ఆత్మ‌హ‌త్య‌ల్లో రెండ‌వ‌స్థానం…. ఇదీ హైద‌రాబాద్ ప్ర‌గ‌తి

755

‘మొగుడు కోప‌మొచ్చి ఒక దెబ్బ వేశాడే అనుకో… కాపురాన్ని వ‌దులుకుని పుట్టింటికి రావ‌చ్చా’ అంటూ కూతురిని ద‌గ్గ‌ర‌కు తీసుకుని మంద‌లిస్తుంది ఓ త‌ల్లి. ఆ త‌ల్లికి కూతురి మీద ప్రేమ‌లేక కాదు అంత‌కంటే మ‌రో మాట చెప్ప‌డానికి గ‌త్యంత‌రం లేక మొగుడు కొట్టే దెబ్బ‌ల‌ను భ‌రించాల్సిందేనంటూ బుజ్జ‌గిస్తుంది. నాలుగు రోజుల త‌ర్వాత తీసుకెళ్లి భ‌ర్త ద‌గ్గ‌ర దింపేసి వ‌స్తుంటారు. ఆ త‌ర్వాత ఆ కాపురంలో కొట్ట‌డం, తిట్ట‌డం చాలా మామూల‌వుతుంటాయి. వీటిని చూస్తూ పెరిగిన అమ్మాయిలు పెద్ద‌యిన త‌ర్వాత భ‌ర్త నుంచి హింస‌ను ఆమోదించే ద‌శ‌కు చేరుతున్నారు.

అబ్బాయిలు తాము హింసించ‌వ‌చ్చ‌నే భ‌రోసాలో పెరుగుతున్నారు. దాంతో త‌రాలు మారినా అదే సీన్ రిపీట్ అవుతోంది. భ‌ర్త కొట్ట‌డం, భార్య ప‌డి ఉండ‌డం… ఈ సీన్ ని చూస్తూ పెద్ద‌వుతున్నారు పిల్ల‌లు. తండ్రి కి కోపం రావ‌డం … త‌ల్లి దెబ్బ‌లు తిన‌డం… ఇందులో త‌ప్పేముంది అన్న‌ట్లు మారిపోయింది.

ఇది స‌మాజంలో వేళ్లూనుకుని పోయిన దురాచారం. ఒక‌నాటి సినిమాలు కూడా ప్ర‌మోట్ చేసిన స్టోరీ లైన్‌. ఆ సినిమాల్లో కూడా దీనికంత‌టికీ కార‌ణంగా ఆర్థిక స‌మ‌స్య‌లుగానే ఉండేవి. ఈ నేప‌థ్యంలో ఇంకో ప్ర‌మాద‌క‌ర‌మైన క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్ అయింది. అవే పెరిగిపోతున్న ఆత్మ‌హ‌త్య‌లు. నిజానికి ఏ స‌మ‌స్య‌కూ ప‌రిష్కారం కాని ఆత్మ‌హ‌త్యలోనే త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని వెతుక్కుంటోంది హైద‌రాబాద్ న‌గ‌రం .

దేశంలో రెండ‌వ స్థానం

దేశంలో ఆత్మ‌హ‌త్య‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్న న‌గ‌రాల జాబితాలో రెండ‌వ‌స్థానంలో ఉంది హైద‌రాబాద్‌. వ‌ర‌క‌ట్న చావుల్లో మూడ‌వ స్థానంలో ఉంది. అభివృద్ధిలో హైద‌రాబాద్ ప్ర‌పంచ స్థాయి న‌గ‌రాల జాబితాలో ఉంద‌ని భుజం చ‌రుచుకుంటున్నారు పాల‌కులు. కానీ మ‌ర‌ణాల విష‌యంలో నూ రెండు- మూడు స్థానాల్లో ఉండ‌డం అంటే… స‌మాజం సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన ప‌రిస్థితి. స‌మాజం ఆరోగ్యంగా లేని న‌గ‌రం సాధించిన‌ అభివృద్ధిని అభివృద్ధి అని ఏ ర‌కంగా చెప్పుకోవాలి? స‌మాజంలో ప్ర‌జ‌లు విలువ‌ల రీత్యా ఎద‌గ‌క‌పోతే ఆ న‌గ‌రాన్ని అభివృద్ధి చెందిన న‌గ‌రం అని ఎలా చెప్పుకోవాలి? ముఖ్యంగా మ‌హిళ… త‌న ర‌క్ష‌ణ కోసం త‌న‌కు త‌ను ర‌క్ష‌ణ క‌వ‌చంగా మార‌డానికి సిద్ధంగా లేని స‌మాజాన్ని డెవ‌ల‌ప్‌డ్ సొసైటీ అన‌వ‌చ్చా? నేటికీ మ‌హిళ‌లు భ‌ర్త కొట్ట‌డంలో వింత ఏముంది? అంటున్నారంటే మ‌న స‌మాజం ఎక్కడ ఉన్న‌ట్లు?

అవును… కొడ‌తాడు!

న‌గ‌రంలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీస్తున్న కార‌ణాల‌లో కుటుంబ క‌ల‌హాలే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఆరోగ్య స‌మ‌స్య‌లు, ఆర్థిక క‌ష్టాలు కూడా ప్ర‌భావితం చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌ధానంగా భార్యాభ‌ర్త‌ల గొడ‌వ‌లే ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపిస్తున్నాయి. ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీస్తున్న ప‌రిస్థితుల అంచ‌నా కోసం నిర్వ‌హించిన స‌ర్వేలో డొమెస్టిక్ వ‌యొలెన్స్ పాత్ర కీల‌కంగా క‌నిపించింది. భార్య‌ను కొట్ట‌డం మాత్ర‌మే కాక‌, తిట్ట‌డం, కోపంతో వ‌స్తువుల‌ను విసిరివేయ‌డం వంటివి కూడా హింస కింద‌కే వ‌స్తాయ‌ని విడ‌మ‌రిచి చెప్పి మ‌రీ వారి అనుభ‌వాల‌ను అడిగిన‌ప్పుడు స‌భ్య స‌మాజం నోరెళ్ల‌బెట్టే స‌మాధానం వ‌చ్చింది ఆ మ‌హిళ‌ల నుంచి. భ‌ర్త కొడ‌తాడా అని అడిగిన ప్ర‌శ్న‌కు ‘అవును… కొడ‌తాడు’ అనే స‌మాధానం వ‌చ్చింది. కొడితే త‌ప్పేంటి అనే టోన్ ధ్వ‌నిస్తోంది వారి మాట‌ల్లో.

గాయం… సైనికుడికి గ‌ర్వ‌కార‌ణ‌మే! మ‌రి మ‌హిళ‌కు?

అనేక మంది మ‌హిళ‌ల ఒంటి మీద గాయాలు క‌నిపిస్తుంటాయి. వాటిని చీర‌తోనో చున్నీతోనో దాచేస్తూ మాట్లాడుతుంటారు. చూసిన వాళ్లు కూడా ఆ గాయానికి కార‌ణం తెలుస‌న్న‌ట్లు ప్ర‌శ్నించ‌కుండా మౌనంగా ఉంటారు. అవి మ‌హిళ‌ల ఒంటి మీద మ‌చ్చ‌లు కాదు, వైవాహిక జీవితానికి మ‌చ్చ‌లు. ఇదీ నేటికీ స‌మాజంలో న‌డుస్తున్న వైవాహిక జీవితాల తీరు. ఒక సైనికుడికి గాయం తాలూకు మ‌చ్చ ఎప్ప‌టికీ గ‌ర్వ‌మే. మ‌రి ఒక మ‌హిళ‌లకు ఒంటి మీద గాయం దేనికి చిహ్నం. మ‌గ‌వాడి దౌర్జ‌న్యానికి చిహ్నం. ఇలాంటి దౌర్జ‌న్య చిహ్నాలు మ‌న డెవ‌ల‌ప్‌డ్ సిటీలో చాలా కామ‌న్‌. ఈ దౌర్జ‌న్య చిహ్నాల‌ను మోసి మోసి ఇక కొత్త చిహ్నాల‌కు ఒంటి మీద తావు లేక బ‌తుకును ఉరికంబానికి వేళ్లాడ‌దీస్తున్నారు.

టీనేజ్‌లో ఒక తిట్టు చాలు!

పెద్ద వాళ్ల‌లో ఆత్మ‌హ‌త్య‌ల కార‌ణాలు అలా ఉంటే… టీనేజ్ పిల్ల‌లు త‌ల్లిదండ్రులు తిట్టార‌ని, స్కూల్లో టీచ‌ర్ తిట్టార‌ని ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డుతున్నారు. ఇంట్లో ఇద్ద‌రు పిల్ల‌ల మ‌ధ్య త‌గాదా వ‌చ్చిన‌ప్పుడు పేరెంట్స్ ఒక‌రిని స‌పోర్ట్ చేసి రెండ‌వ వాళ్ల‌ను మంద‌లించారంటే… ఆ కార‌ణం చాలు వాళ్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి. సైకాల‌జిస్టుల దృష్టికి వ‌స్తున్న‌ అనేక సంఘ‌ట‌న‌లు ఇలాంటివే. ఇక మాన‌సిక ఆరోగ్య నిపుణులు పూర్ణిమా నాగ‌రాజ చెప్పిన ఒక సంఘ‌ట‌న … స‌మాజాన్ని వ‌ణికించేస్తుంది.

అలాగైనా ప్రేమ‌గా చూస్తార‌ని!

ఆరేళ్ల పిల్ల‌వాడు త‌న‌ను తాను క‌త్తితో పొడుచుకున్నాడు. పొట్ట‌మీద తీవ్ర‌మైన గాయాలు. త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్త‌మై హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. దేహానికి ఆరోగ్యం చేకూరిన త‌ర్వాత మాన‌సిన ఆరోగ్య నిపుణుల‌ను సంప్ర‌దించారు. త‌న‌ను తాను పొడుచుకోవ‌డానికి ఆ కుర్రాడు చెప్పిన కార‌ణం ఏంటో తెలుసా? ‘అలాగైనా అమ్మానాన్న‌లు త‌న‌ను ప్రేమ‌గా చూస్తారేమోన‌ని’ అది విన్న డాక్ట‌ర్క్‌ కి కొద్ది క్ష‌ణాలు అయోమ‌యం. ప‌క్క‌నే కూర్చుని వింటున్న పేరెంట్స్ భ‌యంతోపాటు సిగ్గు. పిల్ల‌వాడు ఆ నిర్ణ‌యానికి రావ‌డానికి కార‌ణం ఏంటంటే… ఆ భార్యాభ‌ర్త‌లు ఇంట్లో ఎప్పుడూ గొడ‌వ‌లు ప‌డుతుంటారు. కీచులాట‌ల మ‌ధ్య పిల్ల‌వాడిని ప‌ట్టించుకోరు. పిల్ల‌వాడు అమ్మానాన్న‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లినా ఎవ‌రూ ద‌గ్గ‌ర‌కు తీసుకునే స్థితిలో ఉండ‌రు. త‌న‌కు కావ‌ల్సింది పేరెంట్స్ ద‌గ్గ‌ర దొర‌క‌డం లేదు. చ‌చ్చిపోతే అయినా పేరెంట్స్ ప్రేమ‌గా చూస్తారేమోన‌ని క‌త్తితో పొడుచుకున్నాడు. ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి ఉండాల్సిన మాన‌సిక ద‌గ్గ‌రిత‌నం లేక‌పోతే బంధాలు ఇలాగే చ‌చ్చిపోతాయి.

స‌ర్వేల్లో వెల్ల‌డ‌వుతున్న అంకెలు దేహాల చావుల‌వి కాదు, అనుబంధాల మ‌ర‌ణాల‌వి.

NEWS UPDATES

CINEMA UPDATES