వ‌ర‌ల్డ్ డ‌యాబెటిస్ డే 2017…. ఇండియా డ‌యాబెటిక్ క్యాపిట‌ల్‌!

1385

ఇటీవ‌ల కొన్ని ద‌శాబ్దాల‌లో ద‌క్షిణ ఆసియా దేశాల్లో డ‌యాబెటిస్‌ విస్త‌రిస్తోంది. అయితే అన్నింటిలోకి ఇండియా డ‌యాబెటిస్ బారిన ఎక్కువ‌గా ప‌డుతోంది. ఇందుకు మారిన లైఫ్‌స్ట‌యిల్ ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. మ‌నుషుల‌లో సెంట్ర‌ల్ ఒబేసిటీ (పొట్ట పెరిగి న‌డుము చుట్టు కొల‌త పెర‌గ‌డం), అధిక ర‌క్త‌పోటు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా నిల్వ చేర‌డం, గుడ్ కొలెస్ట్రాల్ నిల్వ‌లు త‌గ్గిపోతుండ‌డం, ఇన్స్‌లిన్ రెసిస్టెన్స్ త‌గ్గ‌డం వంటివి తేడాలు వ‌స్తున్నాయి. ఇవ‌న్నీ క‌లిసి డ‌యాబెటిస్ మెలిట‌స్ అనే మెట‌బాలిక్ డిజార్డ‌ర్‌కు దారి తీస్తున్నాయి.

టైప్ 1 డ‌యాబెటిస్ నామ‌మాత్రంగానే క‌నిపిస్తోంది. టైప్ 2 డ‌యాబెటిస్ తీవ్రంగా విజ్రుంభిస్తోంది. లైఫ్‌స్ట‌యిల్ కార‌ణంగా మ‌నం కోరి తెచ్చుకుంటున్న స‌మ‌స్యే టైప్ 2 డ‌యాబెటిస్‌. ఈ డ‌యాబెటిక్‌ను కంట్రోల్‌లో పెట్టుకోలేక పోతే దీర్ఘ‌కాలంలో దేహంలో అనేక కీల‌క‌మైన అవ‌య‌వాల మీద దాడిచేస్తుంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల ముందు ఇండియా ఇందులో తొలి స్థానంలో నిలిచి ఉంది. ఈ ఏడాది వ‌ర‌ల్డ్ డ‌యాబెటిస్ ఫోర‌మ్… డ‌యాబెటిస్ కార‌ణంగా ఎదుర‌య్యే గుండె జ‌బ్బుల‌ను ప్ర‌ధాన అంశంగా తీసుకుంది.

డ‌యాబెటిస్ ఎన్ని ర‌కాలుగా హాని చేస్తుందంటే…

 • డ‌యాబెటిస్ గుండె వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాన్నిరెట్టింపు చేస్తుంది.
 • డ‌యాబెటిస్ కిడ్నీ ల ప‌ని తీరు మీద తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుంది.
 • డ‌యాబెటిస్‌ కంటిచూపును త‌గ్గించి అంధ‌త్వానికి కార‌ణ‌మ‌వుతుంది.

ముందుగా తెలుకునేదెలా?

 • ఎక్కువ ద‌ఫాలు మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్లాల్సి వ‌స్తుంటే
 • దాహం తీవ్రంగా ఉంటుంటే
 • ఆక‌లి విప‌రీతంగా ఉన్న‌ప్పుడు కూడా కార‌ణాల కోసం అన్వేషించాలి. వీటితోపాటు ఉన్న‌ట్లుండి బ‌రువు త‌గ్గ‌డం మొద‌లైతే అందుకు కార‌ణం డ‌యాబెటిస్ కూడా కావ‌చ్చు. కాబ‌ట్టి డ‌యాబెటిస్ ప‌రీక్ష‌లు కూడా చేయించుకోవాలి.

డ‌యాబెటిస్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డానికి ముందు ఐదేళ్ల నుంచి దేహంలో మార్పులు మొద‌ల‌వుతాయి. దీనిని ప్రీ డ‌యాబెటిస్ ఫేజ్ అంటారు. ఒక వ్య‌క్తిలో బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ నార్మ‌ల్ కంటే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తిస్తే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

ప్రీ డ‌యాబెటిస్ ఫేజ్‌లో గుర్తించిన వెంట‌నే మందులు వాడాల్సిన అవ‌స‌రం ఏ మాత్రం ఉండ‌దు. లైఫ్‌స్టైల్ మార్పుల‌తో డ‌యాబెటిస్ బారిన ప‌డ‌కుండా దేహాన్ని కాపాడుకోవ‌చ్చు. న‌ల‌భై దాటిన‌ప్ప‌టి నుంచి ఏడాదికి ఒక ద‌ఫా రొటీన్ డ‌యాబెటిస్ ప‌రీక్ష చేయించుకోవ‌డం మంచిది.

అడ్వాన్స్‌డ్ టెస్ట్‌లున్నాయి!

గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ (హెచ్‌బి ఎ వ‌న్ సి) టెస్ట్ ద్వారా మూడు నెల‌ల స‌రాస‌రి చ‌క్కెర స్థాయిల‌ను తెలుసుకోవ‌చ్చు.

నేష‌న‌ల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సీ ఈ ఓ, చీఫ్ కార్డియాక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ యాద‌వ్ చెప్తున్న ప్ర‌కారం… బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ ఇలా ఉండాలి.

 • 4.0 – 5.5 % నాన్ షుగ‌ర్‌
 • 5.7 – 6.4 % ప్రీ డ‌యాబెటిక్‌
 • 6.5 డ‌యాబెటిక్‌ 
 • 7.0 % డ‌యాబెటిస్ ఉంటుంది, కానీ గుడ్ కండిష‌న్ (ప్ర‌మాద స్థాయి కాదు)
 • 8.0% ఆ పైన పూర్ కంట్రోల్

డ‌యాబెటిస్ ఉన్న వాళ్లు చ‌క్కెర స్థాయుల‌ను 7.0 అంత‌కంటే త‌క్కువ‌గా ఉండేట‌ట్లు జాగ్ర‌త్త‌ప‌డాలి.

గుండెను కాపాడుకోవ‌డం ఎలా?

డ‌యాబెటిస్ నుంచి గుండెను కాపాడుకోవ‌డం గురించి తెలుసుకునే ముందు అది గుండెకు ఎన్ని ర‌కాలుగా హాని క‌లిగిస్తుందో తెలియాలి.

వీటిని ప్ర‌ధానంగా రెండు భాగాలుగా వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు. అవి మాక్రో వాస్కుల‌ర్‌, మైక్రో వాస్కుల‌ర్ ఇష్యూస్‌.

మాక్రో వాస్కుల‌ర్ : అంటే మ‌న‌దేహంలో పెద్ద‌విగా కంటితో నేరుగా చూడ‌గ‌లిగిన ర‌క్త‌నాళాలు. డ‌యాబెటిస్ కంట్రోల్‌లో లేని వారిలో ఈ ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్, క్యాల్షియ‌మ్ నిల్వ‌లు పేరుకుపోతుంటాయి. ఇది గుండె పోటుకు దారి తీస్తుంది. గుండెకు ర‌క్తాన్ని తీసుకువెళ్లే ఆర్ట‌రీల‌లో బ్లాక్ ఏర్ప‌డ‌డంతో వ‌చ్చే గుండె పోటు ఇది. ఇదే బ్లాక్ మెద‌డుకు ర‌క్తాన్ని చేర‌వేసే ర‌క్త‌నాళాల్లో జ‌రిగితే ప‌క్ష‌వాతం వ‌స్తుంది. కాలికి వెళ్లే ర‌క్త‌నాళాల్లో బ్లాక్ ఉన్న‌ప్పుడు న‌డిస్తే కాలు నొప్పి, అడుగు పెట్ట‌లేక‌పోవ‌డం వంటి ఇబ్బందులు వ‌స్తుంటాయి.

మైక్రో వాస్కుల‌ర్‌: అంటే… కంటికి క‌నిపించ‌నంత స‌న్న‌ని ర‌క్త‌నాళాలు మ‌న‌దేహంలో లెక్క‌లేన‌న్ని ఉంటాయి. అవి కంటికి, మూత్ర‌పిండాల వంటి కీల‌క భాగాల‌కు ర‌క్తాన్ని చేరుస్తాయి. వాటిలో బ్లాక్ వ‌చ్చిన‌ప్పుడు ఆయా భాగాల‌కు ర‌క్త‌సర‌ఫ‌రా క్ర‌మంగా త‌గ్గిపోవ‌డం లేదా ఒక్క‌సారిగా ఆగిపోవ‌డం వ‌ల్ల అవి ప‌ని చేయ‌డం మానేస్తాయి..

ఇక్క‌డ ఒక విష‌యం ముఖ్య‌మైన‌ది. గుండెకు ర‌క్తం అందించే వాటిలో పెద్ద ర‌క్త‌నాళాల‌తోపాటు చిన్న ర‌క్త‌నాళాలు కూడా కీల‌క‌మే. ఏ ర‌క్త‌నాళంలో ఇబ్బంది ఎదురైనా గుండె స‌మ‌స్య‌కు దారి తీస్తుంది. అయితే గుండెకు సంబంధించి ఎక్కువ‌గా వ‌స్తున్న స‌మ‌స్య‌లు పెద్ద ర‌క్త‌నాళాల‌వే ఉంటున్నాయి.

ప‌రిష్కార‌మెలాగ‌?

డ‌యాబెటిస్ వ‌చ్చిన త‌ర్వాత దానిని మేనేజ్ చేయాల్సిందే త‌ప్ప పూర్తిగా తొల‌గించ‌డం అసాధ్యమ‌నే చెప్తుంటారు డాక్ట‌ర్‌లు. అయితే డ‌యాబెటిస్ స్థాయిల‌ను అదుపులో చేయ‌డం మ‌న చేతుల్లోనే ఉంటుంది. మందుల వాడ‌కంతోపాటు మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డం, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవ‌డం, ఎక్స‌ర్‌సైజ్ పెంచుకోవ‌డం, ఆరోగ్య‌క‌రంగా త‌క్కువ మోతాదులో తిన‌డం వంటి అనేక ర‌కాల లైఫ్ స్ట‌యిల్ మార్పుల‌తోనే సాధ్యం.

ఇది వ‌చ్చేది లైఫ్‌స్ట‌యిల్ కార‌ణంగానే, త‌గ్గేది కూడా లైఫ్‌స్ట‌యిల్ మార్పుతోనే. రోజూ అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత బిరియానీ తిని వెంట‌నే నిద్ర‌పోయి, ఉద‌యం హ‌డావిడిగా ఆఫీస్‌ల‌కు ప‌రుగెత్తుతూ, త‌గినంత విశ్రాంతి లేకుండా జీవించ‌డంతోపాటు డెడ్‌లైన్‌ల ఒత్తిడి వంటివ‌న్నీ క‌లిసి దేహం మీద దాడి చేస్తాయి. రుచిగా తిన‌డం కోసం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని ముట్టుకోక‌పోవ‌డంతో దేహంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. దేహంలోని కండ‌రాలు త‌గినంత వ్యాయామం లేక బ‌ల‌హీన ప‌డి సాగిపోతుంటాయి. ఇవ‌న్నీ చేతులారా తెచ్చుకున్న‌వే. అయితే వీటిని కంట్రోల్ చేయ‌డం కూడా మ‌న చేతుల్లోనే ఉంది. కాబ‌ట్టి మ‌నం రోజూ వంద అడుగులు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్ర‌య‌త్నం మొద‌లు పెడితే ఇండియా డ‌యాబెటిస్ క్యాపిట‌ల్‌గా కాకుండా హెల్త్‌ క్యాపిట‌ల్‌గా అడుగులు వేస్తుంది.

NEWS UPDATES

CINEMA UPDATES