గుడిగంటలు

383

ఒక నగరంలో ఎన్నో దేవుడి ఆలయాలు ఉండేవట. దాన్ని ‘దేవుని మందిరాల నగరం’ అని పిలిచేవాళ్ళట. ఆ నగరం నీటిలో మునిగిపోయిందట. కానీ ఆ నగరంలో ఇప్పటికీ గుడిగంటలు వినిపిస్తాయని అంటారు. ఆ గుడిగంటల్ని విని తరించాలని నేను నగరాన్ని అన్వేషించడానికి సముద్రతీరం చేరాను. అక్కడ అలల శబ్ధం తప్ప నాకు గుడి గంటలు వినిపించలేదు. అవిశ్రాంతంగా అలలు కదుల్తూ ఉన్నాయి. కానీ సముద్ర తీరంలో నాకో నిశ్శబ్ధం కనిపించింది. ఒక ఏకాంతం ధ్వనించింది. అయితే ఆ నిశ్శబ్ధం ఏకాంతం అవిశ్రాంతంగా కదులుతున్న అలల కింద ఉన్నట్లు గమనించాను. అలల శబ్ధాలలో ఆ నిశ్శబ్ధం అడుగు భాగాన్నే ఆగిపోయినట్లు తెలుసుకున్నాను. ఆ నిశ్శబ్ధ సంగీతమే దేవుని ఆలయాలు చేసే గుడిగంటల మధుర నాదమని గ్రహించాను. ఎన్ని రాత్రులు సముద్రతీరానికి చెవి ఆనించినా అలల శబ్ధమే వినిపిస్తుంది. అవిశ్రాంత సముద్ర ఘోషే వినిపిస్తుంది.

నేను అలసిపోలేదు. పట్టుదల వదిలి పెట్టలేదు. నేను వెనక్కి వెళ్లదలచుకోలేదు. అసలు వచ్చిన దారినే మరిచిపోయాను. ఆ పరిచయంలేని సముద్రతీరమే నా నిలయంగా మార్చుకున్నాను. నిజానికి వచ్చిన పనికూడా మరిచిపోయాను. ఒకరోజు హఠాత్తుగా నాకో సంగీతం వినిపించింది. ఏళ్ల తరబడి నేను ఎదురు చూస్తున్న మధుర నాదం నాకు వినిపించింది. ఆ సంగీతం నన్ను అనంత లోకాలకు, ఆహ్లాద తీరాలకు తీసుకుపోయింది. నాలో ప్రతి అణువు ఆ పవిత్ర భావంతో నిండిపోయింది. అది నాలోని చీకట్ని వెడల గొట్టి నన్ను కాంతితో నింపింది. నాలోని అనంత చైతన్యాన్ని ఆవిష్కరించింది. అప్పటినుంచి నన్ను ఎట్లాంటి మత్తూ కమ్మలేదు. ఎట్లాంటి మాయ చుట్టుముట్టలేదు. నిత్యం మెలకువతో ఉండి నాలోని అంధకారాన్ని పారదోలాను. అప్పటినుంచి ఆ మనోహర సంగీతాన్ని వింటూనే ఉన్నాను. నేను సంతోషంలో ఉన్నాను. నేనే ఆనంద స్వరూపంగా మారిపోయాను. ఎక్కడ దేవుని గుడిగంటలు మోగుతాయో అక్కడ సంతోష సముద్రముంటుంది. దు:ఖముండదు కదా!

మీరు కూడా ఆ సముద్ర తీరానికి వెళ్లాలనుకుంటున్నారా? సముద్రంలో మునిగిపోయిన దేవాలయాల గుడి గంటల సంగీతాన్ని వినాలనుకుంటున్నారా? అట్లా భావిస్తే మీ హృదయమనే సముద్రంలోకి వెళ్లండి. మీ హృదయ సముద్రం కోరికలనే అలల్తో అల్లకల్లోలంగా ఉంది. ఆ అలల అడుగున అనంత నిశ్శబ్దముంది. ఆ నిశ్శబ్దాన్ని వినడానికి ప్రయత్నించండి’ అదే దేవుని మందిరం. అక్కడ గుడిగంటలు వినిపిస్తాయి. కానీ ఎవరి గుడిగంటలు వాళ్లకు మాత్రమే వినిపిస్తాయి. వవరైతే దేవుని గుడి గంటల్ని వినాలనుకుంటారో వాళ్ళు మాత్రమే కోరికల అలల శబ్ధాన్ని అర్ధం చేసుకుంటారు. కోరికల అలలకి, సముద్ర తరంగాలకి విశ్రాంతి, వెసులుబాటు ఉండదు. తృప్తి ఉండదు. అందుకనే మనిషి దు:ఖంలో ఉన్నాడు. పట్టుదలతో దేవుని గంటలు వినాలనుకుంటే మీరు ఆనంద స్వరూపులుగా మారతారు. కోరికల అలల్ని దాటలేని వాళ్ళు మనోహర నిశ్శబ్ద సంగీతాన్ని వినలేరు. ఆనందాన్ని అందుకోలేరు.

– సౌభాగ్య

NEWS UPDATES

CINEMA UPDATES