యారు. త‌మ‌కు ఏవిధంగా ప‌రువు న‌ష్టం క‌లిగిందో వివ‌రించారు.

కొన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బిజెపి ప‌రువును తీసేందుకు మాత్ర‌మే ఈ సంచ‌ల‌నాత్మ‌క క‌థనాన్ని ది వైర్ ప్ర‌చురించింద‌ని జ‌య్ షా లాయ‌ర్ కోర్టుకు తెలిపారు.

ది వైర్ జ‌య్ షా కు కొన్ని ప్రశ్నలు పంపింద‌ని… వాటికి స‌మాధానాలు చెప్ప‌డానికి త‌గిన స‌మ‌యం ఇవ్వ‌కుండా వారు క‌థ‌నాన్ని ప్ర‌చురించార‌ని లాయ‌ర్ రాజు కోర్టుకు తెలిపారు.

NEWS UPDATES

CINEMA UPDATES