‘డిటెక్టివ్’ సినిమా రివ్యూ

2396

రివ్యూ: డిటెక్టివ్
రేటింగ్‌: 2.75/5
తారాగణం: విశాల్‌,అను ఇమ్మాన్యుయేల్‌, ఆండ్రియా,  ప్రసన్న,  అభిషేక్‌, జాన్‌ విజయ్‌ తదితరులు
సంగీతం: అరోల్ కొరెల్లి
నిర్మాత:  జి. హరి
దర్శకత్వం: మిస్కిన్

తమిళ్ లో రెండు నెలల క్రితమే విడుదలైనా తెలుగు లో రావడానికి మాత్రం బాగా టైం తీసుకున్న మూవీ ‘డిటెక్టివ్’. ‘తుప్పరివాలన్’ పేరుతో అక్కడ రిలీజ్ అయ్యి మంచి విజయం కూడా సొంతం చేసుకున్న ఈ మూవీ కోసం ఒక వర్గం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూసారు. చాలా విభిన్నమైన థ్రిల్లర్ మూవీస్ తీస్తాడు అనే పేరున్న మిస్కిన్ దీనికి దర్శకత్వం వహించడం ముందు నుంచీ దీనిపై అంచనాలు వచ్చేలా చేసింది. విశాల్ మార్కెట్ తెలుగులో బాగా పడిపోయిన పరిస్థితుల్లో వచ్చిన ఈ మూవీపై ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద చూపించింది. మరి ఆకట్టుకునే కంటెంట్ ఇందులో ఉందో లేదో చూద్దాం.

పిడిగుపాటుకు ఒక తండ్రికొడుకులు, చిన్న పురుగులాంటిది ఏదో కుట్టి ఒక పోలీస్ ఆఫీసర్, సముద్రపు ఒడ్డున ఎవరో కాల్చిన ఒక బుల్లెట్ దెబ్బకు ఒక చిన్న కుక్క పిల్ల ఇలా నగరంలో వరసగా మరణాలు జరుగుతూ ఉంటాయి. కాని కారణాలు మాత్రం ఎవరికి అంతు చిక్కవు. ఇవి ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు ప్రైవేటు డిటెక్టివ్ అద్వైత్ భూషణ్(విశాల్). వీటి వెనుక ఒక గ్యాంగ్ ఉందని అతనికి అర్థమవుతుంది. కేసును చేధించుకుంటూ వెళ్తున్న క్రమంలో ఊహించని హత్యలు జరుగుతాయి. అసలు బయటికి కనిపించకుండా ఇవన్ని ఎవరు చేస్తున్నారు, దానికి కారణం ఏంటి అనేది తెరమీద చూడాల్సిందే.

విశాల్ ఇలాంటి సినిమా గతంలో ఎన్నడూ చేయకపోవడం ఈ మూవీకున్న అతి పెద్ద ప్లస్ పాయింట్. ఊరనాటు మాస్ మసాలా సినిమాల్లో ఇతన్ని చూసి చూసి విసుగు రావడం వల్లే ఈ మధ్య కాలంలో విశాల్ ఫెయిల్యూర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. అందుకే రిస్క్ తీసుకుని మరీ చేసిన ఈ మూవీ అతనికే కాదు చూస్తున్న మనకు కూడా స్పెషల్ అనిపిస్తుంది. ఛాలెంజ్ ఇచ్చే కేసు దొరక్కపోతే బాగా అసహనానికి గురయ్యే పాత్రలో చాలా బాగా నటించాడు. చాలా ఫ్రెష్ గా అనిపించడానికి కారణం కూడా అదే. అను ఇమ్మానియేల్ ది చాలా లిమిటెడ్ రోల్. తన నుంచి ఏదో ఆశించే ఫాన్స్ మాత్రం నిరాశ పడక తప్పదు. హీరో తర్వాత అంతగా ఆకట్టుకునేది విలన్ గ్యాంగ్ మెంబెర్స్. గ్యాంగ్ లీడర్ డెవిల్ వినయ్, ప్రమాదకర విషాలు తయారు చేసే డాక్టర్ గా సీనియర్ హీరో భాగ్య రాజ్, చూపులతో చంపేసే డేంజర్ లేడీ గా ఆండ్రియా ఒకరిని మించి ఒకరు అదరహో అనిపించారు. విశాల్‌ అసిస్టెంట్ గా ప్రసన్న కూడా చాలా బాగా చేసాడు.

దర్శకుడు మిస్కిన్ మేకింగ్ స్టైల్ చాలా టిపికల్ గా ఉంటుంది. సామాన్య ప్రేక్షకుడికి అంత ఈజీగా అర్థం కాదు. డిటెక్టివ్ కూడా అంతే. కేసు మిస్టరీని చేదించే క్రమాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. హత్యలు చేయడానికి నేరస్తులు ఎంతటి తెలివితేటలు వాడతారో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో చూపించడం మిస్కిన్ ఎక్స్ పర్ట్. ఒక్కొక్క చావును భయం కలిగేలా చూపించిన మిస్కిన్ దానికి కారణమైన వాళ్ళను కూడా అంత కన్నా ఎక్కువ భయానకంగా చూపడంలో బాగా సక్సెస్ అయ్యాడు. విలన్లు ఎక్కడా ఓవర్ యాక్షన్ చేయరు. కేకలు పెట్టరు. గెటప్ లు చాలా డీసెంట్ గా ఉంటాయి. కాని వాళ్ళను చూసినా చేసే పనులు తలుచుకున్నా ఒళ్ళు జలదరించేలా ఉంటాయి.అందుకే డిటెక్టివ్ మూవీస్, క్రైమ్ మూవీస్ ని ఇష్టపడేవాళ్ళను బాగా ఆకట్టుకుంటుంది. కాని మాస్ ని టార్గెట్ చేసే అంశాలు ఏవి లేకపోవడం, దీని కమర్షియల్ సక్సెస్ ని బాగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి కాని ఇది పూర్తిగా ఒక జానర్ ని టార్గెట్ చేసిన మూవీనే కాబట్టి ఆ రకంగా చూసుకుంటే కంటెంట్ పరంగా ఇందులో న్యాయం జరిగినట్టే. కాని రెండు గంటల నలభై ఐదు నిమషాల పాటు పాటలు లేకుండా కేవలం ఇన్వెస్టిగేషన్ అనే థ్రెడ్ మీద సినిమా మొత్తం నడిపించే ప్రయత్నం చేయటంతో సెకండ్ హాఫ్ లో బాగా సాగాదీసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా మర్డర్లు ప్రీ ప్లాన్డ్ చేసే డెవిల్ చివరిలో మాత్రం డాక్టర్ ని సిల్లీ గా చంపడం అంతగా నప్పలేదు. కుక్క పిల్ల బుల్లెట్ కి మెయిన్ ప్లాట్ కి లింక్ పెట్టడం మేజర్ హై లైట్. అరోల్ కొరెల్లి మ్యూజిక్, కార్తీక్ వెంకటరామన్ కెమెరా పనితనం సినిమా లెవెల్ ని బాగా పెంచాయి. బడ్జెట్ తక్కువే అయినా ఆ ఫీలింగ్ ఎక్కడా రాదు.

బుర్రకు అతిగా శ్రమ కలిగించకుండా చక్కని క్రైమ్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయాలంటే డిటెక్టివ్ ని ట్రై చేయవచ్చు. సగటు తెలుగు సినిమా లాగా మాసాలాలు, ఐటెం సాంగులు, కామెడీ ఉంటే తప్ప కుదురుగా కూర్చోలేము అనేవాళ్ళకు మాత్రం డిటెక్టివ్ రైట్ ఛాయస్ కాదు. రొటీన్ కి భిన్నంగా అనే మాట వినటమే కాని సినిమాల్లో చూడటం అరుదుగా మారిన పరిస్థితుల్లో ఇది మాత్రం ఆ ట్యాగ్ కి పూర్తి న్యాయం చేకూరేలా ఉంటుంది. థ్రిల్లర్ జానర్ లవర్స్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయని డిటెక్టివ్ ని చూడొచ్చు.

NEWS UPDATES

CINEMA UPDATES